ఎల్లారెడ్డి, ఏప్రిల్ 28: హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ కంటే మెరుగైన పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. గద్దెనెక్కాక మోసగించిందని విమర్శించారు. మంగళవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో ఓ శుభకార్యానికి వచ్చిన ఆయనకు మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు పర్యాయాలు పాలన చేస్తే తెలంగాణకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని, యూఎన్వో సైతం గుర్తించిందని తెలిపారు. నాడు పదేండ్ల సంక్షేమ పాలన తర్వాత ప్రజలు మార్పు కోరుకున్నారు.. కానీ నేడు రెండున్నరేండ్లకు జనం మార్పు కోరుకుంటున్నారన్నారు.
అన్ని రంగాల్లో కాంగ్రెస్ విఫలమైందని జీవన్‌రెడ్డి విమర్శించారు. కల్యాణలక్ష్మి కింద బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.లక్ష ఇస్తే, చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పిందన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదని, హైకోర్టు మొట్టికాయలు వేసినా స్పందించడం లేదన్నారు. చివరకు విద్యార్థుల తల్లిదండ్రులే కట్టుకోవాలని చెప్పడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు.
కేసీఆర్ హయాంలో ప్రతి ఆర్నెళ్లకు ఒకసారి తప్పకుండా రైతుబంధు డబ్బులు జమ చేసే వారని గుర్తు చేసిన జీవన్‌రెడ్డి.. కాంగ్రెస్ పాలనలో ఎప్పుడు ఇస్తున్నారో, ఎప్పుడు ఎగ్గొడుతున్నారో తెలియడం లేదన్నారు. రేవంత్ పాలనపై రైతులు, రైతు కూలీలు, బడుగు, బలహీన వర్గాలు అందరూ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ.. కేవలం 17వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని, దీంతో యువకులు, నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్‌పై వ్యక్తిగతంగా అభిమానం ఉందని, కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలన కారణంగానే తాను బీఆర్ఎస్లోకి వచ్చానని వివరించారు. ప్రజలు ప్రస్తుతం రేవంత్ పాలన పోవాలి.. మళ్లీ కేసీఆర్ పాలన రావాలని కోరుకుంటున్నారన్నారు.