కామారెడ్డిలో ‘మాస్టర్ ప్లాన్’ రద్దుపై రైతన్నలు పోరుబాట పట్టనున్నారు. రైతుల అభిప్రాయం మేరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేసింది. అయితే ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దీనిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి రైతులకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇప్పటివరకు కాంగ్రెస్ పాలకుల నుంచి ఉలుకూ పలుకూ లేకపోవడంతో రైతుల్లో అనుమానాలు కలుగుతున్నాయి. మాస్టర్ ప్లాన్‌ను తిరిగి తెర మీదికి తీసుకు వస్తారా? అనే సందేహాలు తలెత్తుతుండగా, దీనిపై స్థానిక ఎమ్మెల్యేలు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. నాడు రైతులను రెచ్చగొట్టి ఆందోళనలకు ఉసిగొల్పిన నాయకులంతా ఇప్పుడు వివిధ పదవుల్లో ఉండికూడా మాస్టర్ ప్లాన్ విషయంపై నోరు విప్పకపోవడం గమనార్హం.
-నిజామాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కామారెడ్డిలో మాస్టర్ రగడ మరోసారి ముదురుతున్నది. మున్సిపల్ అధికారుల తీరు మూలంగా పచ్చని పొలాలకు ఇబ్బందులకు తలెత్తకూడదని భావించి గత బీఆర్ఎస్ సర్కార్ మాస్టార్ ప్లాన్ ముసాయిదాను పక్కనబెట్టింది. కామారెడ్డి మున్సిపల్ పాలకవర్గం ప్రత్యేకంగా సమావేశమై మాస్టర్ ప్లాన్ రద్దుపై ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఏడాది క్రితం ప్రభుత్వం మారిన తర్వాత ఈ అంశంపై కాంగ్రెస్ పాలకులు మాట్లాడడంలేదు. గత సర్కారును ఇబ్బందికి గురిచేయాలనే తలంపుతో కాంగ్రెస్, బీజేపీ కలిసి అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన సమయంలో మాస్టర్ ప్లాన్‌పై ఉద్యమాలు చేశాయి. రైతుల్లో లేనిపోని అపోహలను సృష్టించి రోడ్డు ఎక్కించాయి. ఇప్పుడవే పార్టీలు మిన్నకుండి పోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్నది. మాస్టర్ ప్లాన్ రద్దుపై స్పష్టతను కోరుతూ ఆందోళన చేసేందుకు రైతులు సిద్ధమవుతుండడంతో ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పాలకులకు ముచ్చెమటలు పడుతున్నాయి.
పట్టించుకోని రేవంత్ ప్రభుత్వం
కామారెడ్డి జిల్లాగా ఏర్పడిన తర్వాత పట్టణ రూపురేఖలు మారిపోయాయి. బీఆర్ఎస్ సర్కారు హయాంలో కామారెడ్డి ఎంతో అభివృద్ధికి నోచుకున్నది. మెడికల్ కాలేజీ ఏర్పాటులోనూ కామారెడ్డికి ప్రాధాన్యత దక్కింది. కేసీఆర్ పాలనలో నిర్మాణ రంగం జోరందుకోవడంతో కామారెడ్డి భారీగా విస్తరించింది. అయితే ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్‌లో పట్టణానికి ఆనుకుని ఉన్న గ్రామాలైన అడ్లూర్ ఎల్లారెడ్డి, అడ్లూర్, టేక్రియాల్, దేవునిపల్లి, లింగాపూర్, పాత రాజంపేట, సరంపల్లి, ఇల్చిపూర్ గ్రామాలను ఇండస్ట్రియల్ జోన్, గ్రీన్ జోన్‌గా గుర్తించారన్నది రైతుల వాదన.
రైతుల అభిప్రాయం మేరకు బీఆర్ఎస్ సర్కారు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతోపాటు ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేసింది. ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ వ్యవహారాన్ని గాలికొదిలేసింది. నాడు రైతులను రెచ్చగొట్టి ఆందోళనలకు ఉసిగొల్పిన వారంతా, ఇప్పుడు ఆయా పదవుల్లో ఉంటూ మాస్టర్ ప్లాన్ విషయంపై నోరు విప్పడం లేదు. దీంతో రైతులు మరోసారి పోరుబాట పట్టనున్నారు. మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డిలో రైతులు ఐక్యకార్యాచరణ కమిటీగా ఏర్పడి సమావేశం కావడంతో కాంగ్రెస్, బీజేపీల్లో వణుకు పుడుతున్నది.
