కొవిడ్ మహమ్మారి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న లాక్డౌన్ ఉమ్మడి జిల్లాలో పకడ్బందీగా కొనసాగుతున్నది. లాక్డౌన్ నిబంధనలను ఉభయ జిల్లాల యంత్రాంగం కఠినంగా అమలుచేస్తున్నది. అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారిపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. సరైన కారణమేదీ లేకుండా రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేయడంతోపాటు, వాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నారు. నిజామాబాద్ సీపీ కార్తికేయ, కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి స్వయంగా రోడ్లమీదికి వచ్చి బందోబస్తును పర్యవేక్షిస్తుండడంతో పోలీసులు మరింత అప్రమత్తమై తనిఖీలు ముమ్మరం చేశారు. నిజామాబాద్ జిల్లాలో లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన వ్యాపార, వాణిజ్య సంస్థలపై 965 కేసులు నమోదు చేశారు. సుమారు ఐదువేల వాహనాలను సీజ్ చేయడంతోపాటు మాస్కులు ధరించని 10వేల మందికి జరిమానాలు విధించారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం 3,950 కేసులు నమోదు కాగా, 991 వాహనాలు సీజ్ చేశారు. నిబంధనలు పాటించని 242 వ్యాపార, వాణిజ్య సంస్థలపై కేసులు నమోదు చేశారు.
-నిజామాబాద్, మే 25, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఉల్లంఘనులపై పోలీసుల కొరడా
నిజామాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా అమలుచేస్తున్న లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తోంది. అనవసరంగా రోడ్డెక్కిన వారిపై పోలీసులు కొరడా ఝుళిపిస్తూ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్‌ను నిలువరించేందుకు పోలీస్ శాఖ తీవ్రంగా శ్రమిస్తుంది. ప్రతి రోజు ఉదయం 6 నుంచి 10గంటల వరకు లాక్డౌన్ సడలింపు ఉంది. ఈ నాలుగు గంటల సమయంలోనూ కరోనా వైరస్ వ్యాప్తి జరిగేందుకు అవకాశాలు ఉన్నందున ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రోడ్డెక్కిన ప్రజలు భౌతిక దూరం, మాస్కులు తప్పనిసరిగా వాడేలా అవగాహన కల్పిస్తున్నారు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించి ఇష్టానుసారంగా రహదారులపైకి వచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. వాహనాలను జప్తు చేసి ఠాణాకు తరలిస్తున్నారు. అత్యవసరాలకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారంతా పోలీసు శాఖ వెబ్సైట్ నుంచి అనుమతులు తీసుకుంటే ఈ-పాస్ జారీ చేస్తున్నారు. కారణం లేకుండా తిరిగితే మాత్రం సహించేది లేదంటూ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
కమిషనరేట్‌లో ఇలా…
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో లాక్డౌన్ అమలైన తొలి రోజుల్లో పోలీసులు చూసీ చూడనట్లుగా వ్యవహరించారు. వరంగల్ పర్యటనలో సీఎం కేసీఆర్ నేరుగా కలెక్టర్లు, పోలీసులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఘాటుగా స్పందించడంతో అప్పటి నుంచి కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. స్వయంగా పోలీస్ కమిషనర్ కార్తికేయ రోడ్డు మీదికొచ్చి వాహనాలను పరిశీలిస్తున్నారు. మినహాయింపు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఆయా రంగాలకు చెందిన వారి వద్ద పత్రాలను పరిశీలించి పంపించి వేస్తున్నారు. పోలీస్ కమిషనర్ నేరుగా జిల్లా వ్యాప్తంగా పర్యటనలు సైతం చేస్తుండడంతో కిందిస్థాయిలోనూ ఖాకీల్లో కలవరం మొదలైంది. గ్రామాల్లోనూ లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తూ కరోనా వైరస్ నియంత్రణకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సాయంత్రం పూట తీరిగ్గా రోడ్డు మీదికొచ్చి టైంపాస్ చేసే వారిపై కొరడా ఝుళిపిస్తున్నారు. ముఖ్యంగా లాక్డౌన్ ఉల్లంఘనల కింద కేసులు నమోదు చేసి రూ. వెయ్యి జరిమానా సైతం విధిస్తున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభమైన లాక్డౌన్ నేటికి రెండు వారాలు పూర్తయ్యింది. జాతీయ రహదారులపై కమిషనరేట్ పోలీసులు నిఘా పెట్టకపోవడంతో చాలా మంది ఇష్టారాజ్యంగా దూర ప్రాంతాలకు ఈ-పాసులు లేకుండానే ప్రయాణాలు సాగిస్తున్నట్లుగా తెలుస్తోంది.
కామారెడ్డిలో పకడ్బందీగా..
