బీజేపీపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ముజీబుద్దీన్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా నిర్వహించిన అభినందన సభకు మంత్రి, ఎమ్మెల్సీ, నేతలు హాజరయ్యారు. ప్రజల గుండెల్లో టీఆర్ఎస్ ఎప్పటికీ రారాజేనని వారుపేర్కొన్నారు. గులాబీ కండువాలతో పెట్టుకుంటే ఢిల్లీ వచ్చి డిస్టర్బ్ చేస్తామని బీజేపీ నేతలను హెచ్చరించారు. టీఆర్ఎస్కు సవాల్ చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని హితవు పలికారు.
కామారెడ్డి, ఫిబ్రవరి 24: తెలంగాణ జోలికొస్తే.. ఢిల్లీకి వచ్చి డిస్టర్బ్ చేస్తామని ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌తో పెట్టుకున్నోడెవ్వడూ బాగుపడలేదని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచిందని తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని సత్యాగార్డెన్‌లో గురువారం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఎంకే ముజీబుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్లో ఎవరికెన్ని నిధులిచ్చారో చెప్పాలని సీఎం కేసీఆర్ అడిగితే ప్రధాని మోదీతోపాటు బీజేపీ నేతలు సమాధానమివ్వడం లేదని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఎనిమిదేండ్లుగా సీఎం కేసీఆర్ ఓపిక, సహనంతో ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్, గులాబీ కండువాతో చాలెంజ్ చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని హితవుపలికారు. నీతి, నిజాయితీతో, ప్రజల కోసం 24 గంటలు పని చేసినవాళ్లమన్నారు. కచ్చితంగా బలంగా మాట్లాడుతామని, ప్రజల ప్రయోజనాల కోసం గల్లీ అయినా.. ఢిల్లీ అయినా లొల్లి పెట్టేది గులాబీ కండువానే తప్పా వేరే పార్టీ కాదని స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ సింహంలాంటి పార్టీ అని, ప్రజల గుండెల్లో రారాజుగా నిలిచిందన్నారు. తెలంగాణ కోసం ఏనాడూ అబద్ధం చెప్పలేదని, నీతి, న్యా యంతో ఉద్యమం చేశారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయాన్ని చెప్పడంతోపాటు ప్రజలతో కలిసి నడిచినట్లు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడేండ్లలో కరెంటు కష్టాలు తీరుస్తామని 2014లో కేసీఆర్ చెప్పాడని, అం తేకానీ రేపు, ఎల్లుండి చేస్తానని చెప్పలేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ కుటుం బం 70లక్షలకు చేరుకున్నదన్నారు. కామారెడ్డి జిల్లాలో లక్షా70వేల సభ్యత్వం ఉందన్నారు. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు సమావేశాలు నిర్వహించు కోవాలని సూచించారు.
రైతులకు మనం అన్నం పెడితే, ప్రధాని మోదీ సున్నం పెడుతున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడుతున్నా బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కరోనాతో ప్రపంచమంతా దివాళా తీసినా రాష్ట్రంలో మాత్రం ఎక్కడా పింఛన్లు, రేషన్ బియ్యం, 24గంటల ఉచిత విద్యుత్ ఆపలేదన్నారు. తెలంగాణ నుంచి బీజేపీకి నలుగురు, కాంగ్రెస్‌లో ముగ్గురు, అసద్‌లు ఎంపీలుగా ఉన్నా టీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే పార్లమెంట్లో కొట్లాడుతున్నారన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రావాల్సిన రూ.900కోట్లు విడుదల చేయడం లేదని, దీనిపై ఎవరూ మాట్లాడడం లేదన్నారు. తెలంగాణలో ఏర్పాటు చేస్తామన్న పసుపుబోర్డు గురించి నోరెత్తడం లేదన్నారు. గిరిజనులు, ముస్లిములకు రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసినా అడగడం లేదన్నారు. బీసీ జనాభా గణన జరగాలని కోరుతున్నా చేయడం లేదన్నారు.
