ఈసాణుడికి అల్లడు అనే భటుడు ఏకాంతంలో ఒక విషయం చెబుతాను అంటాడు. అది విన్న పోటిసుడు తమ గురించిన రహస్యం చెప్తాడేమోనని భయపడతాడు. పోదన నగరం వెళ్లి కుసుమ శ్రేష్ఠి కుటుంబం వివరాలు తెలుసుకొని రమ్మని సచ్చసామితో అంటుంది కమలసత్తి. తర్వాత..
హఠాత్తుగా గుమ్మంలో ప్రత్యక్షమైన ఈసాణుడిని చూసి ముగ్గురూ కంగారుపడ్డారు. ఆ ముగ్గురు.. దేవి, సుద్ది, అవణాయరు. అవణాయరు, దేవి ఏదో గుసగుసలాడుతూ ఉంటారు. కొద్దిదూరంలో వంటకు ఏర్పాటు చేసుకుంటూ వీళ్లను ఓ కంట కనిపెడుతూ ఉంటుంది సుద్ది. ముగ్గురూ ఒకేసారి ఈసానుణ్ని చూసినారు. “మహారాజా! ఏమిటి ఇట్లా హఠాత్తుగా దర్శనమిచ్చినారు? నాకు కబురు చేస్తే, నేనే వచ్చేవాడిని కదా!” అన్నాడు అవణాయరు కంగారును కప్పించుకుంటూ. “మరేం లేదు మిత్రమా! ఈ మధ్యకాలంలో తమరు గృహం వదిలి బయటికి రావడం లేదు కదా! ఆరోగ్యం సరిగ్గా లేదేమోనన్న అనుమానం కలిగింది. ఈ పరిస్థితుల్లో నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని, మేమే రావలసి వచ్చింది. ఏం.. రాకూడదా? రావడం మీ ఏకాంతానికి అడ్డంకిగా మారిందా..?” ఆడవాళ్లిద్దరినీ మార్చి మార్చి, పరికించి చూస్తూ అన్నాడు.. ఒక్కొక్క మాట వత్తి పలుకుతూ ఈసాణుడు. అవణాయరు ఏమీ మాట్లాడలేని స్థితిలో పడిపోయినాడు; దేవి రూపంలోని వామదేవుడు.. ‘ఇది పెద్ద ప్రమాదమే!’ అనుకున్నాడు; సుద్ది రూపంలోని సౌగంధిక.. పులి ముందు నిలబడ్డ జింకలా వణికిపోసాగింది. ఆడవాళ్ల వైపు చూస్తూ.. “ఓహో! వీళ్లేనా బుధవారం సంత నుంచి తెచ్చుకున్న వంటలక్కలు! బాగున్నారు! నిజానికి నేను వచ్చిందే వీళ్ల కోసం..” అన్నాడు నవ్వుతూ. ప్రమాద ఘంటికలు వాళ్లిద్దరి గుండెల్లో మార్మోగ సాగినాయి!
“వీళ్లు.. వీళ్లు..” అంటూ ఏదో చెప్పబోయినాడు అవణాయరు. “నీవేం కంగారు పడకు అవణా! వీళ్లు పూర్తిగా నీ సొంతం. నేను వీళ్లను ముట్టుకోను. మిత్రుని సంపదను కోరుకునేంత దుర్మార్గుడు కాడు ఈ ఈసాణుడు..” అన్నాడు ఈసాణుడు. ‘నీ జీవితమే అది కదరా పరాన్నభుక్కు! పందికొక్కు!’ మనసులోనే అనుకున్నాడు వామదేవుడు. “మరి..?” ‘వాళ్లతో ఏం పని ఉందో అర్థం కావడం లేదు’ అన్నట్లు మొహం పెట్టినాడు అవణాయరు. “చెప్పినాను కదా మిత్రమా! వీళ్లు పూర్తిగా నీవాళ్లు. నాకు వీళ్ల మీద వ్యామోహం లేదు కానీ, వీళ్లతో కొంచెం పని ఉంది” అన్నాడు ఈసాణుడు. తనకది ఇష్టం లేనట్లు తలవంచుకున్నాడు అవణాయరు. మళ్లీ నవ్వినాడు ఈసాణుడు.. “కారణం చెబితే గానీ పంపవా ఏమి? నేనేమీ వాళ్లను కొరుక్కు తిననులే! అయినా నీవు కూడా వీళ్లతోపాటు రావచ్చు! రేపు వనభోజనం ఏర్పాటు చేస్తున్నాం. వీళ్లు చాలా కమ్మగా వండుతారని తెలిసింది. వంటలు చేయడానికి వీళ్లను వెంటబెట్టుకొని రమ్మంటున్నాను!” అన్నాడు ఓరకంట అందరి ముఖాలను చదివే ప్రయత్నం చేస్తూ.
