ఖలీల్వాడీ, జూన్ 7: దసరాలోపు పెండింగ్లో ఉన్న ఆరు డీఏల్లో మూడు డీఏలు ఇవ్వకపోతే ఉద్యోగుల పక్షాన ఉద్యమిస్తామని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. వెంటనే పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను ఆశపెట్టి, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నాయకులు శనివారం నిజామాబాద్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ కవితతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చిందని గుర్తుచేశారు.
ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు ఇవ్వడంతోపాటు డీఏలు ఎప్పటికప్పుడు చెల్లిస్తామని, పీఆర్సీ ద్వారా మెరుగైన ఫిట్మెంట్ ఇస్తామనే హామీలతో పాటు ఉద్యోగులకు ఎన్నో వాగ్దానాలు చేసిందని తెలిపారు. ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకపోగా ఉద్యోగులకు ఐదు డీఏలను పెండింగ్లో పెట్టి వారిని ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. జూలై ఒకటిన చెల్లించాల్సిన మరో డీఏను కలుపుకుంటే మొత్తం ఆ రు డీఏలను ఈ ప్రభుత్వం బాకీ పడిందన్నారు. ఇప్పుడు ఒక జీవో, ఆరునెలల తర్వాత ఇంకో జీవో ఇస్తామని ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం అంటే ఉద్యోగులను వంచించడమే అవుతుందన్నా రు.
ఆరు గ్యారెంటీలతో సామాన్య ప్రజలను దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఉద్యోగులను కూడా మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా పీఆర్సీ వేయలేదన్నారు. కనీసం మధ్యంతర భృతి ఇచ్చే ప్రయత్నం చేయకపోగా ఉద్యోగులను నిందించేలా ప్రభుత్వం మాట్లాడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్సీ కవితను కలిసిన వారిలో తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ రెండు జిల్లాల అధ్యక్షులు నాగరాజు, రేవంత్ తదితరులు ఉన్నారు.