నందిపేట్, డిసెంబర్ 25 : రైతుల చిరకాల వాంఛ అయిన మచ్చర్ల లిఫ్ట్ కేసీఆర్ గిఫ్ట్ అని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ పాలన స్వర్ణయుగమని, కాంగ్రెస్, బీజేపీ కలిసి ఇప్పుడు రాతియుగం తెచ్చాయని మండిపడ్డారు. ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, కాంగ్రెస్, బీజేపీలను వెంటాడి తీరుతామని హెచ్చరించారు. మచ్చర్ల లిఫ్ట్ పనులను ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గానికి మంజూరైన మూడు కొత్త లిఫ్ట్‌లు బీఆర్ఎస్ ఇచ్చినవేనని స్పష్టంచేశారు. మచ్చర్ల, జోద్పూర్, ఖుద్వాన్పూర్ గ్రామాల రైతులకు చెందిన 2,860 ఎకరాల భూమిని సాగులోకి తెచ్చేందుకు మచ్చర్ల ఎత్తిపోతల పథకానికి రూ.40 కోట్లు, ఫత్తేపూర్, చేపూర్, సుర్భిర్యాల్ ఎత్తిపోతల పథకానికి రూ.110 కోట్లు, చిక్లీ-గుంజిలి లిఫ్ట్‌కు రూ.89 కోట్లను తానే మంజూరు చేయించానని జీవన్‌రెడ్డి తెలిపారు.
బీఆర్ఎస్ హయాంలో మంజూరైందనే అక్కసుతో మచ్చర్ల లిఫ్ట్ పనులను ఏడాదిగా చేపట్టడం లేదని మండిపడ్డారు. పైగా కాంగ్రెస్ నాయకులు మందికి పుట్టినోళ్లు మావాళ్లే అన్న చందంగా బీఆర్ఎస్ హయాంలో మంజూరైన ఎత్తిపోతల పథకాలను కూడా తామే మంజూరు చేయించామని చెప్పుకుంటూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. తాను రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే మచ్చర్ల లిఫ్ట్‌కు రూ.40 కోట్ల మంజూరయ్యాయని, నిధులకు సంబంధించిన జీవో కూడా వచ్చి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయి కాంట్రాక్టర్‌తో అగ్రిమెంట్ కూడా జరిగిందని జీవన్‌రెడ్డి వివరించారు. బీఆర్ఎస్ హయాంలో వచ్చిందనే అక్కసుతో ఏడాది కాలంగా పనులు చేపట్టకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్, బీజేపీ ఆర్మూర్ పాలిట అష్టదరిద్రాలుగా మారాయని మండిపడ్డారు. గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే తెచ్చిన నిధులు నిల్, ఓడిన కాంగ్రెస్ నేత అవినీతి ఫుల్.. ఈ రెండు పార్టీల పుణ్యమా అని ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి కిల్ అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీ చేసింది శూన్యమన్నారు. ఇప్పటికైనా ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధిపై శ్రద్ధ పెట్టాలని, ఎత్తిపోతల పనులు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే తామే వెంటాడి చేయిస్తామని హెచ్చరించారు.