గాంధారి: మొక్కజొన్న చేనులో అక్రమంగా పెంచుతున్న గంజాయి మొక్కలను గుర్తించిన కామారెడ్డి ప్రొహిబిషన్, ఎక్సైజ్ పోలీసులు ఆదివారం ధ్వంసం చేశారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం దన్సింగ్ తండా శివారులో రతన్ అనే వ్యక్తి మొక్కజొన్న చేనులో గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. విషయం తెలుసుకున్న ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ డి.సాయన్న నేతృత్వంలో దాడి చేశారు. ఈ సందర్భంగా 267 గంజాయి మొక్కలను గుర్తించి, వేర్లతో సహా వాటిని పెకిలించి, ధ్వంసం చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. గంజాయి మొక్కలు సుమారు ఏడు అడుగుల ఎత్తు వరకు పెరిగినట్లు ఆయన పేర్కొన్నారు.
గంజాయి మొక్కలను, అక్రమంగా సాగు చేస్తున్న రతన్‌పై కేసు నమోదు చేసినామని వెల్లడించారు. నిషేదిత గంజాయి మొక్కలను పెంచినా, నాటు సారాను తయారు చేసినా తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ దాడిలో ఎక్సైజ్ ఎస్సై శివకృష్ణ, సిబ్బంది రవి, సంగయ్య, శ్రీకాంత్‌రెడ్డి, సవిత, అమృత్‌రెడ్డి, లావణ్య తదితరులు ఉన్నారు.