లింగంపేట్, ఫిబ్రవరి 18: కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం బానాపూర్ గ్రామ శివారులోనీ అటవీ ప్రాంతంలో కాల్చివేసిన మృతదేహం ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. పిట్లం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన పోషయ్యను సమీప బంధువు హత్య చేసి మృతదేహాన్ని లింగంపేట్ మండలం బాణాపూర్ గ్రామ శివారులో గల అటవీ ప్రాంతంలో దహనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 2న పోషయ్య తప్పిపోయినట్టు పిట్లంలో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
విచారణలో భాగంగా అనుమానితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. పోషయ్యను హత్య చేసి బానాపూర్ గ్రామ అటవీ ప్రాంతంలో కాల్చివేసినట్లు వెల్లడించాడు. దీంతో గత రెండు రోజులుగా పోలీసులు అటవీ ప్రాంతంలో గాలిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పోషయ్యను దహనం చేసిన ప్రాంతాన్ని గుర్తించారు. ఘటనా స్థలంలో శవం పూర్తిగా కాలిపోయి, కేవలం అస్తికలు మాత్రమే మిగిలాయి. ఈ నేపథ్యంలో బాన్సువాడ రూరల్ సీఐ, పిట్లం పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.