హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): రెండో పీఆర్సీపై సర్కార్ ఉద్యోగులకు మళ్లీ మొండిచేయి చూపింది. కనీసం రిపోర్ట్‌ను కూడా తెప్పించుకోలేకపోయింది. పీఆర్సీ కమిటీ గడువు బుధవారం ముగిసింది. కానీ రిపోర్ట్ మాత్రం ప్రభుత్వానికి చేరలేదు. నివేదిక సమర్పణ మీద స్పష్టత లేకపోవడంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి. నివేదిక తెప్పించుకునే విషయంలో జాప్యం దేనికని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. గత మార్చి 29న పీఆర్సీ కమిటీని రిపోర్ట్ గడువును పొడిగించారు. ఇప్పు డు కూడా కమిటీ గడువును మరోసారి గోప్యంగా పొడిగించే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటున్నది. ఏదో ఒక ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఎన్నికల కోడ్ వస్తే ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి అది అడ్డుగా నిలుస్తుంది.
39 నెలలుగా లాస్..
రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులకు 2023 జూలై ఒకటి నుంచి రెండో పీఆర్సీ అమలు చేయాల్సి ఉంది. గత కేసీఆర్ సర్కార్ రిటైర్డ్ ఐఏఎస్ శివశంకర్ అధ్యక్షతన పీఆర్సీ కమిటీని ఏర్పాటుచేసింది. కమిటీ గడువు మార్చి 31తో ముగిసింది. కానీ కమిటీ గడువును గోప్యంగా పొడిగించారు. తాజాగా ఆ గడువు కూడా సెప్టెంబర్ 30వ తేదీతో ముగిసింది. గత 39 నెలలుగా ఉద్యోగులు పీఆర్సీని నష్టపోతున్నారు. ప్రతి 60 మాసాలకు ఒక పీఆర్సీ అమలు చేయడం రాష్ట్రంలో ఆనవాయితీగా వస్తున్నది. కానీ 39 నెలలుగా పీఆర్సీ వర్తించకపోవడం, నిత్యావసరాల ధరలు పెరగడంతో ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు అవస్థలు పడుతున్నారు.
మళ్లీ కొత్త పీఆర్సీ కమిటీ!
గత కేసీఆర్ సర్కార్ రెండు పీఆర్సీలు ఇచ్చింది. తెలంగాణ పీఆర్సీ పేరిట 43శాతం ఫిట్మెంట్, 2020లో 30శాతం ఫిట్‌మెంట్‌ను వర్తింపజేసింది. దీంతో ఉద్యోగుల వేతనాలు 73శాతం పెరిగాయి. మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీని వర్తింపజేస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఉద్యోగులను మోసం చేసింది. 2023 పీఆర్సీ పరిస్థితి ఇలా ఉంటే 2028లో మూడో పీఆర్సీ రావాల్సి ఉంది. ఈ గడువుకు ఆరు నెలల ముందే మూడో పీఆర్సీ కమిటీని నియమించాల్సి ఉంటుంది. కొత్త పీఆర్సీ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో కాలయాపన చేసి.. తీరా గడువు ముగిసిన తర్వాత అయిపోయింది కదా అనే ప్రమాదముందని ఉద్యోగ సంఘాల నేతలు వాపోతున్నారు.

నాలుగింటికి ఒకదానిపైనే
ఉద్యోగుల జేఏసీ మొదట 64 డిమాండ్లు ప్రభుత్వం ముందుంచింది. చివరికి నాలుగు ప్రధాన డిమాండ్లకు మాత్రమే పరిమితమయ్యింది. ఈ నాలుగు డిమాండ్లలో ప్రస్తుతం రెండు డీఏలపై మాత్రమే ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉండగా.. రెండు డీఏలకు మాత్రమే ప్రభుత్వం గ్రీన్సిగ్నల్నిచ్చింది. 2004కు ముందు నియమితులైన వారికి పాత పింఛన్ అమలు, సీపీఎస్ రద్దుపై కమిటీ వేస్తామని చెప్పినా కమిటీ వేయలేదు. పీఆర్సీ రిపోర్ట్‌ను తెప్పించుకుని.. 51శాతం ఫిట్‌మెంట్‌ను వర్తింపజేయాలని కోరాయి. పెండింగ్ బిల్లుల విడుదలను వెయ్యికోట్ల నుంచి రెండు వేల కోట్లకు పెంచాలని కోరింది. దీనిపైనా స్పష్టమైన హామీ రాలేదు. డీఏలు తప్ప మిగిలిన హామీలపై సర్కార్ మీనమేషాలు లెక్కిస్తున్నది.
మళ్లీ ఉద్యమబాటలో జేఏసీ
పీఆర్సీ కమిటీ రిపోర్ట్‌ను తెప్పించుకోపోవడంలో సర్కార్ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నది. ప్రతిసారి చర్చలు జరపడం.. హామీలివ్వడం.. ఆ తర్వాత విస్మరించడం జరుగుతున్నది. ప్రభుత్వాన్ని నమ్మిన ప్రతిసారి విశ్వాసఘాతుకానికి పాల్పడుతున్నదంటూ ఉద్యోగులంతా రగిలిపోతున్నారు. మాట తప్పిన.. మడమ తిప్పిన సర్కార్‌పై ఉద్యోగుల జేఏసీ సమరశంఖం పూరిస్తున్నది. తమ ఉద్యమం ముగియలేదని.. అది నిరంతర ఉద్యమమని జేఏసీ ఇప్పటికే ప్రకటించింది. వాగ్దానం చేసినట్టు రిపోర్ట్ తెప్పించుకోకపోతే మళ్లీ ఉద్యమిస్తామంటున్నది. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగుల సత్తాను చాటుతామని.. ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు.
ఉద్యోగులతో చెలగాటం
పీఆర్సీ రిపోర్ట్ తెప్పించుకోవాలని డిప్యూటీ సీఎంను ఆదేశిస్తామని.. జూన్ 2న నుంచి పీఆర్సీని వర్తింపజేస్తామని సాక్షాత్తు సీఎం రేవంత్‌రెడ్డి 2026 మేలో ఉద్యోగుల జేఏసీ నేతలకు హామీనిచ్చారు. దీనికి అతీగతీ లేకుండా పోయింది.
సెప్టెంబర్ నెలాఖరులోగా పీఆర్సీ నివేదికను తెప్పించుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉద్యోగుల జేఏసీ నేతలకు హామీనిచ్చారు.
సెప్టెంబర్ 9న ఉద్యోగ సంఘాల జేఏసీతో జరిపిన చర్చల్లో పది రోజుల్లో పీఆర్సీ నివేదికను తెప్పించుకుంటామని సీఎస్ సంజయ్‌జాజు చెప్పారు. పీఆర్సీ రిపోర్ట్‌ను త్వరగా సమర్పించాలని పీఆర్సీ కమిటీకి సీఎస్ లేఖ కూడా రాశారు.
ఈ గడువు ముగిసినా పీఆర్సీ నివేదిక సర్కార్‌కు చేరలేదు.
పీఆర్సీ కమిటీ రిపోర్ట్ ప్రభుత్వానికి సీల్డ్ కవర్లో వస్తుందని, ఆ కవర్ విప్పాలని, నివేదికను ప్రభుత్వం పరిశీలించాలని.. ఉద్యోగుల జేఏసీ నేతలతో సెప్టెంబర్ 23న ఎంసీఆర్‌హెచ్చార్డీలో జరిగిన చర్చల్లో ప్రభుత్వ ప్రతినిధులు పేర్కొన్నారు.