కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన రైతుభరోసా పథకం తూతూ మంత్రంగా అమలవుతున్నది. అరకొర పెట్టుబడి సాయం అందిస్తున్నది. రైతుభరోసా డబ్బుల జమ మొదలై 15 రోజులు దాటినా ఇప్పటివరకూ చాలా మంది రైతులకు అందలేదు. ఒక గ్రామంలో వంద మంది ఉంటే అందులో సగానికి సగం మందికి కూడా రైతు భరోసా రాకపోవడం గమనార్హం. రైతుభరోసాను అమలుచేస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి చెబుతున్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కేసీఆర్ హయాంలో రైతుబంధు జమ సమయంలో టింగ్ టింగ్ మంటూ రైతుల మొబైల్ ఫోన్లు మోగిన సందర్భాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
-నిజామాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు పూటకోసారి మాట మారుస్తూ రైతులను గందరగోళానికి గురిచేస్తున్నారు. మొదట సంక్రాంతికి రైతు భరోసా అందిస్తామని, ఆ తర్వాత జనవరి నెలాఖరులోగా ఇస్తామంటూ చెప్పుకొచ్చారు. తీరా ఫిబ్రవరి మొదటి వారంలో షురూ అయినప్పటికీ ఇప్పటి వరకూ పూర్తి స్థాయిలో ఎవరికీ రైతు భరోసా డబ్బులు జమ కాకపోవడంతో రేవంత్ సర్కారుపై అన్నదాతలు మండిపడుతున్నారు. ఇదేం పద్ధతి అంటూ నిలదీస్తున్నారు.
రైతులను మోసం చేయడం తగదంటూ హితవు పలుకుతున్నారు. ఎకరాకు రూ.15వేలు చొప్పున రైతుభరోసా సాయం చేస్తామంటూ రైతులకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తీరా ఇప్పుడేమో ఎకరాకు రూ.12వేలు మాత్రమే ఇస్తామంటూ ప్రకటించారు. తగ్గించిన పెట్టుబడి సాయాన్ని కూడా సరైన రీతిలో అందివ్వకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిన్నర కాలంలో కొత్తగా భూములు కొనుగోలు చేసి పట్టాదారు పాసుపుస్తకాలు కలిగిన వారికి రూపాయి జమ కాలేదు. ఇలాంటి ఖాతాలు ఉమ్మడి జిల్లాలో 20వేల వరకు ఉన్నాయి. వీరికి ఇప్పటి వరకు రైతుభరోసా జమ కాకపోవడం గమనార్హం.
గతంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మొత్తం 10లక్షల 48వేల ఎకరాలకు రైతుబంధు పథకం వర్తించింది. ఇందులో సాగుకు యోగ్యం కాని భూములకు రైతుభరోసా వర్తించకుండా నిషేధించారు. గుట్టలు, పడావు భూములను తీసేసినప్పటికీ దాదాపుగా 10లక్షల ఎకరాలకు రైతుభరోసా చెల్లించాల్సి ఉన్నది. ఏటా ఎకరానికి రూ.12వేలు మాత్రమే ఇస్తామని కాంగ్రెస్ సర్కారు చెప్పింది. యాసంగిలో ఎకరాకు రూ.6వేలు ఇస్తే దాదాపు రూ.700 కోట్లు నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. కానీ ఇంత వరకు రూ.100 కోట్లు లోపే నగదు జమ చేసినట్లుగా తెలుస్తోంది.
రైతుభరోసా వివరాలను వెల్లడించడంలో వ్యవసాయ శాఖ అత్యంత గోప్యతను పాటిస్తున్నది. పెట్టుబడి సాయం అరకొరగానే అందుతుండడంతో వివరాలు బహిర్గతం చేసేందుకు ప్రభుత్వమూ ఇష్టపడడంలేదు. కేసీఆర్ హయాంలో నిజామాబాద్ జిల్లాలో 2లక్షల 82వేల మందికి రైతుబంధు కింద రూ.274కోట్లు, కామారెడ్డి జిల్లాలో 2లక్షల 90వేల మంది రైతులకు సుమారు రూ.250కోట్లు పెట్టుబడి సాయం అందింది. ఇప్పుడు ఎవరికి రైతుభరోసా వస్తుందో? ఎవరికి రావడంలేదో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. రైతు రుణమాఫీ మాదిరిగానే రైతుభరోసా పథకం కూడా అస్తవ్యస్తంగా మారడంతో ప్రభుత్వంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
రైతుభరోసా అమలు వ్యవసాయ శాఖకు తలపోటుగా మారింది. జిల్లా వ్యవసాయాధికారి నుంచి మొదలు వ్యవసాయ విస్తరణాధికారుల దాకా రైతుల నుంచి వస్తున్న ఫోన్లకు జవాబివ్వలేక చతికిల బడుతున్నారు. అర ఎకరం, ఎకరం, ఎకరన్నర లోపు భూములున్న సన్న, చిన్నకారు రైతులను కాంగ్రెస్ సర్కారు మోసం చేసింది. కొంత మందికి పట్టాదారు పాసు పుస్తకంలో ఉన్న విస్తీర్ణానికి భిన్నంగా తక్కువ నగదును ప్రభుత్వం జమ చేసింది.
ఎందుకు? ఏమిటి? అనేదానికి సరైన సమాధానం దొరకడం లేదు. దీంతో రైతుతు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటి వరకు మూడెకరాల్లోపు రైతులకు పెట్టుబడి సాయం విడుదల చేసినట్లు వ్యవసాయాధికారులు అధికారికంగా చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే మూడు ఎకరాల్లోపు రైతులకు కూడా పూర్తి స్థాయిలో రైతుభరోసా నగదు జమకాకపోవడం గమనార్హం. ఏఈవోలు, ఏవోలు రైతుల ఒత్తిడిని తట్టుకోలేక ఫోన్లు స్విచ్ఛాఫ్ చేస్తున్నారు.
దీంతో అన్నదాతలు రైతు వేదికల వద్దకు పరుగులు తీస్తున్నారు. రైతు వేదికలకు తాళాలు వేసుకుని ఏఈవోలు పత్తా లేకుండా పోవడంతో వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమాల్లో మాత్రమే రైతుభరోసా జమ కాని రైతుల వివరాలను రైతు భరోసా పోర్టల్లో పరిశీలించి సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో బ్యాంక్ డిటైల్స్ అప్డేటెడ్… టు బీ ప్రాసెస్డ్ అంటూ రైతులకు వివరాలు చూపిస్తున్నారు. గ్రామాల్లో కొద్ది మందికి మాత్రమే రైతుభరోసా జమకావడం, చాలా మందికి వర్తించకపోవడంపై గందరగోళం నెలకొన్నది.
రైతుల పెట్టుబడి కోసం సమయానికి రాని రైతు భరోసా ఎందుకు. కేసీఆర్ హయాంలో పెట్టుబడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు ఎదురు చూపులే మిగిలాయి.
-పైడాకుల రాములు, పోతారం, పాల్వంచ మండలం
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముం దు రైతు భరోసా రూ.15 వేలు ఇస్తానన్న హామీని తుంగలో తొక్కింది. అబద్ధాలతో రైతులను మోసం చేసిం ది. ఇప్పుడేమో కేవలం రూ.12 వేలు ఇవ్వడం దారు ణం. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి.
-బట్ట రమేశ్,అక్కాపూర్, మాచారెడ్డి మండలం
నాకు ఇప్పటి వరకు రైతు భరోసా అందలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుబంధు సమయానికి వచ్చేది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎదురు చుపులే తప్ప రైతు భరోసా అందేలా లేదు. మరో 15 రోజులైతే పంటలు కోతకు వస్తాయి. రైతు భరోసా పేరు తో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నది.
-సలేంద్రి శ్రీశైలం, రత్నగిరిపల్లి, మాచారెడ్డి మండలం