అతను ఊహించినట్లే ముగ్గురి ముఖాల్లో మార్పు స్పష్టంగా కనిపించింది. అంతసేపు వాళ్లు అనుభవించిన మానసిక ఒత్తిడి నుంచి బయటపడ్డట్టు ఆ మొహాలు చెప్పకనే చెప్తున్నాయి. అదే ఈసాణుడు కోరుకున్నది కూడా.. “ఇది నీకు సమ్మతమే కదా మిత్రమా!” అన్నాడు నవ్వుతూ. “తమ ఆజ్ఞ మహారాజా!” అన్నాడు ప్రసన్న వదనంతో అమాయకుడు అవణాయరు. “అదీ లెక్క..! మరి మాకు సెలవా మిత్రమా!” అంటూ అవణాయరు సమాధానం కోసం చూడకుండా ఆ మందిరం నుండి బయటికి నడిచినాడు ఈసాణుడు. మనసులోని సంశయం తొలగిపోయి సంతోషాంతరంగుడైనాడు అవణాయరు కానీ, వామదేవుని అనుమానం అట్లాగే ఉంది; సుద్ది మనసులో భయం పోలేదు. వాళ్ల భయాందోళనలను అధికం చేస్తూ.. “అవణాయరూ…!” అన్నాడు కాస్త గట్టిగా, గుమ్మం వద్ద నిలబడి ఈసాణుడు. నాలుగడుగుల్లో అతని వద్దకు చేరుకొని, “ఆజ్ఞ!” అన్నాడు అవణాయరు. “ఈ భటుణ్ని నాతో పంపించండి!” అన్నాడు.. అక్కడ కాపలాగా ఉన్న జాయపను చూపిస్తూ ఈసాణుడు. గుండెలో రాయి పడ్డట్లయింది జాయప రూపంలో ఉన్న జయసేనునికి. అయినా, అంతలోనే అన్నిటికీ సంసిద్ధమైనాడు. మారు మాట్లాడకుండా కసాయి వెంట గొర్రెలా ఈసాణుడిని అనుసరించినాడు జాయప/ జయసేనుడు.
* * *
చూడు దిక్కులందు శుభ గుణ చరిత! నీ జాడ గోచరించె నీడ వోలె నీదు చిత్రపటము నిజముగా వ్రేలాడ దీసినా రదేమి దెసల నిండ! (ఓ శుభకరమైన చరిత్ర గలవాడా! ఏ దిక్కు చూసినా నీడలా నీవే కనిపిస్తున్నావు. నిజంగా దిక్కుల నిండా నీ చిత్రాలు వేలాడదీసినారా ఏమి?)” అన్నది తదేకంగా ప్రణాలానందుని చూస్తూ ఆరాధనగా భాణుసత్తి. ఈమధ్య ఆమె ఒక్క క్షణమైనా ఆనందుని చూడకుండా, తలచుకోకుండా ఉండలేకపోతున్నది. ఈ విషయం కమలసత్తి చూసీ చూడనట్లు వదిలేస్తున్నా.. ఆహవ మాత్రం జీర్ణించుకోలేక పోతున్నది; అంగీకరించలేక పోతున్నది. అందుకు తగినట్లుగానే ఆహవ ముందు ఆనందుని రాసుకొని పూసుకుని తిరుగుతున్నది భాణు. వనవిహారం నెపంతో ఆనందునితో కలిసి బయలుదేరిన భాణుసత్తి వెంట తానూ బయలుదేరింది ఆహవ. ఆమెను ఉడికించాలని మరింత అతిగా ప్రవర్తిస్తున్నది భాణు. మింగలేక కక్కలేక అవస్థ పడుతున్నాడు ప్రణాలానందుడు. అతని మనసు పదేపదే డోలాయమానం అవుతున్నది. ఇది సజ్జన పద్ధతి కాదు! మాతృవత్ పరదారేషు – పరద్రవ్యేషు లోష్ఠవత్ ఆత్మవత్ సర్వభూతేషు – యః పశ్యతి స పండితః (పర స్త్రీలను తల్లి వలె; పర ధనాన్ని గడ్డి పోచవలె; సకల ప్రాణులను తనవలె చూడగలుగు వాడే పండితుడు. అంటే.. వివేకవంతుడు) మరి తానేం చేస్తున్నాడు? కావాలనే పరాయి వాని భార్య కావాలని ఆరాటపడుతున్నాడు. కోరికలను జయించవలసిన బుద్ధుని మార్గంలో పయనిస్తూ కూడా ఇటువంటి ధర్మ భ్రష్టమైన పనులను చేయడం సమంజసమా? పైగా ఏ స్త్రీ కారణంగా తాను మృత్యువు ద్వారం దాకా వెళ్లి వచ్చినాడో ఆమె వెంటనే పడుతున్నాడు! అంటే.. ఇంతకంటే పతనం మరొకటి ఉంటుందా? మనిషి దుఃఖాన్ని వెతుక్కుంటూ పరిగెత్తడం అంటే ఇదే కదా!
చచ్చిపోతున్న తనను కాపాడి కొత్త జీవితాన్నిచ్చి, ఉత్తమ మార్గాన్ని బోధించిన మహానుభావుడు ఆచార్య మాధవుని ప్రయాస అంతా పునఃపరిచయంతో అంతం చేసిందీ సుందరి. స్త్రీ శక్తి ఇంత శక్తిమంతమా? దీన్ని వివేకమనే ఆయుధం జయించలేదా? తాను చేస్తున్నది పాపం కాదా? ఈ పాప కూపంలో నుంచి తప్పించుకునే మార్గమే లేదా?.. “మార్గం కోసం ఆలోచిస్తున్నావా మన్మథాకారా?” మనసులోని మాటను కనిపెట్టినట్లు అన్నది భాణుసత్తి. ఉలిక్కిపడ్డాడు ఆనందుడు. “నాకు భర్త ఉన్నాడని తెలుసు కానీ, ఏనాడూ అతని ముఖం స్పష్టంగా చూడలేదు; ఒక్క మాట కూడా అతనితో మాట్లాడలేదు; స్పర్శ సుఖాన్ని పొందలేదు; ఏనాడూ అతను నాకు చేరువలో లేడు; లేక భగవంతుడే లేకుండా చేస్తున్నాడో! మనం చాలా అనుకుంటాం గానీ అనుకున్నవన్నీ అనుకున్నట్లు అవుతాయా? నాకు మాత్రం పర పురుషునితో గడపాలని ఉందనుకున్నావా? ఇప్పుడు నాకు తాళి కట్టిన వాడే పరపురుషుడుగా అనిపిస్తున్నాడు! నా మనసు నిండా నీవే ఉన్నావు! నీవు నా సొంత మనిషివి అనే భావన కలుగుతున్నది. భావనా బలాన్ని పరిపుష్టం చేయలేని సంప్రదాయం గొప్పదా? సంప్రదాయాన్ని తలదన్నే భావన గొప్పదా?”.. ఆశ్చర్యంగా ఆమె మాటలు వింటున్నాడు ఆనందుడు. ఆమె తన వాక్ ప్రవాహాన్ని కొనసాగించింది.. “ఏ సంప్రదాయమైనా మనిషిలో పరివర్తన తీసుకొని రావాలి. అట్లా జరగనప్పుడు దాన్ని అనుసరించడంలో అర్థం లేదు కదా! ఇప్పుడు నీవే నాకు అన్ని విధాలుగా తగిన తోడు అని మనసు చెబుతున్నది. నన్ను నిరాశ పరచకు.
