సంగారెడ్డి ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ)/ కలెక్టరేట్/కంది/ సదాశివపేట/ కొండాపూర్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంగారెడ్డి జిల్లా పర్యటన అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. శనివారం సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వ హించిన సీఎం బహిరంగ సభ సక్సెస్ కాలేదు. సీఎం బహిరంగ సభలో ప్రసంగిస్తుండగానే మహిళలు ఇండ్లకు తిరుగుముఖం పట్టడం ప్రారంభించారు. ఇండ్లకు వెళ్తున్న జనాన్ని కుర్చీల్లో కూర్చోబెట్టడానికి పోలీసులు తంటా లు పడాల్సి వచ్చింది.
లక్ష మందితో సభ నిర్వహిస్తామని కాంగ్రెస్ నాయకులు ప్రకటిం చినా సగం మంది రాలేదు. సీఎం సభలో వెనుక వైపు జనంలేక ఖాళీ కుర్చీలు దర్శనమి చ్చాయి. సీఎం ప్రసంగం ఆకట్టుకునేలా లేక, జిల్లా అభివృద్ధికి ఎలాంటి నిధులు ప్రకటించక జనం అసంతృప్తికి లోనయ్యారు. సీఎం ప్రసం గం పూర్తికాకుండా ప్రజలు బహిరంగ సభ నుంచి వెళ్లిపోయారు.
ముఖ్యమంత్రి సంగారెడ్డి పర్యటన జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులను తీవ్ర నిరాశకు గురిచేసింది. జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించడంతోపాటు కొత్త ప్రాజెక్టులు ప్రకటిస్తారని ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆశించినా ఎలాంటి వరాలు ప్రకటించలేదు. మియాపూర్ నుంచి సంగారెడ్డికి మెట్రోరైలు విస్తరణ, సిగాచి బాధితులకు కోటి రూపాయల పరిహారం చెల్లింపు, సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభంపై సీఎం రేవంత్‌రెడ్డి సంగారెడ్డి వేదికగా ప్రకటన చేస్తారని అందరూ ఆశించారు. అయితే రేవంత్‌రెడ్డి వాటి గురించి మాట్లాడలేదు. సంగారెడ్డితోపాటు జిల్లాలో అభివృద్ధి పనులు, రహదారుల నిర్మాణానికి సీఎం నిధులు కేటాయిస్తారని ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆశించినా ఎలాంటి ప్రకటన చేయకపోవటంతో ప్రజలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఏడాది క్రితం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పర్యటనలో సైతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎలాంటి వరాలు ప్రకటించలేదు.
సీఎం పర్యటన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి రేవంత్ నుంచి ఆశించిన భరోసా దక్కలేదు. జగ్గారెడ్డి భార్య నిర్మలారెడ్డి టీజీఐఐసీ చైర్పర్సన్ పదవీకాలం ఇటీవల ముగిసింది. నిర్మలకు తిరిగి టీజీఐఐసీ చైర్పర్సన్ పదవి ఇవ్వాలని జగ్గారెడ్డి సీఎం రేవంత్‌రెడ్డి సహా పార్టీ పెద్దలను కోరుతూ వస్తున్నారు. పదవి రెన్యూవల్ చేస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ఆర్డర్ రాలేదు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డిని ప్రసన్నం చేసుకుని నిర్మలకు తిరిగి టీజీఐఐసీ చైర్పర్సన్ పదవి దక్కించుకోవాలని జగ్గారెడ్డి అనుకున్నారు.

అనుకున్నట్లుగానే సీఎం మెప్పుపొందేందుకు సంగారెడ్డిలో శనివారం బహిరంగసభ ఏర్పాటు చేశారు. బహిరంగసభలో సీఎం నిర్మలారెడ్డి పదవి రెన్యూవల్‌పై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో జగ్గారెడ్డితోపాటు ఆయన అనుచరులు అసంతృప్తికి లోనయ్యారు. జగ్గారెడ్డి అంటే తనకు ఎంతో ఇష్టమని ఆయనకు ఎలాంటి పదవులు ఇవ్వా లో, జగ్గారెడ్డి ఎక్కడ పోటీ చేయాలో అన్నది రాహుల్‌గాంధీ నిర్ణయిస్తారని సీఎం ప్రకటించి జగ్గారెడ్డి అనుచరులకు షాక్ ఇచ్చారు.
