మాటలంటే
నాగలికి తొలి పొద్దు తాకినట్టు
పరిపాలనంటే
కల్లంల పంట ఇంటికి చేరినట్టు
సంక్షేమమంటే
పొలిమేరల పాలపిట్ట ఎదురొచ్చినట్టు
ముంగిట్ల ముగ్గుల మీద
పిట్టలు గింజలేరుకున్నట్టు ఉండాలె
ఇయ్యాల ఏమున్నది ఈ ఊర్లళ్ల?
చెరువుల్ల చేపల వాసన లేదు
మందల్లో గొర్లు, బర్లు పడావు పడె
చేతివృత్తులు చెయ్యి చాస్తుంటే
కుల కశ్పెలల కండ్లల్ల కన్నీరు పారె
కౌలు రైతు పాట్లు ఎవరికెరుక?
సొంత పొలం లేక
దున్నేది పరాయి భూమి
పండింది అప్పులోళ్ల పాలాయె
కడుపుల్లో ఆకలి దేవవట్టె
కౌలు రైతు ఆర్తనాదం
చెవులకు సోకపాయె
ఆటో తిప్పేటోళ్ల బతుకు సూడు
పొద్దంతా స్టీరింగు మీదనే
ఫైనాన్సోళ్ల వడ్డీకి, పెట్రోలు భారానికి
చాలీచాలని బాడుగకు
కార్మికుని వేదన రోడ్డు పాలాయె!
కరెంటు కోతలకు
మోటర్లు కాలుతుంటే
యూరియా బస్తా కొరకు
చెప్పుల కొట్లాటలాయె
రైతుబంధు ఎప్పుడొస్తదాని
కండ్లు కాయలు కాయవట్టె
బీమా లేని రైతుల ఇండ్లు ఆరిపాయె
కల్యాణలక్ష్మి కండ్లనీళ్ల లక్ష్మి ఆయె
పథకాలన్నీ గాలికెగిరి
సంక్షేమ బాటలకు తాళాలు
డిగ్రీలు చేతుల పట్టుకుని
గేట్ల ముందు తిరిగే బిడ్డలు
నిరుద్యోగుల ఉసురు తగిలితే
పాలన మట్టి కొట్టుకుపోక తప్పదు!
రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక
బిడ్డల పెండ్లిళ్లు,
చదువులకు బాధలు
అరోగ్యాలు చేతులెత్తేసి
ఆత్మహత్యలపాలు
అక్రిడిటేషన్ కార్డులందక
విలేకరుల అవస్థలు
దళిత బంధుకు కుతికె పిసికి
బీసీ డిక్లరేషన్లు అటకెక్కించి
మూడు గంటల ప్రయాణానికి
జేబులు ఖాళీ చేసి
టికెట్టు కొన్నాక కూడా
సీటు లేక ఒకరి చేతులొకరు
పట్టుకొని నిలబడుడేందీ?
ఇంతకంటే సిగ్గుచేటు ముచ్చట ?
ఉచితమని చెప్పి బస్సులకు కోతలు
జేబులు గుల్ల చేసే డీలక్స్ల మోత
ఉచిత బస్సుల ఆడబిడ్డల సిగపట్లు
అది చూసి పాలన నవ్వులపాలాయె!
చెట్లు దుఃఖిస్తున్నయ్
చేన్లు తలలువాలేసినయి
పాలమూరు ప్రాజెక్టులు
దిక్కులు చూస్తున్నయ్!
పొలాలు శపిస్తున్నయ్
మన హక్కులైన నీళ్లు
పక్క రాష్ర్టాలకు తరలుతుంటే
పాలకులు చేతులెత్తేసి
తమాషా చూస్తున్నరు!
సజీవ జలధారలన్నీ
సంక్షోభపు తెరలై
ఇయ్యాల ఎక్కిరిస్తున్నయ్!
చివరికి ఏమైంది?
మూడు రంగుల పాలన
కండ్లు, చెవులు, నోరు మూసుకున్న
మూడు కోతుల లెక్కనే మిగిలె