మహబూబాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : గిరిజన బాంధవుడు కేసీఆర్ అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కొనియాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన రిజర్వేషన్ పెంపు అమల్లోకి వచ్చి నాలుగేండ్లు పూర్తవుతున్న సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ బుధవారం ఆమె మహబూబాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత పదేండ్ల కేసీఆర్ పాలనలో గిరిజనుల అభివృద్ధి, సంక్షే మం కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు.
తరతరాలుగా గిరిజనులు ఎదురుచూస్తున్న హకులు, ఆకాంక్షలను గుర్తించి, అనేక సమస్యలకు పరిషారం చూపే దిశగా ఆయన అడుగులు వేశారని కొనియాడారు. రిజర్వేషన్ 6% నుంచి 10 శాతానికి పెంచి గిరిజన సమాజం ఆత్మగౌరవం నిలబెట్టారని, కేసీఆర్ కృషిని ఈ జన్మలో వారు మర్చిపోరని తెలిపారు. గిరిజనుల రిజర్వేషన్ అనేది ఎన్నో ఏండ్లుగా చేస్తున్న పోరాటమని, వారి ఆకాంక్షను గుర్తించి 2022 సెప్టెంబర్ 30న గిరిజనుల రిజర్వేషన్‌ను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. ఈ చరిత్రాత్మక నిర్ణయానికి నేటితో నాలుగేండ్లు పూర్తయ్యాయని తెలిపారు. రాష్ట్రంలోని గిరిజన విద్యార్థులు, ఉద్యోగార్థులకు రిజర్వేషన్ అవకాశాలను 10 శాతానికి పెరిగాయంటే ఆ ఘనత కేసీఆర్‌దేనని పేర్కొన్నారు.
అలాగే గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి, తండాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని, ఎన్నో ఏండ్లుగా తండాల ప్రజలు కోరుకున్న గ్రామపంచాయతీ హోదాను కల్పించారని గుర్తుచేశారు. గిరిజన ప్రాంతాల్లో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి గిరిజన బిడ్డలకు విద్యా అవకాశాలను విస్తరించారని, దశాబ్దాలుగా గిరిజనులను వెంటాడిన పోడు భూముల సమస్యను తీర్చి వాటిపై హకులు కల్పించినట్టు చెప్పా రు. గిరిజన బిడ్డల భవిష్యత్ కోసం, తండాల అభివృద్ధి కోసం, వారి ఆత్మగౌరవం కోసం కేసీఆర్ చేసిన కృషికి గిరిజన సమాజం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, జడ్పీ మాజీ చైర్పర్సన్ బిందు పాల్గొన్నారు.