ఖలీల్‌వాడి, ఫిబ్రవరి 13 : స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి జీరో వస్తుందని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ నాయకులను గ్రామపొలిమేరల్లోకి రాకుండా తరిమికొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి పోటీ చేసినా వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ విజయాన్ని అడ్డుకోలేరని స్పష్టంచేశారు. రాష్ట్రం లో ఎక్కడికెళ్లినా కారు రావాలి, కేసీఆర్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.
జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. రాష్ట్రంలో కాం గ్రెస్ ప్రభుత్వం రీ సర్వేలు, వాయిదాల పద్ధతి లేకుండా ఏ పథకాన్ని సక్రమంగా అమ లు చేయడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పుడు జరగాల్సింది రీసర్వే కాదని, రీపోలింగ్ అని స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజల సెలక్షన్ కేసీఆరేనని, రేవంత్‌రెడ్డిని ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి ఇద్దరూ ఐరన్లెగ్లేనని, వారెక్కడ కాలు పెడితే అక్కడ కాంగ్రెస్ బుగ్గి పాలై బొగ్గుగా మారుతుందని ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి పాదమహిమతో ఇప్పటికే సగానికిపైగా రాష్ర్టాల్లో కాంగ్రెస్ పత్తా లేకుండా పోయిందన్నారు. ఇటీవల కేరళ వెళ్లిన సందర్భంగా హర్యానాలో కాంగ్రెస్‌ను ఓడించిన ఆప్‌ను ఢిల్లీలో కాంగ్రెస్ ఓడించిందని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి మేధస్సు చూసి కాంగ్రెస్ అధిష్టానమే నివ్వెరపోయిందన్నారు. మహారాష్ట్రలో మూడు ప్రధాన పార్టీలతో కలిసి పోటీ చేసినా కాంగ్రెస్ ఎందు కు ఘోరంగా ఓడిపోయిందో రేవంత్‌రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకుడు రాంకిషన్‌రావు పాల్గొన్నారు.
కేసీఆర్ రాష్ర్టానికి సుస్థిర పాలన అందిస్తే రేవంత్ రాష్ర్టాన్ని కుక్కలు చింపిన విస్తరిగా చేస్తున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి ఉద్దెర బేరగాడని ప్రజలు చెప్పుకుంటున్నారన్నారు. కొర్రీలు, వాయిదాల పద్ధతి లేకుం డా ఏ పథకం అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. గతంలో కేసీఆర్ మాటిస్తే అది అప్పటికప్పుడే అమలయ్యే పరిస్థితి ఉండేదన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం ప్రజలను మోసగించడంలో ఆరితేరిన చెయ్యి అని పేర్కొన్నారు. మహాత్మాగాంధీ పేరు చెప్పి గద్దెనెక్కిన ఈ డూప్లికేట్ గాంధీలు ఇచ్చిన దొంగ హామీలు, వైఫల్యాలను ప్రజలు ఎండగట్టాలని పిలుపునిచ్చారు. దశాబ్దాల పాటు కన్నీటి పాలైన తెలంగాణ బిడ్డలు మళ్లీ అవే కష్టాలు, అవే కన్నీళ్లలో చిక్కుకుని విలవిలలాడుతున్నారని పేర్కొన్నారు. తలకిందులుగా తపస్సు చేసినా రేవంత్‌ను ఇక తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు.
రాహుల్‌గాంధీకి రైఫిల్‌రెడ్డి బాగోతాలన్నీ తెలిసిపోయాయని, అందుకే రేవంత్ మొహం చూడడానికి కూడా ఆయన ఇష్టపడడం లేదన్నారు. సీఎం 32సార్లు ఢిలీక్లి వెళ్లినా రేవంత్‌కు రాహుల్ అపాయింట్మెంట్ దొరకలేదన్నారు. తాజాగా కులగణన రిపోర్టు పట్టుకెళ్లినా రేవంత్‌ను కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. ఆరు హామీలపై ప్రశ్నిస్తారనే భయంతోపాటు రేవంత్ మొహం చూడడం ఇష్టం లేకనే రాహుల్ వరంగల్ పర్యటన రద్దు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. వరంగల్ రైతు డిక్లరేషన్ అమలుచేయకపోవడం, రుణమాఫీ, రైతు భరోసా, పెన్షన్లు, తులం బంగారం, ప్రతి మహిళకూ రూ.2500 వంటి ఆరు ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలుచేయకపోవడంపై ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందనే భయంతో రాహుల్‌గాంధీ తెలంగాణకు రావడానికి జంకుతున్నారని విమర్శించారు. రాహుల్‌గాంధీ తీరును చూసి సీఎంను మార్చడానికే ఇదంతా అని కాంగ్రెస్‌లో గుసగుసలు మొదలైనట్లు తెలిపారు. కాంగ్రెస్‌లో మళ్లీ అదే ముఠాల సంస్కృతి రాజుకుంటున్నదని ఆరోపించారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి నేతలు ఎవరికి వారే గుంపులుగా విడిపోయి ఢిల్లీలో సీఎం పదవి కోసం పైరవీలు చేసుకుంటూ పాలనను గాలికొదిలేశారని జీవన్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.