Khushbo | తమిళ స్టార్ హీరో విజయ్, ప్రముఖ నటి త్రిష వ్యక్తిగత జీవితంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న నేపథ్యంలో సీనియర్ నటి ఖుష్బూ తాజాగా స్పందిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇతరుల వ్యక్తిగత జీవితాల్లో తలదూర్చి విమర్శలు చేసే వారిపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఖుష్బూ ..విజయ్, త్రిష ఇద్దరూ తనకు వ్యక్తిగతంగా బాగా తెలిసిన వారేనని చెప్పారు. ముఖ్యంగా త్రిష గురించి ప్రస్తావిస్తూ, తాను చూసిన గొప్ప మహిళల్లో ఆమె ఒకరని ప్రశంసించారు. త్రిష చాలా మృదుస్వభావి అని, ఎప్పుడూ హుందాగా ప్రవర్తిస్తుందని తెలిపారు. అలాంటి వ్యక్తిపై అనవసరంగా ఆరోపణలు చేయడం సరైంది కాదని ఆమె స్పష్టం చేశారు.
ఇప్పటి పరిస్థితుల్లో ఎవరు చిన్న తప్పు చేసినా, లేదా ఏ చిన్న విషయమైనా సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారుతుందని ఖుష్బూ ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు ఒకరు తుమ్మినా కూడా విమర్శించే పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. త్రిషలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిపై ఇలాంటి రూమర్స్ సృష్టించడం బాధాకరమని అన్నారు. రూమర్స్ క్రియేట్ చేసే వారిపై ఖుష్బూ తీవ్ర విమర్శలు చేశారు. ఇతరుల జీవితాల్లో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపుతూ, వారి గురించి తప్పుగా మాట్లాడటం ద్వారా కొందరు ఒక రకమైన “పైశాచిక ఆనందం” పొందుతున్నారని మండిపడ్డారు. సెలబ్రిటీల ప్రైవసీని దెబ్బతీసే ఈ సంస్కృతి ఇప్పుడు చెన్నైలో కూడా పెరుగుతుండటం విచారకరమని పేర్కొన్నారు.
ఇలాంటి కామెంట్లు చేసే వారిలో చాలా మంది ఎవరో కూడా తెలియని అనామకులేనని ఖుష్బూ తెలిపారు. అలాంటి వారి మాటలకు స్పందిస్తూ మన విలువైన సమయాన్ని వృథా చేయకూడదని త్రిషకు సూచించారు. మరోవైపు, విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సమయంలో ఈ రూమర్స్ ఆయన రాజకీయ కెరీర్‌పై ప్రభావం చూపుతాయా అనే ప్రశ్నకు కూడా ఖుష్బూ స్పందించారు. ప్రజలకు ఎవరికి ఓటు వేయాలో బాగా తెలుసని, ఒక నాయకుడి వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారం పూర్తిగా వారి వ్యక్తిగత విషయమని, దాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. సెలబ్రిటీల గురించి రూమర్స్ రావడం సహజమే అయినా, అవి వారి గౌరవాన్ని దెబ్బతీసేలా ఉండకూడదని ఖుష్బూ సూచించారు.