Vemula Prashanth Reddy | నిజామాబాద్ / బాల్కొండ : తెలంగాణ సమాజం ఎంతో పోరాడి, ఎందరో అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని, ఇక్కడి అస్తిత్వాన్ని కనుమరుగు చేయడానికి కొన్ని శక్తులు మళ్లీ కుట్రలు పన్నుతున్నాయని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ, జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ బాల్కొండ మండల కేంద్రం లోని నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు.
అనంతరం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. 2001వ సంవత్సరంలో కేసీఆర్ మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు ఒంటిచేత్తో, ఒక్కరిగానే బయలుదేరారని వేముల గుర్తుచేశారు. డా. బి.ఆర్. అంబేద్కర్ సూచించిన విధంగా ‘సమీకరించు, బోధించు, పోరాడు’అనే సిద్ధాంతాన్ని ఆకలింపు చేసుకుని, 14 సంవత్సరాలపాటు అలుపెరుగని పోరాటం చేశారు. ఎలాంటి హింసకు తావు లేకుండా, కేవలం ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారానే, ఎన్నికల్లో తెలంగాణ వాదాన్ని గెలిపించి, పార్లమెంట్ ద్వారా తెలంగాణను సాధించి పెట్టారని స్పష్టం చేశారు. నాడు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు భయపడి తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చేలా రాజకీయ అనివార్యతను సృష్టించిన ఘనత కేసీఆర్ దేనన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదేళ్ల పాలనలో ఊహించని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని కొనియాడారు. నాడు రూ.200 ఉన్న పెన్షన్‌ను నైజ2,000 కు పెంచి పేదల కడుపు నింపారు. పేద కుటుంబాల్లో పెళ్లిళ్లు భారం కాకూడదని ‘కళ్యాణలక్ష్మి’, ‘షాదీ ముబారక్’ పథకాలను తెచ్చారు. ఆడబిడ్డ పుడితే ‘కేసీఆర్ కిట్’ ఇచ్చి ఆదుకున్నారు. బీడీ కార్మికులైన అక్కాచెల్లెళ్లకు కూడా పెన్షన్లు ఇచ్చారు. రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంట్, వాగులు-వంకల్లో చెక్ డ్యామ్‌లు కట్టి భూగర్భ జలాలను పెంచారు. తద్వారా వరిధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ స్థానానికి చేర్చారు.
‘రైతుబీమా’ అందించిన ఘనత కేసీఆర్‌దే..
నాట్లు వేయడానికి ముందే పెట్టుబడి సాయం కింద ‘రైతుబంధు’, రైతు చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షల ‘రైతుబీమా’ అందించిన ఘనత కేసీఆర్‌దేనని ఎమ్మెల్యే వేముల అన్నారు. కానీ నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుబంధును నాట్ల అప్పుడు కాకుండా, ఓట్ల అప్పుడు ఇవ్వాలని చూస్తోందని విమర్శించారు. “ఓట్లు ఉంటే రైతుబంధు, ఓట్లు లేకపోతే నో రైతుబంధు” అన్న చందంగా మార్చారని, రైతుబీమాను పక్కన పడేసి ఏదో కుటుంబ బీమా అంటున్నారని మండిపడ్డారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బక్కని నరసింహులు ఆంధ్రాకు వెళ్లి చంద్రబాబు నాయుడు ముందర, ఆ మహానాడు సభలో “డిక్షనరీలోనే తెలంగాణ అనే పదమే లేదు” అని మాట్లాడటంపై వేముల తీవ్రంగా ధ్వజమెత్తారు. “తెలంగాణోడై ఉండి, ఇక్కడి పార్టీకి అధ్యక్షుడై ఉండి తెలంగాణ పదం లేదు అంటుంటే.. ఇక్కడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు ఖండించలేదు?” అని ప్రశ్నించారు.
Priyanka Mohan | ‘మేడ్ ఇన్ కొరియా’ సక్సెస్ ఎఫెక్ట్.. కొరియా టూరిజం అంబాసిడర్‌గా ప్రియాంకా మోహన్!
Pawan kalyan | పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరించిన హైకోర్టు