ఖలీల్‌వాడి, ఆగస్టు 15 : కాంగ్రెస్ పాలన వచ్చి తెలంగాణకు మళ్లీ చీకటి రోజులు దాపురించాయని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ర్టాన్ని దేశానికే తలమానికంగా నిలిపి పదేండ్లలో కేసీఆర్ తెచ్చిన స్వర్ణయుగం కాంగ్రెస్ రాబంధుల పాలవుతుందని ఎవరూ ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ స్వరాష్ట్రంగా మారి బానిసత్వ శక్తుల కబంధ హస్తాల నుంచి బయట పడిన సంతోషం పదేండ్లు కాగానే మాయమైందని శుక్రవారం ఒక ప్రకటనలో జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజల హక్కులను హరించి బతికే కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం పేరుతో అదే బానిసత్వం,అదే అణచివేత మళ్లీ తెలంగాణలో కరాళ నృత్యం చేస్తున్నాయని మండిపడ్డారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో అవే మోసాలు కొనసాగిస్తూ ప్రజలను అదే గోస పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ అవినీతి, బీజేపీ దుర్నీతికి తెలంగాణ ప్రయోగశాలగా మారిందని పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు తెలంగాణను నిలువునా దోపిడీ చేస్తూ ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు కప్పం కడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ పై బీజేపీ పగ పెంచుకుని దగా చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణకు దక్కాల్సిన సెమీకండక్టర్ పరిశ్రమ ఏపీకి తరలించి తెలంగాణ నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిన బీజేపీకి తెలంగాణలో ఉండే అర్హత ఉం దా ? అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణపై కొనసాగుతున్న మోదీ సర్కారు వివక్షపై రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు నోరువిప్పకపోవడం సిగ్గుచేటన్నారు.
తెలంగాణ అంటేనే కడుపులో కత్తులు పెట్టుకున్నట్లు, కం డ్లల్లో కక్ష నింపుకున్నట్లు వ్యవహరించే కాంగ్రెస్-బీజేపీ ద్వయం నిజరూపాన్ని ప్రజలు గమనించాలని జీవన్‌రెడ్డి కోరారు. తెలంగాణ కాంగ్రెస్ కిరాయి పార్టీ అని, బీజేపీ పరాయి పార్టీగా అభివర్ణించారు. తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బ తీసేలా ఢిల్లీ పెత్తనం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీని తెలంగాణను నుంచి తరిమికొట్టేందుకు ప్రజలం తా మరో సంగ్రామానికి సంసిద్ధులు కావల్సిన సమయం ఆసన్నమైందని జీవన్‌రెడ్డి పిలుపునిచ్చారు.