నాడు రైతులకు బాసటగా బీఆర్ఎస్
కేసీఆర్ ప్రభుత్వం పదేండ్ల కాలంలో రైతులను కంటికి రెప్పలా చూసుకున్నది. ఎన్నో అనుకూల నిర్ణయాలు, పథకాలను ప్రకటించి దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్నది. 2021 మార్చి 27న కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసిన విధంగా మాస్టర్ ప్లాన్ ముసాయిదా లేకపోవడంపై గందరగోళం చోటు చేసుకున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం నాటి తప్పులను సరిచేసింది. ప్రభుత్వానికి చేరిన డ్రాఫ్ట్‌కు, కౌన్సిల్లో చర్చించిన ముసాయిదాకు మధ్య వైరుధ్యం ఉండడంతో మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఢిల్లీకి చెందిన డిజైన్ డెవలప్మెంట్ ఫోరంతోపాటు డీటీసీపీ జాయింట్ డైరెక్టర్ రమేశ్ బాబు కారణమని తేల్చి వారిపై చర్యలకు ఉపక్రమించింది.
రైతులకు ఎంతోమేలు చేసినప్పటికీ కాంగ్రెస్, బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరించి బీఆర్ఎస్ సర్కారుపై బురదజల్లే ప్రయత్నానికి ప్రయత్నించాయి. గత ప్రభుత్వం రద్దు చేసిన మాస్టర్ ప్లాన్ అంశంపై రైతుల్లో ఇప్పుడు మరోసారి అనుమానాలు కలుగుతున్నాయి. మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనతో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని రైతులకు అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ రెండు ప్రాంతాల్లో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా కాటిపల్లి వెంకట రమణారెడ్డి, మదన్ మోహన్‌రావు ఉన్నారు. వీరిద్దరూ ఇప్పుడు ఈ సమస్యపై స్పష్టత ఇవ్వడం లేదు. రైతులు ఆందోళన చేస్తున్నా వారితో మాట్లాడకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కామారెడ్డి రైతులు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతుండడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
ఏదో ఒకటి తేల్చుకుంటాం..
‘మాస్టర్ ప్లాన్’ బాధిత గ్రామాల రైతులు
కామారెడ్డి, జనవరి 20 : మాస్టర్ ప్లాన్ రద్దు జీవోపై ఏదో ఒకటి తేల్చుకోవాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ స్పష్టం చేసింది. సోమవారం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని టేక్రియాల్ గ్రామంలో రైతు ఐక్యకార్యాచణ కమిటీ ఆధ్వర్యంలో మాస్టర్ ప్లాన్ బాధిత గ్రామాల రైతులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యేలు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించి, తమకు మద్దతు ఇవ్వాలని కోరారు.
భూమి ధర పడిపోయింది..
రామారెడ్డి, జనవరి 20: నాకు, మా అన్నయ్యకు కలిపి పది ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. మాకు ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తితే అమ్ముకుందామనుకున్నాం. అప్పుడు ఎకరం రూ.80 లక్షల నుంచి కోటి రూపాయల వరకు పలికింది. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ అమలైదని చెప్పడంతో అతి తక్కువ ధరకు పడిపోయింది. ప్రభుత్వం వెంటనే మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలి. లేని పక్షంలో ఉద్యమానికి సిద్ధంగా ఉన్నాం.
-గంగసాని సాగర్‌రెడ్డి , యువరైతు, అడ్లూర్ ఎల్లారెడ్డి
ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి
అసెంబ్లీ ఎన్నికల్లో మాస్టర్ ప్లాన్ రద్దుపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నీట మూటగానే మిగిలిపోయింది. దానిని ఇప్పుడు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం. కామారెడ్డి పట్టణంలో వీలినమైన ఎనిమిది గ్రామాల రైతులందరం కలిసి మలిదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నాం.ఇందుకోసం రైతు ఐక్య కార్యాచరణ కమిటీలను ఏర్పాటు చేస్తున్నాం.
-బల్వంత్‌రావు, కామారెడ్డి విలీన గ్రామానికి చెందిన రైతు
రద్దుచేసే వరకు ఉద్యమిస్తాం..
వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్న మాకు మాస్టర్ ప్లాన్ ( ఇండస్ట్రియల్ జోన్) అంటూ భయపెడుతున్నారు. మేము బోర్ల సాయంతో ఏడాదికి రెండు పంటలను పం డించుకుంటున్నాం. వేల కుటుంబాలు ప్ర త్యక్షంగా, పరోక్షంగా జీవనం కొనసాగి స్తున్నాయి. అప్పటి నాయకులు నేడు ఉన్న త పదవుల్లో ఉన్నారు. వారు చొరవ తీసుకోవాలి. మాస్టర్ ప్లాన్ జీవోను రద్దు చేసేవరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం.
-జీర్ల మహిపాల్, యువ రైతు, అడ్లూర్ ఎల్లారెడ్డి