కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్(Nizamsagar Project) నిండుకుండలా మారింది. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు భారీగా వస్తుండంతో ప్రాజెక్ట్ వద్ద జలకళ సంతరించుకుంది. కొన్ని సంవత్సరాల అనంతరం నిజాంసాగర్ నిండిపోవడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి 26వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా 5వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులకు గాను ప్రస్తుతం 1404 అడుగుల వరకు నీరు వచ్చి చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 17 టీఎంసీల (TMC) కు గాను ప్రస్తుత నీటినిల్వ 16 టీఎంసీలుగా ఉంది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు జీవనాడిగా ఉన్న నిజాంసాగర్ ఆయకట్టు బాల్కొండ నియోజకవర్గంలోని జక్రాన్పల్లి మండలం వరకు నీరు అందించింది. ప్రస్తుతం గోదావరి (Godavari) పరివాహక ప్రాంతంలో అలీసాగర్, గుత్ప, తదితర ఎత్తిపోతల పథకాలను నిర్మించడం వల్ల ఆయకట్టు పరిధి తగ్గింది. బోధన్ నియోజకవర్గం వరకు ఉన్న ఆయకట్టు వరకు అటు సాగు, తాగు అవసరాలకు నిజాంసాగర్ ఉపయోగపడుతుంది.