ఖలీల్‌వాడి, జనవరి 26 : కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై ప్రజలు తిరగబడాలని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పిలుపునిచ్చారు. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు పుట్టి పెరిగిన గ్రామాల్లో ఎన్నికల హామీలు నూరు శాతం అమలు జరిగాయని నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, లేకుంటే కాంగ్రెస్ నేతలు రాజకీయాల నుం చి తప్పుకుంటారా ? అని సవాల్ విసిరారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
హామీల అమలులో ప్రజలకు సర్కారు వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలను మండలానికి ఒక గ్రామం చొప్పున, జిల్లాలోని 35 మండలాల్లో కేవలం 35 గ్రామాల్లో ప్రారంభించారని తెలిపారు. అవి కూడా పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి, కాంగ్రెస్ ఇన్చార్జి వినయ్‌రెడ్డి, ఎంపీ అర్వింద్ వంటి ముఖ్యనేతల సొంతూళ్లలో తప్ప ఇతర గ్రామాల్లో ప్రభుత్వ పథకాల ఊసే లేదన్నారు. ఈ 35 గ్రామాల్లో ఏ ఊరికైనా వెళ్లి, నూరుశాతం హామీలు అమలవుతున్నాయని ప్రజలు చెబితే తాను అక్కడికక్కడే రాజకీయాలను వదిలేస్తానని, లేకుంటే కాంగ్రెస్ నాయకులు, రాజకీయాలు వదిలేసి ముక్కు నేలకు రాస్తారా ? అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు.
రేవంత్ ప్రజలతో చదరంగమాడుతుంటే,జనం ప్రభుత్వంతో రణరంగ మాడుతున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీలవి తుగ్లక్ రాజకీయాలని ఆయ న విమర్శించారు. తెలంగాణ తుగ్లక్ సీఎం రేవంత్‌రెడ్డి, ఆర్మూర్ తుగ్లక్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి, నిజామాబాద్ తుగ్లక్ ఎంపీ అర్వింద్ అని విమర్శించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి చెప్పేవి జోకర్ మాటలని, చేసేవి బ్రోకర్ పనులన్నారు. ఒక్క రూపాయికే వైద్యమందిస్తానని ఇచ్చిన హామీ ఏమైందని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ మోసాలపై ప్రజలు తిరగబడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకుల వీరంగాలు, అక్రమ కేసులకు బీఆర్ఎస్ భయపడే రకం కాదన్నారు. తాము పోరాడుతూనే ఉంటామని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూనే ఉంటామని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రజలను మోసగిస్తున్నదని, అందుకే ఎక్కడ చూసినా జనాగ్రహజ్వాలలే కనిపిస్తున్నాయన్నారు. అగ్నిగుండాలైన గ్రామసభలు సర్కారును దహించివేస్తున్నాయని తెలిపారు. రేవంత్‌పాలన అట్టర్‌ఫ్లాప్ అని, ఏడాదికే కాంగ్రెస్ గ్రాఫ్ కుప్పకూలిపోయిందని ఎద్దేవా చేశారు. ఇది ప్రజాపాలన కాదని, తుగ్లక్ పాలన అని విమర్శించారు. ఎన్నికల హామీల అమలులో ఘోర వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడానికే రోజుకో నాటకం వేస్తున్నారని మండిపడ్డారు.
రుణమాఫీ చేశామని వ్యవసాయశాఖ మంత్రి అంటే, అమలు కాలేదని వైద్యారోగ్యశాఖ మంత్రి అంటాడని తెలిపారు. పథకాల అమలుకు సంక్రాంతి పోయిందని, ఇప్పుడు శివరాత్రికి అంటున్నారని ఎద్దేవా చేశారు. హామీలన్నీ నిజంగా అమలు చేస్తే, ప్రజలు గ్రామసభల్లో కాంగ్రెస్ డొక్క చింపి డోలు ఎందుకు కడుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనను బోగస్ పాలనగా ఆయన అభివర్ణించారు. రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 13 హామీలు, 420 వాగ్దానాలన్నీ బోగస్ అన్నారు.అసలు గ్రామసభలే పెద్ద బోగస్ అని,కాంగ్రెస్ సర్కారుపై ప్రజల తిరుగుబాటు ఒక్కటే నిప్పులాంటి నిజం అని పేర్కొన్నారు.