Nizamabad | వినాయక నగర్, నవంబర్ 17 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉదయం ఓ విద్యార్థిని దుండగులు కిడ్నాప్ కు యత్నించిన ఘటన కలకలం సృష్టించింది. ఏడో తరగతి చదివే బాలిక కిల్లా రోడ్డులోని పాఠశాలకు వెళుతుండగా కారులో వచ్చిన దుండగులు ఆమెను కిడ్నాప్ చేసి తీసుకుపోయారు. బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోని హైమది పుర ప్రాంతానికి చెందిన ఇర్ఫాన్ అనే వ్యక్తి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో ప్రైవేటు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.
అతడి కూతురు స్థానిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతుంది. ప్రతీరోజు మాదిరిగానే సోమవారం ఉదయం ఆమె పాఠశాలకు వెళ్తున్న సమయంలో ఒక కారు వచ్చి బాలిక పక్కన నిలిపారు. అందులోంచి దిగిన దుండగులు తమ వద్ద ఉన్న ఓ రుమాల్ (కట్ షిప్)లో ఏదో మత్తుమందు పెట్టి విద్యార్థిని ముఖానికి పెట్టడంతో ఆమె స్పృహ కోల్పోయినట్టు అయింది. వెంటనే ఆమెను ఆ కారులో ఎక్కించుకున్న దుండగులు గాజులు పేటలోని గురుద్వార్ వైపు తీసుకువెళ్లారు.
అక్కడ మరో వ్యక్తి కోసం కారును కొద్దిసేపు నిలపడంతో అప్పటికే కొద్దిగా స్పృహలోకి వచ్చిన బాలిక కారు డోరు తీసుకొని కిందికి దూకేసి పారిపోయి వచ్చినట్లుగా తన కుటుంబ సభ్యులకు తెలిపింది. ఉదయాన్నే నగరంలో విద్యార్థిని కిడ్నాప్ యత్నం ఘటన తీవ్ర కలకలాన్ని సృష్టించింది. అయితే బాలిక తండ్రి ప్రస్తుతం వ్యక్తిగత పనిపై మహారాష్ట్రలో ఉండడం, దీంతో ఆయన సూచన మేరకు కుటుంబ సభ్యులు వెళ్లి రెండో టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
కిడ్నాపర్ల చరణ్ నుంచి తప్పించుకొని వచ్చిన బాలిక తనతో జరిగిన ఘటన విషయాన్ని ఇంట్లో వారికి చెప్పడంతో వారు పోలీసులకు వివరించారు. ఈ దారుణ ఘటనపై నిజామాబాద్ పోలీసులు తీవ్రస్థాయిలో పరిగణించి బాలికను కిడ్నాప్ కు యత్నించిన దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిసింది.