Accreditation Cards | కంటేశ్వర్, నవంబర్ 21 : జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు తీరిపోయి ఏడాదిన్నర గడుస్తున్నా ఇంకా స్టిక్కర్లతో కొనసాగిస్తున్నారని, వాటి స్థానంలో కొత్త కార్డులు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ప్రతినిధులు కోరారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో అక్రిడేషన్ కమిటీలు వేసి వెంటనే కొత్తవి జారీ చేయాలని డిమాండ్ చేశారు.
టీడబ్ల్యూజేఎఫ్ అడహక్ కమిటీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం నిజామాబాద్ కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ జిల్లా కేంద్రాలతో పాటు నియోజకవర్గ కేంద్రాలు, మండలాల్లో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. నిత్యం ఒత్తిడితో విధులు నిర్వర్తించే జర్నలిస్టులకు ఎలాంటి కొర్రీలు లేకుండా ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
వాస్తవాలు వెగులులోకి తెస్తున్నజర్నలిస్టులపై ఈ మధ్య కాలంలో దాడులు పెరుగుతున్నాయని, అక్రమ కేసులు పరిపాటిగా మారాయని, వాటిని నివారించేందుకు జర్నలిస్టుల రక్షణ చట్టం తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు రాంచందర్, ఎం భాస్కర్, కే వెంకటేశ్, ఎం మధు, ఏ అనిత, పరమేశ్వర్, రాజు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.