ఎల్లారెడ్డి రూరల్ (గాంధారి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రాంపూర్‌గడ్డ తండాలో విషాదం చోటుచేసుకున్నది. ట్రాన్స్ఫార్మర్పై విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా కరెంటు షాకుతో (Electric Shok) రైతు మృతి చెందారు. రాంపూర్‌గడ్డ తండాకు చెందిన పిట్ల శ్రీను (30) అనే రైతు ట్రాన్స్ఫార్మర్ వద్ద రిపేరు ఉండడంతో పోతంగల్ కలాన్ సబ్‌స్టేషన్ నుంచి ఎల్సీ తీసుకున్నారు. అనంతరం విద్యుత్ మరమ్మతు పనులు ప్రారంభించారు. కానీ ట్రాన్స్ఫార్మర్ నుంచి అతడు కిందికి దిగక ముందే అధికారులు విద్యుత్తు సరఫరా ప్రారంభించారు. దీంతో ఆయన విద్యుత్ షాక్‌కు గురయ్యారు. గమనించిన స్థానికులు అతడిని 108 అంబులెన్స్‌లో బాన్సువాడ ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు.
దీంతో మృతితో ఆగ్రహించిన తండావాసులు మృతదేహాన్ని పోతంగల్ కలాన్ సబ్‌స్టేషన్ వద్ద ఉంచి ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న ఎస్ఐ ఘటన స్థలానికి చేరుకొని ఆందోళనను విరమింప చేశారు. సబ్‌స్టేషన్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే రైతు మృతి చెందాడని గ్రామస్తులు ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.