కామారెడ్డి జిల్లాలో లాక్డౌన్ అమలైన తొలి రోజు నుంచి పకడ్బందీ నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు. ఎస్పీ శ్వేతా రెడ్డి పక్కా కార్యాచరణతో లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ పట్టణాల్లో పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేయించారు. ప్రజలు గుమిగూడే ప్రాంతాల్లో పోలీసు బందోబస్తును పెంచి భౌతిక దూరం పాటించేలా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పోలీసు కళాజాత బృందాలతో కరోనా వ్యాప్తిపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో భౌతిక దూరం పాటించని వారిపై కేసులు నమోదు చేయించారు. తద్వారా సడలింపు సమయంలో వ్యాపారులు కాసింత జాగరూకతతో మెదులుతున్నారు. మొదట్లో అలసత్వంతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించిన వ్యాపారులు ఇప్పుడు లాక్డౌన్ నిబంధనలు తప్పకుండా పాటిస్తున్నారు. జాతీయ రహదారులపై వాణిజ్య, సరుకు వాహనాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయినప్పటికీ వాణిజ్య వాహనాల మాటున షికారు చేసే వారిని గుర్తించేందుకు హైవేపై ఠాణాలున్న పోలీసులను ఎస్పీ అప్రమత్తం చేశారు. భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద పోలీసులు ప్రత్యేకంగా నిఘా వేసి అనవసరంగా ప్రయాణం చేస్తున్న వారిని పట్టుకుంటున్నారు.
సరిహద్దుల్లో నిఘా
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మహారాష్ట్ర – తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఇరు జిల్లాల పోలీసులు నిఘా పెంచారు. కరోనా సెకండ్‌వేవ్ సమయంలో తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శించిన ఖాకీలు ప్రస్తుతం ప్రభుత్వ సూచనలతో బాధ్యతాయుతంగా పని చేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలను నిలిపేస్తున్నారు. ఆయా ప్రాంతాల నుంచి మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్న వారి వివరాలు సేకరిస్తున్నారు. సరుకు రవాణా వాహనాలను ఎప్పటిలాగా నిర్ణీత గడువులో రాష్ట్రంలోకి పంపించి వేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ చెక్‌పోస్టు వద్ద బందోబస్తును పెంచారు. నిజామాబాద్ జిల్లాలోని సాలూరా చెక్ పోస్టుతో పాటుగా కందకుర్తి బ్రిడ్జి వద్ద బారికేడ్లు అడ్డుగా వేసి రాకపోకలను నిలువరిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో జుక్కల్, మద్నూర్ మండలాల్లోకి మంజీరా నది పరివాహక ప్రాంతాల గుండా మహారాష్ట్ర వాసులు నడుచుకుంటూ దొడ్డి దారిలో ఆయా ప్రాంతాలకు చేరుతున్నట్లుగా సమాచారం.
భారీగా కేసులు నమోదు
కరోనా నియంత్రణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. ఇందుకోసం రాష్ట్ర ఆదాయాన్ని భారీగా కోల్పోతున్నప్పటికీ ప్రజారోగ్యం దృష్ట్యా లాక్‌డౌన్‌ను విధించారు. సమస్తం మూతపడడంతోపాటు జనాలను ఇంటికే పరిమితం చేశారు. అత్యవసరాలకు అనుమతులిస్తూ, నిత్యావసరాలకు సడలింపులతో లాక్‌డౌన్‌ను ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నారు. ఇంతటి విపత్కర సమయంలోనూ కొంతమంది వ్యక్తులు నిబంధనలను ఉల్లంఘిస్తూ పోలీసులకు చిక్కుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆయా ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించని కారణంగా 500 మందిపై కేసులు నమోదు చేశారు. లాక్డౌన్ సమయంలో అనవసరంగా గుమిగూడినందుకు 176 కేసులు చేశారు. లాక్డౌన్ ఉల్లంఘన కింద వ్యాపార, వాణిజ్య సంస్థలపై 965 కేసులు, సుమారుగా ఐదు వేల వాహనాలు సీజ్ చేయగా, 10వేల మందికి మాస్కులు ధరించని కారణంగా జరిమానాలు విధించారు. 950 మందికి పోలీస్ శాఖ తరఫున ఈ-పాస్ జారీ చేశారు. కామారెడ్డి జిల్లాలో లాక్డౌన్ ఉల్లంఘన కేసులు 3,950 నమోదయ్యాయి. 991 వాహనాలు సీజ్ చేయగా నిబంధనలు పాటించని 242 వ్యాపార, వాణిజ్య సంస్థలపై కేసులు నమోదు చేశారు.
మనల్ని మనం కాపాడుకోవడం కోసమే లాక్డౌన్
కరోనా వైరస్ బారిన పడి అనేక కు టుంబాలు చిన్నాభిన్నమవుతున్నా యి. ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేస్తుంది. లాక్డౌన్లో ఎవరికి వారు స్వీయ నిర్బంధంలో ఉంటూ ప్రభుత్వానికి సహకరించాలి. మనల్ని మనం నియంత్రించుకుంటే కరోనా నియంత్రణలోకి వస్తుంది. ఈ నెల 12 నుంచి ఇప్పటి వరకు నిజామాబాద్ నగర ప్రజల సహకారం చాలా బాగుంది. కొంతమంది అవసరం లేకున్నా ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. అలాంటి వారిపై పోలీస్ శాఖ తరఫున కఠిన చర్యలు తీసుకుంటున్నాం. సడలింపు ఇచ్చిన సమయంలోనూ కొవిడ్ నిబంధనలు అనుసరించాలి. మాస్కులు ధరించి బయటికి రావాలి. భౌతిక దూరం పాటించాలి.
– వెంకటేశ్వర్లు, నిజామాబాద్ ఏసీపీ