ఆర్మూర్‌టౌన్, జనవరి 23: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై గ్రామసభల సాక్షిగా కాంగ్రెస్ సర్కారును నిలదీయాలని ప్రజలకు బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమలు కాని ఆరు గ్యారంటీలే కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి నాంది అని పేర్కొన్నారు.
గ్రామసభల్లో ప్రజలు తిరగబడుతున్నారని తెలిపారు. ఏడాది దాటినా ఆరు గ్యారంటీలకే గతి లేదని, ఇక ఇండ్లు, రేషన్ కార్డు ఇస్తామంటే నమ్మేదెవరని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డుల మంజూరు పేరుతో నిర్వహిస్తున్న గ్రామసభల్లో ప్రజల తిరుగుబాటు కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనకు నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు.ఆరు గ్యారంటీలకే ఉప్పు పాతరేసి కొత్తగా ఈ డ్రామాలేమిటని ప్రజలు నిలదీస్తున్నారని తెలిపారు. అక్కడక్కడ హామీల అమలుపై ఎమ్మెల్యేలను ప్రజలు నిలబెట్టి అడుగుతున్నారన్నారు. ఇండ్లు ఎప్పుడు కట్టిస్తామంటూ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డిపై మహిళలు తిరగబడ్డారని గుర్తుచేశారు. భువనగిరి ఎమ్మెల్యేను ఉరికిచ్చి కొట్టారన్నారు.
ఇందిరమ్మ ఇండ్లు,రేషన్ కార్డుల సర్కస్ ఫీట్లు, లోకల్ బాడీ ఓట్ల కోసం కాంగ్రెస్ పడుతున్న పాట్లు అని ఎద్దేవా చేశారు. ఇది పీపుల్స్ సర్కార్ కాదని, గ్రాఫిక్ సర్కార్ అని విమర్శించారు. అబద్ధాలు చెబుతూ వైకుంఠం చూపిస్తున్నారన్నారు. స్థానిక ఎన్నికల్లో హీరో కావాలని మోసాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ జీరో కాక తప్పదన్నారు. గ్రామసభల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి దేశంలోనే లేరని, మంత్రులు పత్తా లేకుండా పోయారని, ఎమ్మెల్యేలను గ్రామాలకు రానివ్వడం లేదన్నారు. హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరగలేరన్నారు.