ఆర్మూర్‌టౌన్, ఏప్రిల్ 7: ఈ నెల 27న వరంగల్ గడ్డపై నిర్వహించనున్న ఓరుగల్లు జన జాతర.. కాంగ్రెస్ పార్టీ దుష్ట పాలనకు పాతర అని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలన దేశానికి దిక్సూచిగా నిలిస్తే కాంగ్రెస్ పాలనలో తెలంగాణ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. వరంగల్ జిల్లాలో నిర్వహించనున్న రజతోత్సవ సభ విజయవంతం చేయడానికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై సోమవారం ఆర్మూర్‌లో ముఖ్య నేతలతో జీవన్‌రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ రజతోత్సవం.. పాతికేండ్ల సమరోత్సాహమని అన్నారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మగౌరవ పతాక, పేదల గొంతుక అని అన్నారు. తెలంగాణ సబ్బండ వర్గాల ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీ 14 ఏండ్ల పోరాటం, పదేండ్ల సంక్షేమ మేళవింపుతో కూడిన బీఆర్ఎస్ ప్రస్థానం చరిత్రలో నిలిచి పోతుందన్నారు. చావు నోట్లు తలపెట్టి, ఢిల్లీని కదిలించి స్వరాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్.. పదేండ్ల పాలనలో తెలంగాణను దేశంలో ముందుంచారన్నారు.
కేసీఆర్ ప్రారంభించిన మిషన్ భగీరథ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, రైతుబంధు పథకం పీఎం కిసాన్ పథకానికి ప్రేరణగా నిలిచిందని చెప్పారు. దేశంలో అత్యంత ఎక్కువగా వరి పండించే రాష్ట్రం గా తెలంగాణను తీర్చిదిద్దారని గుర్తు చేశారు. రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన ఘతన కేసీఆర్‌దేనని తెలిపారు. ఇచ్చిన హామీలే కాదు ఇవ్వని హామీలు కూడా అమలు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద 13 లక్షల పేదింటి ఆడబిడ్డల వివాహాల కోసం రూ.11 వేల కోట్లు ఖర్చు చేశారని చెప్పారు.