మరికల్, సెప్టెంబర్ 21 : కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి పంటలకు సాగునీటిని అందించాలని బీఆర్ఎస్ నాయకులు డి మాండ్ చేశారు. సోమవారం నారాయణపేట జిల్లా మరికల్ పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ర్యాలీ నిర్వహించి, రాయిచూర్ అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. కోయిల్‌సాగర్ నీటిపై ఆధారపడి ఆయకట్టు రైతులు వరి సాగు చేశారని, ప్రస్తుతం నీళ్లు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్టు వాపోయారు.
జూరాల ప్రాజెక్టు నుంచి కోయిల్‌సాగర్‌కు కేవలం ఒక్క పంప్‌తో నీటిని ఎత్తిపోస్తున్నారని, దీంతో ప్రాజెక్టుకు సరిపడా నీళ్లు చేరడం లేదని ఆవేదన చెందారు. పాలకులు, అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులకు కష్టాలు తప్పడం లేదని ధ్వజమెత్తారు. ఎండిపోయిన పంటకు ఎకరాకు రూ.30 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న సమయంలో ఎంపీ డీకే అరుణ అటుగా రావడంతో నాయకులు, రైతులు ఆమె కారును అడ్డుకున్నారు. అయితే పోలీసులు వారిని పక్కకు తోసేసి ఎంపీ కారును పంపించారు.