కామారెడ్డి : భిక్షాటన కోసం బాబును కిడ్నాప్ చేసిన ఘటన కామారెడ్డి పట్టణంలో చోటుచేసుకుంది. బుధవారం జిల్లా కేంద్రంలోని కామారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి వివరాలు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలానికి చెందిన మొక్కల నర్సింహులు, అతని భార్య సిరిసిల్ల రోడ్డులోని ఒక ఫాస్ట్ఫుడ్ సెంటర్ వద్ద రాత్రి పడుకున్నారు. అర్ధరాత్రి సమయంలో లేచి చూసేసరికి తమ పక్కన పడుకున్న రెండేళ్ల కుమారుడు హర్షిత్ కనిపించలేదు. దీంతో కంగారుపడిపోయిన నర్సింహులు, అతని భార్య చుట్టుపక్కల అంతా వెతికారు. కానీ ఎక్కడా బాబు కనిపించకపోవడంతో ఎవరో ఎత్తుకెళ్లి ఉంటారని భావించిన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బృందాలుగా ఏర్పడి ఘటనాస్థలిలోని సీసీ కెమెరాలు పరిశీలించారు. ఈ క్రమంలో ఓ జంట.. బాబును ఎత్తుకెళ్తున్నట్లుగా గమనించారు.
సీసీ ఫుటేజీ ఆధారంగా ఆ జంట కోసం వెతగ్గా కామారెడ్డి రైల్వే స్టేషన్లో భిక్షాటన చేస్తూ కనిపించారు. నిందితులను దోమకొండకు చెందిన పల్లపు రాజు-శారద దంపతులుగా గుర్తించారు. భిక్షాటన కోసమే బాబును కిడ్నాప్ చేసినట్లుగా నిందితులు ఒప్పుకున్నారు. వారి దగ్గర నుంచి బాబును తీసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. మూడు గంటల్లోనే కేసును ఛేదించిన పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సై శ్రీరామ్, బీసీలు విశ్వనాథ్ విజయరాజు నరేష్ రవి మరియు అశ్వినిలను ఏఎస్పీ చైతన్య రెడ్డి అభినందించారు.