రాష్ట్రంలో భూములకు రక్షణ కల్పించింది కేసీఆర్ సర్కారే. రికార్డులన్నీ పక్కాగా, పకడ్బందీగా రూపొందించారు. యజమానికి తెలియకుండా గుంట భూమి కూడా వేరేవారి పేరిట బదిలీ కావడం లేదు. గతంలో పహణీలో ఒక రైతుపేరిట రెండు ఎకరాలు ఉంటే దాన్ని దళారులు, అధికారులు కలిసి అదే భూమిని మరో ఇద్దరి పేరిట రిజిస్ట్రేషన్ చేసేవారు. రైతుల మధ్య తగాదాలు సృష్టించేవారు. అలాంటి భూ సమస్యలు ఇప్పటికీ తెగడం లేదు. అధికారుల చేతుల్లో ఉన్న భూములకు సంబంధించిన సమస్యలు ఇప్పటికీ కోర్టులో పెండింగ్ ఉన్నాయి. రికార్డులను తారుమారు చేయడం ద్వారా నిజమైన రైతుకు అన్యాయం జరుగుతుంది. ధరణిని తీసేస్తే మన భూమి మన పేరిటే ఉంటుందనే నమ్మకం లేదు. ధరణి పోర్టల్ ద్వారానే మన భూములకు భద్రత. ధరణి ఉండాలంటే బీఆర్ఎస్ సర్కారు ఉండాలి.
ధరణి అంట.. కేసీఆర్ సర్కారు తెచ్చింది. చాలా బాగుంది. లేదంటే ఊళ్లె మస్తు లొల్లిలు ఉంటుండె. ఒకని భూమి.. ఒకనికి రాస్తుండ్రి. పైసల్ ఇయ్యకుంటె భూమి పట్టానే జెయ్యకుండ్రి. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక ధరణితోని మస్తు ఫాయిదా అయ్యింది. కష్టాలు లేకుండా తాశిలాఫీసులనే పని అయిపోతున్నది. 10 నిమిషాలల్ల రిజిష్టర్ చేస్తున్నరు. గతంలో భూములను పట్టా చేసుకోవాలంటే మస్తు తిప్పలయ్యేది. ఎటెటో తిప్పుతుండ్రి. ముందుగా పట్వారీలు డబ్బులు ముట్టనిదే పని ముట్టకుండె. నెలల తరబడి పట్టా బుక్కులను వారి దగ్గరనే పెట్టుకునేటోళ్లు. పని అంతా వాళ్ల చేతులనే ఉంటుండె. మస్తు సతాయిస్తుండ్రి. గిప్పడు ఆ పరిస్థితి లేదు. మీ సేవలో దరఖాస్తు చేసుకుటున్నం. తెల్లారే నయా పైసా ఖర్చు కాకుండా పట్టా పాస్‌బుక్కులు చేతికి వస్తున్నయ్. గిసుంటి సౌలత్ను కాంగ్రెస్ వస్తే తీసేస్తం అంటున్నది. ఇన్న జెరంత భూమిని కూడా గుంజుకోవాలని చూస్తున్నరు.
రేవంత్‌రెడ్డికి వ్యవసాయం గురించి తెలిసేటట్లు లేదు. కుర్చీ కోసం అదోటి.. ఇదోటి.. చెప్తున్నడు. కానీ, రైతులు ఇంతకుముందు లెక్క లేరు. అన్ని తెలుసుకుంటున్నరు. గప్పట్ల ఉన్న బాధలు ఇప్పుడున్నయా? గవన్నీ కేసీఆర్ సార్ వచ్చినంకనే మంచిగైనయ్. కాంగ్రెస్ ఉన్నప్పుడు అన్నీ గలీజ్ దందలే ఉంటుండె. వానిభూమి వీడు.. వీని భూమిని వాడు రాసుకుంటుండె. ఉన్నోడే బాగుపడ్తుండె. గరీబోన్ని ముంచుతుండె. పట్వారీలు, పెద్దసార్లు కలిసి లోపట లోపట మొత్తం గోల్మాల్ చేస్తుండ్రి. ధరణి వచ్చినంక గవన్నీ పొయినయ్.. భూమి పంచాయితీలు లేనేలేవు. భూమి రిజిష్టర్ చేసుకోవాలంటే.. మన ముంగటనే చేస్తున్నరు. యజమాని లేకపోతే చేస్తనే లేరు. కాంగ్రెస్ గిట్ల తప్పిదారి గెలిస్తే.. ఇగ భూములను మనకు ఉంచుతరా? గరీబోళ్ల నుంచి గుంట భూమి లేకుంట గుంజుకుంటరు. రేవంత్‌రెడ్డి మాటలను నమ్మేటోళ్లు ఎవరూ లేరు. రైతులను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్న సీఎం కేసీఆర్ సారే మళ్లీ గెలుస్తడు.
ధరణిని తీసేస్తే రెవెన్యూ వ్యవస్థ మొత్తం మళ్లీ ఆగమైపోతుంది. సీఎం కేసీఆర్ సారు మూలంగనే రుపాయి ఖర్చు లేకుండా పట్టదారు పాస్ పుస్తకాలు వస్తున్నాయి. కాంగ్రెస్ సర్కార్ ఉన్నప్పడు పటేండ్లు, పట్వారీ వ్యవస్థ ఉన్నప్పుడు భూమి పట్టాలు చేసుకోవాలంటే తప్పకుండా లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తెచ్చిందో అప్పటి నుంచే రైతులు ఊపిరి పీల్చుకున్నరు. భూమిని అమ్మాలన్నా, కొనాలన్నా.. మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే చాలు. అద్దగంట లోపటనే అధికారులు రుపాయి తీసుకోకుండా పట్టా చేసి ఇస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో పైసలు చేతిలో పెట్టకుంటే ఏ పనీ ముట్టకపోయేది. మంచిగున్న సౌలత్ను కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే తీసేస్తమంటున్నరు. ధరణిని తీసేస్తరు.. రైతుల పేరుమీద ఉన్న భూములను కూడా మింగేస్తరు. వాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలె.
కాంగ్రెస్ వారు ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని అంటున్నారు. ధరణిని రద్దు చేస్తే తిరిగి దళారులు మార్కెట్లోకి వస్తారు. ధరణితో భూముల క్రయ విక్రయాలతోపాటు, సులభంగా ఒక్కరోజులోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతున్నది. ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ వారు ధరణిని రద్దు చేస్తామని చెప్పడం శోచనీయం. ధరణిని రద్దు చేస్తే భూముల క్రయవిక్రయాల కోసం ఆఫీసులు, అధికారులు, దళారుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. మాకు తెలిసిన రైతులు ఒక్క రోజులోనే ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. గతంలో భూములు అమ్మినా, కొన్నా మిగితా పనులన్నీ పక్కన పెట్టి రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. మ్యుటేషన్లు పెండింగ్‌లోనే ఉండేది. ఇలాంటి సమస్యలకు ధరణితో చెక్‌పడింది. ఏండ్ల కాలంగా పరిష్కారానికి నోచుకోని సమస్యలు కేవలం ధరణితో తీర్చేశారు.
ఒకప్పుడు భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే చెప్పులు అరిగిపోతుండె. అదిగూడ సక్కగ చేయకుండె. మా పాస్‌బుక్కులు మాకు ఇయ్యతందుకు తిప్పలు పెడుతుండె. పైసలు ఇయ్యకుంటే పని ముట్టకుండె. కొన్నేండ్లసంది గా బాధలు లేవు. సీఎం కేసీఆర్ సార్ వచ్చినంక ధరణి పెట్టిండు. జల్దిన పని అయిపోతున్నది. ఎమ్వార్వో అఫీస్‌కు పిలిపిచ్చి కండ్ల ముంగట రిజిస్ట్రేషన్ చేస్తున్నరు. వారం దినాలళ్ల ఇంటికే టాప్పాలో పాస్బుక్కు వస్తున్నది. ఇది చాలా సౌలత్ ఉన్నది. గింతమంచి ధరణిని తీసేస్తామంటే ఎవరన్నా ఊరుకుంటరా.. కాంగ్రెస్‌కు ఓటేస్తరా? మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి గావాలె.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తారు. దళారులు పెరుగుతారు. ఇష్టారాజ్యం ఉంటది. ఇక మా భూములకు భద్రత ఎక్కడిది. దళారీ వ్యవస్థ కోసమే ధరణిను రద్దు చేస్తామని అంటుంది. కాంగ్రెస్ హయాంలో ఇష్టానుసారంగా రికార్డులు మారిపోయాయి. ఒకరి భూములు మరొకరికి మార్చేవారు. వాటిని మళ్లీ మార్చుకోవడం కోసం చాలా ఇబ్బందులు పడ్డాం. అధికారుల చుట్టూ తిరిగితిరిగి చెప్పులు అరిగి పోయేవి. ధరణితో మా భూములకు భద్రత ఏర్పడింది. సమస్యలన్నీ పోయినాయి. ఒక్కసారి ధరణిలో నమోదైన భూములను మార్చడం ఎవరివల్ల కాదు. అలాంటి ధరణి పోర్టల్‌ను తొలగిస్తామంటే భయంగా ఉంది. మరోసారి రైతులు మోసపోవడం ఖాయం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్సకు తగిన బుద్ధి చెబుతాం.