దేశంలో అన్నిరంగాల్లో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచిందని ఎమ్మెల్సీ కవిత అన్నా రు. సీఎం కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తుందన్నారు. ఉద్యోగుల వేతనాలు ఇవ్వడంతో మొదలుకొని వివిధ వర్గాల అభ్యున్నతికి తెలంగాణ సర్కారు పాటుపడుతుందన్నారు. దొంగమాటలు, ఫేక్ సర్టిఫికెట్లు, ఫొటోలు మార్ఫింగ్, సోషల్ మీడియాలో అబద్ధపు పోస్టింగ్‌లు, రైతులను మోసం చేయడం, పేదలపై భారం వేయడం, బ్యాంకులను ముంచినవారికి , దేశ సంపద కొల్లగొట్టిన వారికి ప్రాధాన్యమివ్వడం, ఎల్ఐసీని అమ్మడంలో బీజేపీ నంబర్ వన్‌గా నిలుస్తున్నదని మండిపడ్డారు.
కొత్తగా జిల్లా ఏర్పడిన నాటి నుంచి కామారెడ్డి జిల్లాలో రూ.వేలకోట్లతో అభివృద్ధి చేశామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. జిల్లాలో వ్యవసాయరంగానికి రూ.3వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మిషన్ కాకతీయ పథకం కింద రూ.450కోట్లతో 1250 చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టామన్నారు. నాలుగు నియోజకవర్గాల్లో రూ.175కోట్లతో 42 చెక్‌డ్యాములు నిర్మించామన్నారు. రూ.476 కోట్లు మంజీరా లిఫ్ట్‌కు కేటాయించినట్లు తెలిపారు. నిజాంసాగర్ ఆధునీకరణకు రూ.1000కోట్ల కేటాయించగా, కామారెడ్డి నియోజకవర్గంలో కాలువల ఆధునీకరణ, మరమ్మతులను రూ.300కోట్లతో చేయించామన్నారు. కాళేశ్వరం 22వ ప్రాజెక్ట్ కింద ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల పరిధిలోని కోటీ85లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు రూ.1500కోట్లు మంజూరు చేశారన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో రూ.476కోట్లు లిఫ్ట్ పనులకు మంజూరు చేసినట్లు కవిత వెల్లడించారు. నిజాంసాగర్, పిట్లం, పెద్దకొడప్గల్, బిచ్కుంద మండలాలకు సాగునీరందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. సిద్ధేశ్వర రిజర్వాయర్‌కు రూ.175కోట్లు కేటాయించినట్లు వివరించారు.
కామారెడ్డి, ఫిబ్రవరి 24: దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని అభివృద్ధి, సంక్షేమ పథకాల ను తెలంగాణ మాత్రమే అమ లు చేస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అ న్నారు. బీజేపీ సోషల్ మీడియాలో మార్కెటింగ్‌లో ముందంజలో ఉన్నదని, అసత్య ప్రచారాలు, అబద్ధపు మాటలతో ముందుకు సాగుతుందని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని, గ్రామాల్లోకి అడుగపెట్టనివ్వమన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని కేంద్రమంత్రులే ప్రశంసిస్తుంటే తెలంగాణ బీజేపీ నేతలు విరుద్ధంగా ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కండ్ల ముందు జరుగుతున్న అభివృద్ధి కనపడడం లేదా అని ఎద్దేవా చేశారు. చాలా రోజులు ఓపిక పట్టాం..ఇక సహించేది లేదన్నారు. దేశం మొత్తం కేసీఆర్ వైపు చూస్తుంటే ఇక్కడ కుక్కల్లా మొరుగుతున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో ఏడేండ్లుగా జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి తెలంగాణలో కలుస్తామంటూ ప్రతిపాదనలు వస్తున్నాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతికి సాక్ష్యంగా మహారాష్ట్రలోని 16గ్రామాలు తెలంగాణలో కలుస్తామంటూ తీర్మానాలు చేసి లెటర్లు ఇచ్చారని గుర్తు చేశారు. కర్ణాటకలోని రాయచూర్ బీజేపీ ఎమ్మెల్యే ఏకంగా కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను అమలు చేయాలనీ.. లేదంటే తెలంగాణలో కలపాలని డిమాండ్ చేసినట్లు వివరించారు.తెలంగాణ ఉనికిని ప్రశ్నించే బీజేపీ నాయకులు మనకు అవసరం లేదన్నారు. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా పార్లమెంట్లో మాట్లాడిన తీరును సభకు వినిపించారు.
