Theft case | ఎల్లారెడ్డి రూరల్ : వరుస దొంగతనాల కేసులో నిందితురాలిని అరెస్టు చేసినట్లు ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్ తెలిపారు. ఎల్లారెడ్డి పట్టణంలోని సీఐ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని సాతెల్లి గ్రామంలో వరుసగా అయిన మూడు దొంగతనాలకు కారణమైన అదే గ్రామానికి చెందిన నీరడి మంజులను అరెస్టు చేశామన్నారు.
ఏప్రిల్ మూడో తేదీన గ్రామానికి చెందిన పసుపుల అనిత ఊరికి వెళ్ళిన సమయంలో ఆమె ఇంట్లో ఉన్న బంగారు కమ్మలు, ముక్కుపుడక చోరీకి గురయ్యాయి. అంతేకాకుండా మే 9న గ్రామానికి చెందిన దుద్దుల దుర్గయ్య ఇంట్లో అయిదు తులాల వెండి కడెం, రూ.10వేల నగదు, మంగలి కిషన్ ఇంట్లో 20 తులాల వెండి పట్టీలు, ఒక జత బంగారు కమ్మలు, రూ.13 వేల నగదు దొంగతనానికి గురయ్యాయి. కేసుల విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో బుధవారం ఎల్లారెడ్డి పట్టణంలోని జువెలరీ మార్కెట్లో దొంగతనం చేసిన ఆభరణాలు అమ్మడానికి వచ్చిన మహిళను పోలీసులు పట్టుకున్నారు.
పట్టుకున్న మహిళను సాతెల్లి గ్రామానికి చెందిన నీరడి మంజులగా గుర్తించాం. కాగా అనుమానంతో నీరడి మంజులను విచారించగా సాతేల్లి గ్రామంలో జరిగిన మూడు దొంగతనాలను తానే చేశానని ఒప్పుకున్నట్లు సిఐ తెలిపారు. నిందితురాలి నుండి జత బంగారు కమ్మలు, 20 తులాల వెండి పట్టీలు, ఐదు తులాల వెండి కడెం, రూ.12 వేల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితురాలిని అరెస్టు చేసి, రిమాండ్ చేసినట్లు ఆయన తెలిపారు. కేసును దర్యాప్తు చేసి నిందితురాలిని పట్టుకోవడంలో చాకచక్యం కనపరిచిన ఎస్ఐ బొజ్జ మహేష్, కానిస్టేబుల్ ఇద్రీస్, హోంగార్డ్ ప్రసాద్ ను ఆయన అభినందించారు.