ఎన్నో ఏండ్లుగా పరిష్కారానికి నోచుకోని భూముల సమస్యలు బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణితో తీరిపోయాయి. అంతకు ముందు బ్యాంకులోను కావాలంటే పహాణి నఖళ్ల కోసం ఆపీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ఆన్లైన్లో పహాణీలు లభిస్తండడంతో ఎవరి దగ్గరికీ వెళ్లకుండానే క్షణాల్లో పహాణీలు, నఖళ్లు వస్తున్నాయి. ధరణి రావడం వల్ల రైతుబంధు, రైతుబీమా వస్తోంది. రూపాయి అప్పులేకుండా పెట్టుబడి అందుతున్నది. గుంట భూమి కూడా మనకు తెలియకుండా ఇతరుల పేరిట పట్టా కావడంలేదు. రైతుల మేలు కోసం ఇంతగా ఆలోచిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్నే మళ్లీ గెలిపిస్తాం.
తెలంగాణ ప్రభుత్వం అచ్చినసంది కేసీఆర్ సార్ ధరణి పోర్టల్‌ను తీసుకు వచ్చి చాలా మంచిగపని చేసిండు. రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపిండు. భూముల విషయంలో గతంలో ఎన్నో తగాదాలు ఉండేవి. ఈ జాగనాది.. ఆ భూమి నీది అంటూ గ్రామాలల్ల రోజూ లొల్లిలే కనిపిస్తుండె. ధరణి వచ్చినంక ఒక్క గొడవ లేదు. ఎవడి భూమి వానిపేరుమీద వస్తున్నది. రూపాయి ఖర్సు లేకుండా పట్టదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నరు. కాంగ్రెస్ వస్తే రైతులకు అన్నింటా నష్టమే. వాళ్లు గెలిస్తే ధరణి పోర్టల్‌ను తీసేస్తరంట. రైతులు ఊరుకుంటరా. కాంగ్రెసోళ్లను బొందవెడ్తరు.
ధరణితోని రైతులకు చాలా మేలు జరుగుతున్నది. ఎక్కువగా తిరుగుడు లేదు. భూమి అమ్మాలన్నా.. కొనాలన్నా.. మీ సేవ కేంద్రానికి పోయి దరఖాస్తు పెట్టుకుంటున్నం. ఒక్క రోజులోనే భూమిని బదలాయిస్తున్నరు. అదికూడా మండలకేంద్రంలోనే. అమ్మినోళ్లు, కొన్నోళ్ల ఏలిముద్ర తీసుకుంటున్నరు. తహసీల్దార్ ఆఫీసులో గంట లోపట పనంతా అయిపోతున్నది. వారం లోపట పాస్బుక్కు చేతిలో పెడుతున్నరు. ఇంత మంచి సౌలత్ను ఎవరన్నా వద్దనుకుంటరా? కాంగ్రెస్ నాయకులు ధరణిని తీసేస్తాం.. భూమాత అని కొత్తగా తెస్తాం అంటున్నరు. మళ్లీ మొదటికి తెచ్చేటట్టున్నరు. వాళ్లకు ఓటేసుడెందుకు.. ఆగమాగం చేసుకునుడెందుకు? ఈ గవర్నమెంటే బాగుంది. బీఆర్ఎస్కే ఓటేస్తాం.
కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు చేస్తామని అంటున్నారు. ఇదంతా ఇబ్బందులకు గురిచేయడం తప్ప మరోటి కాదు. ధరణితో సులభంగా మారిన భూ రిజిస్ట్రేషన్లు మళ్లీ మొదటికి వస్తాయి. ఏండ్ల తరబడి నెలకొన్న సమస్యలకు పరిష్కారం కేవలం ధరణితో జరిగింది. మధ్యవర్తిత్వం లేకుండా స్థానికంగానే, ఏ మండలానికి చెందిన భూములు ఆ మండలాల్లోనే లావాదేవీలు, రిజిస్ట్రేషన్లు కాలయాపన లేకుండా చేస్తున్నారు. ఎవరి ప్రమేయం లేకుండా ఆన్లైన్ ద్వారా కొనసాగుతున్న ప్రక్రియను రద్దు చేస్తే తిరిగి మధ్యవర్తులు, అధికారుల చేతివాటం మొదలవుతుంది. గ్రామాల్లో భూ తగాదాలు చోటుచేసుకుంటాయి. ధరణితో మేలు తప్ప ఇప్పటి వరకు ఏ ఒక్కరూ నష్టపోలేదు.
సీఎం కేసీఆర్ రైతుల కోసం చాలా పథకాలు అందుబాటులోకి తెచ్చారు. ధరణి పోర్టల్ ద్వారా భూ సమస్యలను దూరం చేశారు. కబ్జాలు, అక్రమాలకు చెక్ పెట్టారు. గతంలో ధరణి లేనప్పుడు మొత్తం దళారుల రాజ్యమే ఉండేది. భూ కబ్జాలు, తగాదాలు కనిపించేవి. డబ్బు, పలుకుబడి ఉన్నోడిదే భూమి అన్నట్లు ఉండేది. రికార్డుల్లో మార్పులు చేర్పులు చేసుకొని అనేక అక్రమాలకు పాల్పడ్డారు. దీంతో చాలా మంది బక్క రైతులు గోసపడ్డారు. భూముల విషయంలో నిత్యం కొట్టుకు సచ్చేవారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన తగాదాలతో ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారు చాలా మంది ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వం భూములను పకడ్బందీగా ధరణి పోర్టల్‌లో భద్రపర్చింది. అలాంటి సౌకర్యాన్ని కాంగ్రెస్ నాయకులు తీసేస్తామని అంటున్నారు. మళ్లీ రైతుల భూములను కొట్టేసి, దళారులకు అప్పజెపాలని చూస్తున్నరు.
కాంగ్రెస్ అంటేనే దళారులు. భూముల రిజిస్ట్రేషన్ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ చాలా బాగున్నది. దీన్ని రద్దు చేస్తామంటున్నరు. ధరణి పోతే మళ్లీ పాతకథనే. దళారుల సంత వస్తుంది. రైతులకు సమస్యలు మొదలైతాయి. వానికిన్నీ.. వీనికిన్ని.. పైసల్ ముట్టజెప్పాలె. పేర్లన్నీ కిందికి మీదికి చేస్తరు. రోజూ గొడవలే ఉంటాయి. మళ్లీ పాత రోజులు వస్తాయి. మంచిగున్న దాన్ని ఖరాబ్ చేస్తామంటే ఎట్లా? కాంగ్రెస్‌కు ఓటు వేయాలంటెనే భయమైతున్నది. ఇప్పుడున్న సర్కారుతో భూమి గొడవలు కనిపిస్తున్నయా.. ఎవడి భూమి వాడికే ఉన్నది. కబ్జాలనే భయమే లేదు. అందుకే మళ్లీ బీఆర్ఎస్ సర్కారు రావాలె..
రైతులు పడుతున్న బాధలు పోవాలనే ముందుచూపుతోని కేసీఆర్ ప్రభుత్వం మంచి నిర్ణయంతో ధరణి పోర్టల్‌ను పెట్టింది. అప్పటినుంచి భూములు కొనుడు, అమ్మకాలు అన్నీ తహసీల్ ఆఫీసులోనే అయిపోతున్నాయి. ఇంత మంచిగా ఉన్న ధరణిని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రద్దు చేస్తామనడం దుర్మార్గమైన ఆలోచన. ధరణితోని రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. ధరణి వద్దని చెప్పేవారికి తగిన బుద్ధి చెబుతాం. కేసీఆర్‌ను గెలిపించుకుంటాం.