హైదరాబాద్, ఫిబ్రవరి 22(నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా బలపడి పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ దక్షిణ రాష్ర్టాలపై ప్రభావం చూపుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ అల్పపీడన ప్రభావంతో ఆదివారం మ ధ్యాహ్నం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో భారీ వర్షం కురిసింది. వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షం పడింది.
సోమవారం హనుమకొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. హైదరాబాద్లో ఆకాశం మేఘావృత్తమై ఉంటుందని, ఉదయం, రాత్రి వే ళలలో పొగ మంచు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో గరిష్ఠంగా 35డిగ్రీలు, కనిష్ఠంగా 20 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని పేర్కొన్నది. వచ్చే 24గంటల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉన్నదని, రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.