కామారెడ్డి/విద్యానగర్, ఫిబ్రవరి 24: టీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఎంకే ముజీబుద్దీన్ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు సురేందర్, హన్మంత్ షిండే, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డిలతోపాటు జిల్లా నేతలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. సత్యాగార్డెన్‌లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎంకే ముజీబుద్దీన్‌తో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ముజీబుద్దీన్‌ను ఎమ్మెల్సీ కవిత, జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అభినందించారు. టీఆర్ఎస్ కామారెడ్డి పట్టణ మాజీ అధ్యక్షుడు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గజమాలతో సన్మానించారు. గడ్డం సురేందర్ రెడ్డి యువసేనా ఆధ్వర్యంలో జై తెలంగాణ.. కేసీఆర్ జిందాబాద్..టీఆర్ఎస్ జిందాబాద్ అంటూ నినాదాలు హోరెత్తాయి. మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు, జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, నిట్టు వేణుగోపాల రావు, మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, వైస్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, డీసీఎంఎస్ చైర్మన్ మోహన్, నాయకులు ఎల్ నర్సింగ్‌రావు, గైనీ శ్రీనివాస్‌గౌడ్, పిప్పిరి ఆంజనేయులు, మామిండ్ల అంజయ్య, నల్లవెల్లి అశోక్ పాల్గొన్నారు.
గుజరాత్ సీఎంగా 15ఏండ్లు, దేశ ప్రధానిగా ఏడున్నరేండ్లలో మోదీ ఏ ప్రజానికానికి సహాయం చేశాడో చెప్పాలి. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు అసత్య ప్రచారాలతో టీఆర్ఎస్, ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ రాష్ట్రంలోని నలుమూలలు తిరిగి ప్రజల కష్టాలను తీరుస్తూ తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఏ రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ లేదు. తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతర విద్యుత్ ఇస్తున్నది. రాబోయే రోజుల్లో జిల్లాలోని నాలుగు డివిజన్లలో గులాబీ జెండా రెపరెపలాడుతుంది.
– గంప గోవర్ధన్, ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే
టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని బీజేపీ ప్రభుత్వం మార్కెటింగ్లాగా అమ్ముకుంటున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను బీజేపీ నాయకులు సోషల్ మీడియా ద్వారా వక్రీకరిస్తున్నారు.
– బీబీ పాటిల్, ఎంపీ, జహీరాబాద్
టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోనే రెండుసార్లు అధికారంలోకి వచ్చాం. రానున్న ఎన్నికల కోసం నాయకులు, కార్యకర్తలు పాటుపడాలి. తెలంగాణ సాధనే లక్ష్యంగా కేసీఆర్ 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టారు. రాష్ట్రం సాధించుకున్న తర్వాత బంగారు తెలంగాణ వైపు అడుగులు వేయాలని అనుకున్నారు. అనుకున్న విధంగానే బంగారు తెలంగాణవైపు అడుగులు వేస్తున్నాం.
– హన్మంత్‌షిండే, జుక్కల్ ఎమ్మెల్యే
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను దేశంలోని అన్ని రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. కానీ, బీజేపీ నాయకులకు అసత్య ప్రచారాలు చేస్తూ కేసీఆర్‌ను తిట్టడమే తప్ప వేరే ఎజెండా లేదు. ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయం చేస్తున్న వారు తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటున్నారు. రైతుబంధు ద్వారా 50వేల కోట్లను రైతుల ఖాతాల్లో వేసింది. రైతుబీమా పథకాలతో రైతులను ఆదుకుంటుంది.
– జాజాల సురేందర్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే