పెద్దకొడప్గల్/నాగిరెడ్డిపేట, జూలై 9: సర్కా రు బడుల్లో చదువుకునే విద్యార్థులకు ఒక్కపూటైనా పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రతిరోజూ పాఠశాలలో వంట చేసి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నారు. ఇందుకోసం మధ్యాహ్న భోజన ఏజెన్సీలను ప్రభుత్వం నియమించింది. ఏజెన్సీ కార్మికులు వంట చేసి విద్యార్థులకు భోజనం అందిస్తున్నారు. ప్రభుత్వం వారికి బిల్లులు చెల్లిస్తూ వస్తున్నది. కానీ కాంగ్రెస్ సర్కారు నాలుగు నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో ఏజెన్సీ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని చెబుతున్నది. అందుకు సరిపడా బిల్లులు మాత్రం ఇవ్వడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఒకవైపు నిత్యావసర వస్తువుల రేట్లు పెరుగుతూ ఉన్నాయి. అధిక ధరలను భరిస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఒక్కో విద్యార్థికి కేవలం ఆరు రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తున్నది. మార్కెట్లో రేట్లు మాత్రం ఎక్కువగా ఉండడంతో ఏజెన్సీలపై భారం పడుతున్నది. నిత్యావసర ధరలు పెరిగినప్పటికీ ప్రభు త్వం మాత్రం మెనూ చార్జీ పెంచకపోవడంతో అదే ధరతో భోజనం వడ్డించాల్సి వస్తున్నదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
మధ్యాహ్నం భోజనం వండి వడ్డిస్తున్న ఏజెన్సీ కార్మికులకు నాలుగు నెలలుగా బిల్లులు, గత అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు గుడ్డు ధర చెల్లించకపోవడంతో బుధవారం నాగిరెడ్డిపేట, పెద్దకొడప్గల్ తహసీల్ కార్యాలయాల ఎదుట ఆందోళన చేపట్టారు. నాగిరెడ్డిపేట, పెద్దకొడప్గల్ తహసీల్దార్లు శ్రీనివాస్, దశరథ్కు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ ఎన్నికలకు ముందు మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.పదివేల వేతనాన్ని చెల్లించాలని కోరుతున్నారు. విద్యార్థులకు పోషకాహారం అందించాలంటే స్లాబ్ రేటు కనీసం రూ.25 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నిత్యావసర సరుకులు, కోడి గుడ్లు, సిలిండర్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు గుర్తింపు కార్డులు అందజేయాలని కోరుతున్నారు. తహసీల్దార్ ద్వారా ప్రొసీడింగ్ ఆర్డర్లు ఇవ్వాలని, డ్రెస్‌కోడ్ అమలు చేయా లని, ప్రతినెలా ఐదో తేదీన బిల్లులు చెల్లించేలా చూడాలన్నారు. రూ.ఐదు లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్, హెల్త్ కార్డులు, స్లాబ్ రేట్లు, వంట పాత్రలు, తాగునీరు, వంట షెడ్డు, సామాజిక ప్రమాద బీమా కల్పించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
మార్కెట్లో నిత్యావసర సరుకుల రేట్లు ప్రభుత్వం చెల్లిస్తున్న మెనూ చార్జీల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రభు త్వం ఒక్కో విద్యార్థికి రూ.ఆరు మాత్రమే చెల్లిస్తున్నది. రేట్లు ఎక్కువగా ఉండడంతో అప్పు చేసి మరీ విద్యార్థులకు వంట చేసి పెడుతున్నాం. పెరిగిన ధరలకు అనుగుణంగా వెంటనే మెనూ చార్జీలు పెంచాలి.
-బాలమణి, మధ్యాహ్న భోజన కార్మికురాలు, కాటేపల్లి
నాలుగు నెలల మెనూ బిల్లులు, పది నెలల కోడిగుడ్ల బిల్లు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి ని ప్రభుత్వం వెంట నే విడుదల చేయాలి. కోడిగుడ్లను ప్రభుత్వ మే సరఫరా చేయాలి. ప్రతినెలా బిల్లులు సకాలంలో చెల్లించాలి.