హైదరాబాద్, ఫిబ్రవరి 22(నమస్తే తెలంగాణ) : రజకులపై దాడిలో రెండు నెలల పసిపాప ప్రాణాలు పోవడం అత్యంత హేయమని, నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ రజక సంఘం డిమాండ్ చేసింది. దాడికి నిరసనగా 27న సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చింది. ఆదివారం నిర్వహించిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు పూసాల సంపత్ మాట్లాడారు. నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రా మంలో మల్లన్న జాతరలో రజకులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి పాలనలో ప్రభుత్వంలో శాంతిభద్రతలు లోపించాయని విమర్శించారు.
కాంగ్రెస్ సర్పంచ్ ఆదేశాల ప్రకారమే మధుకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సతీశ్రెడ్డిలు రజక మహిళలపై దాడికి తెగబడ్డారని మండిపడ్డారు. కాళ్లతో తన్నడంతో రెండు నెలల పసిపాప మృతిచెందిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిందితులకు వత్తాసు పలుకుతున్న ఎస్సైని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రజకులపై దాడికి నిరసనగా 25న అన్ని జిల్లాకేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా దాడి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో అధికార ప్రతినిధి ముత్యాల నర్సింహులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచకొండ వెంకన్న పాల్గొన్నారు.