నియంత్రించవలసిన మా అత్తగారే జాలిపడి, నన్ను నీ వశం చేస్తున్నప్పుడు నీవెందుకంత స్తబ్ధంగా ఉన్నావు. నేను సిగ్గు విడిచి అడుగుతున్నాను! నన్ను ఎక్కడికైనా తీసుకొని పో! నీవెక్కడుంటే అక్కడనే నాకు స్వర్గం! అది నరకమైనా, నీవున్న చోటే నాకు ఆనందమయం! నన్ను అర్థం చేసుకో! ఇద్దరం కలిసి దూరంగా వెళ్లి కొత్త జీవితం ప్రారంభించుదాం!” అంటూ గట్టిగా అతని చేతులు పట్టుకున్నది భాణుసత్తి. నోట మాట రాలేదు ప్రణాలునికి. అంతసేపటి వివేకం అతనిలో నుండి అంతర్ధానమైంది. కొద్దిదూరంలో నుండి ఈ తతంగమంతా గమనిస్తున్న ఆహవలో అంతర్మథనం మొదలైంది. ‘ఇంతకూ ఏం జరుగుతున్నది ఇక్కడ? ఇది విపరీత బుద్ధే కదా! బుద్ధుని మార్గంలో వెళ్లవలసిన వాని బుద్ధి గడ్డి తిన్నది. ఉన్నత కుటుంబంలో పుట్టిన ఈ రోహ ఉంపుడుగత్తెలా ఆలోచిస్తున్నది ఎందుకు? వయసులో ఉన్న వీళ్లిద్దరి సంగతి పక్కన పెడితే.. పెద్దరాణి గారి అనుభవ జ్ఞానం ఏం చేస్తున్నది? పరిస్థితి ఇంత దారుణంగా తయారు కావడంలో ఎవరి పాత్ర ఎంత? బుద్ధి చెప్పవలసిన అత్తగారే చెడు దారిలో నడవడాన్ని ఎగదోస్తుంటే.. ఎవ్వరినని ఏం లాభం? రోహ గురించి తాను ఎంతో గొప్పగా ఆలోచించింది. ఆమె అందం; అంతకుమించిన మంచి మనసు; తనను సొంత చెల్లిలా భావించిన ఆమె ఉదారమైన ప్రేమ.. అన్నీ తనకు ఎంతగానో నచ్చినాయి. కానీ, ఇప్పుడు చూస్తుంటే ఆమెలోని కోరికలు అన్నిటినీ మించిన బలమైన శక్తులు అనిపిస్తున్నాయి. కోరికలు నెరవేర్చుకోవడం కోసం మనిషి ఇంతగా దిగజారడం అవసరమా? బుద్ధదేవుడు ‘దుఃఖానికి కారణం కోరికలే!’ అని ఎందుకన్నాడో ఇప్పుడు అర్థమవుతున్నది. అక్క తీసుకున్న ఈ నిర్ణయం ఎంత అనైతికం! దీనివల్ల పరువు పోతుంది; చెడ్డపేరు వస్తుంది; వంశ గౌరవం పాడవుతుంది. ఈ విపత్తును ఆపడం ఎట్లా?’ అని పరిపరి విధాలుగా ఆలోచించ సాగింది ఆహవసత్తి.
* * *
అస్మక మహారాజు సౌరిసంబ.. ముళక రాజ్యాధిపతి విష్ణుముఖుని చూసి ఎంతగానో సంతోషించినాడు. అతని స్నేహితుడు మేఘచంద్రుని పట్ల కూడా ఎంతో ఆత్మీయత కనబరిచినాడు. ముగ్గురూ కలిసి భోజనాదికాలు పూర్తి చేసుకున్న తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఈ విధంగా చర్చించుకున్నారు.. “మీతో ఈ విధంగా సమయం గడపడం చాలా ఆనందదాయకం మహారాజా!” విష్ణుముఖుడు. “ఉత్తములకు ఆతిథ్యం ఇవ్వడం సాక్షాత్తూ దేవతార్చన వంటిది మహారాజా! ఇది నా భాగ్యం!” సౌరిసంబ. “ఉన్నతులైన మీ సరసన కూర్చునే అదృష్టం లభించడం జన్మజన్మల పుణ్యఫలం!” మేఘచంద్రుడు. “మా మేఘచంద్రుడు వైశ్య శ్రేష్ఠుడైనప్పటికీ మహోదారుడు; మన తాహతుకు ఏమాత్రం తగ్గనివాడు. మంచితనంలో, దానగుణంలో అతణ్ని మించినవారు లేరనడం అతిశయోక్తి కాదు!” విష్ణుముఖుడు. “అవునా! మా పోదనలో కూడా ఒక వణిక్ ప్రముఖులు ఉన్నారు. ఆయన చాలా సుప్రసిద్ధులు. పేరు కుసుమ శ్రేష్ఠి. మాకు అత్యంత ఆప్తులు, ఆత్మీయులు. ఈ మధ్య వారి కుటుంబానికి తీరని విపత్తులు కలిగినాయి” సౌరిసంబ. “వీరు.. వారి వియ్యంకులే! ఈ మేఘచంద్రుని పెద్ద కూతురును శ్రేష్ఠి కుమారుడు జయసేనునికి ఇచ్చి వివాహం జరిపించినారు!” విష్ణుముఖుడు.
ఆ మాటలతో సౌరి సంబకు హఠాత్తుగా గుర్తుకొచ్చింది. “మహారాజా! మీరు కుసుమ శ్రేష్ఠి కుటుంబం విషయమే వివరంగా తెలుసుకొమ్మని గతంలో ఒక మనిషిని పంపినారు కదా!” విష్ణుముఖ మేఘచంద్రులు సంతోషాంతరంగులైనారు. తాము చెప్పే అవసరం లేకుండానే సౌరిసంబ మహారాజు ఆ సంగతి ప్రస్తావించడం వాళ్ల ఆనందానికి కారణం. “అవును మహారాజా! ప్రస్తుతం మేము తమరి దర్శనం చేసుకున్నది కూడా ఆ విషయం చర్చించడానికే!” అన్నాడు విష్ణుముఖుడు ఆ వెంటనే. “ఓహ్! అవునా! అయితే అమాత్య శేఖరులను, సేనాధిపతుల వారినీ పిలిపిద్దాం” అని.. “ఎవరక్కడ?” అన్నాడు. “చిత్తం ప్రభూ!” అంటూ ఉత్తర క్షణంలో ఒక భటుడు అక్కడ ప్రత్యక్షమైనాడు. “మహామంత్రి చామీకరుణ్ని, సేనాధిపతి మలయసేహరుణ్నీ సత్వరమే మా అంతరంగిక భవనమునకు రమ్మని కబురు చేయండి!” ఆజ్ఞాపించినాడు మహారాజు. “ఆజ్ఞ ప్రభూ!” అంటూ అభివాదం చేసి వెళ్లిపోయినాడు భటుడు. మరో ఐదు నిమిషాల్లో మహామాత్యుడు చామీకరుడు అక్కడికి వచ్చి, అభివాదం చేసినాడు రాచమర్యాదను అనుసరించి. “మహామాత్యా! ఆసీనులు కండి!” అంటూ తనకు చేరువలో ఉన్న ఆసనం చూయించినాడు సౌరిసంబ మహారాజు. విష్ణుముఖుని, మేఘచంద్రుని పరిచయం చేసినాడు రాజు. మరో ఐదు నిమిషాల తర్వాత.. “అదేమీ! మలయసేహరులు ఇంకా రాలేదు?”అన్నాడు మహారాజు.