వర్షాభావ పరిస్థితులు, ఎగువ ప్రాంతం నుంచి వరద రాకపోవడంతో ఎడారిలా మారుతున్న ఎస్సారెస్పీకి బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం జలాలతో జీవం పోసింది. ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీరందించి రైతులను ఆదుకున్నది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే ఆయకట్టును రక్షించుకోవడానికి వందల కిలో మీటర్ల నుంచి కాళేశ్వరం జలాలను ఎదురెక్కించి ఎస్సీరెస్పీ పునరుజ్జీవ పథకంతో వరద కాలువను జీవనదిలా మార్చింది. దీంతో రైతాంగం ‘సాగు’పండుగ చేసుకున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వట్టిపోకుండా ఉండేందుకు చేపట్టిన పునరుజ్జీవ పథకం ద్వారా వరద కాలువకు ప్రాణం పోసింది. రెండు పంటలు పండించుకోవడానికి ఢోకా లేదన్న ధీమా కాళేశ్వరం జలాలను రివర్స్ పంపింగ్ ద్వారా తెప్పించి రైతుల నీటి కష్టాలను దూరం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. పునరుజ్జీవ పథకం ద్వారా ఎస్సారెస్పీని నింపడంతోపాటు 365 రోజులూ వరదకాలువలో నీళ్లు ఉంచాలన్న కేసీఆర్ కల నెరవేరగా.. రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. 2023 జూలైలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో వరదకాలువ ద్వారా రివర్స్పంపింగ్తో నీటిని రోజుకు ఒక టీఎంసీ చొప్పున ఎస్సారెస్పీలోకి తరలించారు. వరదకాలువలో ఎదురెక్కుతున్న జలాలకు గ్రామగ్రామాన పూలు జల్లుతూ స్వాగతం పలుకుతూ సంబురాలు చేసుకున్నామని రైతులు గుర్తుచేసుకుంటున్నారు.
-మోర్తాడ్, జూన్ 20
ఉత్తరతెలంగాణ వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 112 టీఎంసీల నుంచి 80.5 టీఎంసీలకు పడిపోయింది. దీంతోపాటు దశాబ్దాలుగా ప్రాజెక్ట్‌లో పెరిగిన పూడిక, ఎగువన బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణం ఎస్సారెస్పీ భవిష్యత్తు ఏమిటన్న ప్రశ్నకు.. పునరుజ్జీవ పథకంతో జీవం పోసినట్లయ్యింది. 102 కిలోమీటర్ల మేర వరద కాలువలో నీరు ఎదురెక్కి ఎస్సారెస్పీని చేరడానికి ఏర్పాటు చేసిన పునరుజ్జీవ పథకం 2023లో మొదటిసారి చేపట్టారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ (వరదకాలువ 73వ కిమీ)వద్ద మొదటి పంపుహౌస్, జగిత్యాల జిల్లా ఇబ్రహాంపట్నం మండలం, రాజేశ్వర్‌రావుపేట్(వరదకాలువ 34కిమీ) వద్ద రెండో పంపుహౌస్, నిజామాబాద్ జిల్లా ముప్కాల్(0.10కిమీ) వద్ద మూడో పంప్‌హౌస్ మీదుగా కాళేశ్వరం జలాలు ఎస్సారెస్పీని ముద్దాడాయి. దీంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డా ఎస్సారెస్పీపై ఆధారపడిన రైతాంగానికి సాగునీటి భరోసా కల్పించినట్లయ్యింది.
పునరుజ్జీవ పథకం అమలులో మాజీ మంత్రి, ప్రస్తుత బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కృషి ఎంతో ఉంది. రివర్స్‌పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీకి నీరు తీసుకురావచ్చనే ఆయన సూచనతో ఈ పథకానికి రూపకల్పన మొదలై పనులు పూర్తిచేశారు. పునరుజ్జీవ పథకం రైతుల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. ఎస్సారెస్పీ ఆయకట్టుకు రెండు పంటలకు భరోసాను ఇచ్చింది. వరదకాలువ ద్వారా బాల్కొండనియోజక వర్గంలోని చెరువులు నింపుకునేలా వరద కాలువకు తూములను ఏర్పాటు చేయడంతోపాటు చెరువులను నింపారు. వరదకాలువ నిండుకుండలా మారడంతో భూగర్భజలాలు పెరగడంతో సాగు,తాగునీటి కష్టాలు దూరమయ్యాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కాళేశ్వరంపై విషప్రచారాలు మొదలయ్యాయి. వర్షాభావ పరిస్థితులు వస్తే వరదకాలువ ద్వారా ఎస్సారెస్పీకి నీటిని తీసుకువస్తారా అనే అనుమానాలను రైతులు వ్యక్తంచేస్తున్నారు.
వరదకాలువలో నీళ్లుంటే సమీప ప్రాంతాల్లో వ్యవసాయభూముల్లో సాగుకు ఢోకా ఉండదు. భూగర్భ జలాలు, బోర్లలో నీళ్లు పెరగడం, వరదకాలువ నీటితో చెరువులు నింపుకునే అవకాశం ఉండడంతో నీటి కష్టాలు దూరమైనయ్. వరదకాలువ నిర్మించిన కొన్నేండ్ల తర్వాత పునరుజ్జీవ పథకం ద్వారా వర్షాభావ పరిస్థితుల్లో కూడా నిండుకుండలా ఉండడం మాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. వరదకాలువలో నీళ్లను ఆపుకునేందుకు గట్లు కట్టుకునే పరిస్థితులను కూడా
చూసినం.
-ప్రభుదాస్, రైతు, తిమ్మాపూర్
కాళేశ్వరం నీటిని వరద కాలువ ద్వారా ఎదురురెక్కించడంతో రైతులకు ఎం తో ప్రయోజనం చేకూరింది. పంటలు ఎండిపోతాయనుకున్న సమయంలో కాళేశ్వరం జలాలు రావడంతో బతికించుకున్నాం. ప్రాజెక్ట్ ఉన్నా ప్రయోజనం ఏమిటన్న పరిస్థితి నుంచి రెండు పంటలకు భరోసా కల్పించే స్థాయికి చేర్చింది పునరుజ్జీవ పథకం. ఈ పథకానికి రూపం ఇచ్చిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డికి రుణపడి ఉంటాం.
– చిన్నరాజేశ్వర్, రైతు, మోర్తాడ్