హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తేతెలంగాణ): ‘జూరాల ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు సాగునీరు విడుదల చేస్తే భవిష్యత్తులో తాగునీటికి ఇబ్బందులు రావా? జూరాల ఆయకట్టులో నీటి ఎద్దడి సమస్య ఉన్నది. ఎల్ నినో ప్రభావం ఉన్నది. ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులకు మొదటి నుంచీ పదేపదే చెప్పాం’ అని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. హైదరాబాద్ సీఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రస్తుతం జూరాలలో 300 క్యూసెకుల నీరు కూడా లేదని, 3 టీఎంసీల వరకు పూడిక ఉండి, మరో 2 టీఎంసీలను తాగునీటి అవసరాల కోసం నిల్వ చేస్తున్నట్టు తెలిపారు. ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని పొదుపుగా వాడుకుంటున్నామని, ఎల్ నినో కరువు నేపథ్యంలో అదనంగా రూ.20 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని ఇప్పటికే కోరామని వివరించారు. ప్రాజెక్టుల్లో ఉన్న నీళ్లను సరైన పద్ధతిలో ఉపయోగించుకొనే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. రాజకీయం కోసం ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.
శ్రీశైలం నుంచి ఇప్పటివరకు నాగార్జునసాగర్‌కు చుకనీరు కూడా వదలలేదని చెప్పారు. విద్యుదుత్పత్తి ద్వారా మాత్రమే కొంతనీటిని సాగర్‌కు వదిలినట్టు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో జూరాల దగ్గర ఎందుకు అదనపు రిజర్వాయర్‌ను నిర్మించలేదు అని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. జూరాలకు నీటి విడుదల కోసం కర్ణాటక ముఖ్యమంత్రితో మాట్లాడే ప్రయత్నం ఇప్పటికే చేస్తున్నామని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును 90శాతం పూర్తి చేశామని కేసీఆర్ చెప్పుకొన్నారని, ఇంకా మూడు నెలలైతే తప్ప నార్లాపూర్ పంపులు ఆన్ కావని చెప్పారు.