బాన్సువాడ రూరల్, మార్చి 6: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామపంచాయతీ పరిధిలోని ఠాగూర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్ష (Inter Exams) కేంద్రాన్ని సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షల తీరు పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో మొత్తం విద్యార్థుల సంఖ్య, హాజరైన విద్యార్థుల సంఖ్యను ప్రిన్సిపల్ మైషయ్యతో అడిగి తెలుసుకున్నారు. మాస్ కాపీ జరగకుండా చూడాలని, విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయలను పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేయాలని కళాశాల యజమాన్యాన్ని ఆదేశించారు. పరీక్షలు పకడ్బందీగా సజావుగా జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశించారు.
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు బుధవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుమారు 30 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరికోసం నిజామాబాద్ జిల్లాలో 57, కామారెడ్డి జిల్లాలో 38 సెంటర్లను ఏర్పాటుచేశారు. మొదటిరోజు నిజామాబాద్ జిల్లాలో మొత్తం 19,191మంది విద్యార్థులకు 18,438 మంది హాజరయ్యారవగా, 7 53మంది గైర్హాజరయ్యారు. అదేవిధంగా కామారెడ్డిలో జనరల్ విభాగంలో 7,786 మందికి 7,555 మంది హాజరు కాగా.. 231 మంది పరీక్ష రాలేదని అధికారులు వెల్లడించారు. ఒకేషనల్ విభాగంలో 1,444 మందికి 1,308 మంది హాజరు కాగా.. 136 మంది గైర్హాజరు అయ్యారు.
ఎండా కాలాన్ని దృష్టిలో పెట్టుకుని నర్సరీ పల్లె ప్రకృతి వనంలో మొక్కలు ఎండిపోకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రశాంతికి సూచించారు. గురువారం బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామంలో ఆమె ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె నర్సరీని పరిశీలించారు. నర్సరీలో పెంచుతున్న మొక్కల వివరాలను ఉపాధి హామీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. అనంతరం గ్రామంలోని పల్లె దావఖాన, అంగన్వాడి కేంద్రం, ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు.
దవాఖానలో రోగులకు అందుతున్న సేవలను వైద్యులతో అడిగి తెలుసుకున్నారు. డిస్పెన్సరీలో అందుబాటులో ఉన్న మందులను పరిశీలించారు. అంగన్వాడి కేంద్రంలో గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వం ద్వారా అందుతున్న పథకాలు సక్రమంగా అందిస్తున్నారా అని అంగన్వాడి టీచర్ తో ఆరా తీశారు. గ్రామంలో పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని, మురికి కాలువలో నీరు నిలువ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఆమె వెంట ఎంపీడీవో బషీరుద్దీన్, ఎంపివో సత్యనారాయణరెడ్డి, పంచాయతీ కార్యదర్శి సృజన్ రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ గంగాధర్, తదితరులు ఉన్నారు.