వినాయక్‌నగర్, జూన్ 8: నిజామాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 16వేల కేసులు పరిష్కారమయ్యాయి. అదనపు జిల్లా కోర్టులో న్యాయ విచారణలో ఉన్న భూనష్ట పరిహారం సివిల్ దావాలో ఇరుపక్షాల రాజీ మేరకు రూ.6 కోట్ల 11 లక్షల15వేల111 పరిహారానికి సంబంధించి అవార్డును జిల్లా జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుంచాల సమక్షంలో జారీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోని నారాయణ రావుకు చెందిన ఏడు ఎకరాల వ్యవసాయ భూమిని బలహీన వర్గాల ఇంటి నిర్మాణం కోసం 1984లో అప్పటి కలెక్టర్ తరఫున నిజామాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి గెజిట్‌ను విడుదల చేశారు.
భూ యజమాని నారాయణ రావు భూనష్ట పరిహారం చెల్లించాలని నిజామాబాద్ అదనపు జిల్లా కోర్టులో 2008లో పది కోట్లకు దావా దాఖలు చేశారు. ఇరుపక్షాలతో సంప్రదింపులు జరిపిన జిల్లా జడ్జి సునీత కుంచాల, అదనపు జిల్లా జడ్జి కనకదుర్గ రాజీ పరిష్కారంగా రూ.6కోట్ల11 లక్షల12 వేల111కు ఒప్పించారు. ఈ మేరకు లోక్‌అదాలత్‌లో అవార్డును అందజేసి బ్యాంకు చెక్కును భూనష్టపరిహారదారు నారాయణరావుకు జిల్లా జడ్జి సునీత కుంచాల, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అందజేశారు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి పద్మావతి, ప్రభుత్వ న్యాయవాది శ్రీహరి ఆచార్య, సంస్థ సూపరింటెండెంట్ పురుశోత్తం గౌడ్ పాల్గొన్నారు.
కామారెడ్డి, జూన్ 8: చట్టాలపై ప్రజలందరికీ అవగాహన ఉండాలని, కేసులను రాజీ పద్ధతిలో పరిష్కరించుకోవాలని కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ వరప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జి నాగరాణి అన్నారు. జాతీయ లోక్‌అదాలత్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సివిల్ దావాలు , రాజీపడదగిన క్రిమినల్ కేసులు ఇరుపక్షాల ఆమోదంతో రాజీ పద్ధతిలో పరిష్కారానికి చట్టంలో అనుమతులు ఉన్నాయని వివరించారు. రెగ్యులర్ కోర్టుకు రాని కేసులు కూడా పరిష్కరించనున్నట్లు తెలిపారు. లోక్‌అదాలత్‌లో 3819 కేసులు పరిష్కారమయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జి లాల్‌సింగ్, శ్రీనివాస్ నాయక్, సివిల్ జడ్జి సుధాకర్, అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ దీక్ష, పీపీ రాజగోపాల్ గౌడ్, అశోక్, శివరాం, నిమ్మ దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.