నాగిరెడ్డిపేట్, జూలై 29 : గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలంలో గల పోచారం ప్రాజెక్టు నీటిమట్టం ఎనిమిది అడుగులకు చేరింది. మంగళవారం వరకు డెడ్ స్టోరేజ్ గా ఉన్న పోచారం ప్రాజెక్టులోకి మంగళవారం ఉదయం నుండి ఎగువ ప్రాంతాల నుండి ఇన్ఫ్లో రావడంతో కేవలం 24 గంటల్లోనే పోచారం ప్రాజెక్టులోకి 8 అడుగుల నీరు చేరింది. మంగళవారం ఉదయం కేవలం 200 క్యూసెక్కుల వరద నీరు రావడం ప్రారంభమైంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు పోచారం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం 1586 క్యూసెక్కులకు పెరిగిందని ప్రాజెక్టు ఏఈ అక్షయ్ తెలిపారు.
పోచారం ప్రాజెక్టు సామర్థ్యం 1.820 టీఎంసీ ఉండగా ప్రస్తుతం ప్రాజెక్టులో 8 అడుగుల నీరు చేరిందని అధికారులు తెలిపారు. ఇంకా 13 అడుగుల నీరు ప్రాజెక్టులోకి చేరితే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుకుంటుం దని అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాలైన గాంధారి, లింగంపేట లో వర్షాలు కురవడంతో ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరుతుంది. 24 గంటల్లోనే ప్రాజెక్టులోకి 8 అడుగులు వరద నీరు రావడంతో పోచారం ఆయకట్ట రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.