సీఎం రేవంత్‌రెడ్డి సంగారెడ్డి పర్యటన సందర్భంగా అధికార యంత్రాంగం ప్రొటోకాల్ పాటించలేదు. సీఎం జిల్లా పర్యటనలు, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటే స్థానిక ఎమ్మెల్యే అధ్యక్షత వహిస్తారు. జిల్లాలోని అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలను సీఎం సభ, కార్యక్రమాలకు ఆహ్వానిస్తారు.శనివారం సీఎం సంగారెడ్డి పర్యటన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కు అధికారులు ఆహ్వానం పంపలేదు. సీఎం సభకు ప్రొటోకాల్ ప్రకారం తనను పిలవాలని,జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు ఫోన్ చేయలేదని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలిపారు. ప్రొటోకాల్ ఉల్లంఘనపై స్పీకర్‌కు ఫిర్యా దు చేస్తానని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, మహిపాల్‌రెడ్డిలకు అధికారులు ఆహ్వానం పలకలేదు
సంగారెడ్డిలోని బైపాస్‌రోడ్డు వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన దివంగత మాజీ ప్రధానులు నెహ్రూ, రాజీవ్‌గాంధీ విగ్రహాలను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. అక్కడి నుంచి ఓపెన్టాప్జీప్లో ర్యాలీగా అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన బహిరంగసభలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్, దామోదర, వివేక్ ప్రారంభించారు. ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన 1.06 లక్షల స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీని సీఎం రేవంత్ ప్రారంభిస్తూ జిల్లాకు చెందిన పది మంది లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్‌కార్డులు అందజేశారు. సీఎం బహిరంగసభలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, వివేక్, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎంపీ సురేష్‌షెట్కార్, ఎమ్మెల్యేలు సంజీవరెడ్డి, నవీన్‌యాదవ్, కార్పొరేషన్ చైర్మన్లు ఫహీం, గిరిధర్‌రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్, కాటా శ్రీనివాస్‌గౌడ్, తోపాజీ అనంతకిషన్ పాల్గొన్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 15: రేవంత్‌రెడ్డి సంగారెడ్డి పర్యటన నేపధ్యంలో బీఆర్ఎస్ యువత, నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. శనివారం సీఎం రేవంత్‌రెడ్డి సంగారెడ్డికి వస్తున్నందున యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాం డ్ చేస్తూ బీఆర్ఎస్ సంగారెడ్డి నియోజకవర్గ యువత విభాగం చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద యువత, నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ఇంద్రకరణ్ సీఎస్‌కు తరలించారు. కార్యక్రమంలో యువత, నాయకులు ధనరాజ్, చింటూ, అఖిల్, హరివర్ధన్, గౌతం, దిలీప్, ఆసిఫ్, నటరాజ్, సంగమేశ్, విష్నేశ్ పాల్గొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అదనపు ఎస్పీ చైతన్య ఇతర పోలీసు అధికారులపై చిందులు వేశారు. సంగారెడ్డిలోని బైపాస్‌రోడ్డు ప్రారంభంలో కొత్తగా దివంగత మాజీ ప్రధానులు నెహ్రూ, రాజీవ్‌గాంధీ విగ్రహాలను ప్రారంభించేందుకు సీఎం వస్తున్న క్రమంలో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను రోడ్డు మధ్య నుంచి పంపించే ప్రయత్నం చేశారు. పోలీసుల చర్యలపై జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగ్గారెడ్డిని సముదాయించేందుకు జిల్లా అదనపు ఎస్పీ చైతన్య ప్రయత్నించారు. అదనపు ఎస్పీ చైతన్య పైన జగ్గారెడ్డి చిందులు వేశారు. ఆ తర్వాత అదనపు ఎస్పీ చైతన్య నచ్చజెప్పడంతో జగ్గారెడ్డి వెనక్కి తగ్గి ప్రధాన రహదారిపై సీఎం వాహనాలు వెళ్లేలా
కార్యకర్తలను ఒకవైపు మళ్లించారు.
జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ వినతిని రేవంత్‌రెడ్డి తన జిల్లా పర్యటనలో పట్టించుకోలేదు. నియోజకవర్గంలోని సింగూరు ప్రాజెక్టును సందర్శించేందుకు జిల్లా నలుమూలలతోపాటు హైదరాబాద్ నుంచి సందర్శకులు వస్తారని టూరిజం కేంద్రంగా ప్రకటించాలని దామోదర రాజనర్సింహ సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. సీఎం తన ప్రసంగంలో సింగూరును టూరిజం కేంద్రంగా ప్రకటిస్తూ నిధులు మంజూరు చేస్తారని మంత్రి ఎదురుచూసినా వినతిని పట్టించుకోలేదు. సింగూరును టూరిజం కేంద్రం ఏర్పాటుపై సీఎం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో సీఎం తీరుపై మంత్రి దామోదర్ రాజనర్సింహ అనుచరులు, కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.