టేకుమట్ల, ఫిబ్రవరి 22 : భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. వాగులు, చెరువుల్లో నీరు లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని చలివాగు, మానేరు వాగులతో పాటు చెరువుల్లోని నీరు పూర్తిగా అడుగంటిపోయింది. దీతో పంట కోతకు వచ్చేవరకు నీటి సమస్య తీవ్రమతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వంలో కెనాల్ వాటర్ ద్వారా వాగులు, చెరువులకు నీరు సమృద్ధిగా వచ్చేది. కాంగ్రెస్ ప్రభుత్వంలో గత ఏడాది వాగులు పూర్తిగా ఎండిపోయి, పంటలు పండక కొంత మంది రైతులు నష్టపోయారు. చలివాగు, మానేరు వాగు పరివాహక ప్రాంతాలతో పాటు, చెరువు పరివాహక ప్రాంతాల్లో 5వేల ఎకరాలపైన రైతులు వరి పంట సాగుచేస్తున్నారు.
అయితే, పంట మొదటి దశలోనే భూగర్భజలాలు తగ్గుతుండంతో రైతుల్లో కలవరం మొదలవుతోంది. యూరియా కోసం యాప్‌లతో నరకయాతన పడి పంటను కాపాడుకుంటున్న రైతులు చివరికి నీటి సమస్యతో పంట ఎండిపోతుందేమోనని ఆందోళనలో ఉన్నారు. నీటి సమస్య తీవ్రతరం కాకముందే ప్రభుత్వం డీబీఎం 38, 36 కెనాల్స్ ద్వారా నీటిని విడుదల చేసి, వాగులు, చెరువులు, చెక్‌డ్యాంలు నింపాలని కోరుతున్నారు. గత ఎడాది నీటి కోసం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి టేకుమట్ల మండలంలోని వెలిశాల చెక్‌డ్యామ్ వద్ద నిరసన చేస్తే, సాగు నీరు అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు నీటిని తీసుకురావడంలో విఫలమయ్యారు. ఫలింతగా పంటలు కొంత ఎండిపోయి రైతులు నష్టపోయారు. ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్తతో ప్రణాళిక ప్రకారం నీటి సమస్యకు పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు.