ఖలీల్‌వాడి, మే 6 : తెలంగాణను అస్థిరపర్చే కుట్రలో భాగంగానే రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందంటూ సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను ఒక ప్లాన్ ప్రకారమే డ్యామేజ్ చేస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు వచ్చే పెట్టుబడులు అమరావతికి మళ్లించేందుకు చంద్రబాబు రేవంత్ ద్వారా స్కెచ్ వేశారని ఒక ప్రకటనలో ఆరోపించారు. కేసీఆర్ హయాంలో చేసిన అప్పు కేవలం రూ.3.17 లక్షల కోట్లు మాత్రమేనని తెలిపారు. కానీ రూ. 7లక్షల కోట్లు అప్పు చేశారని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. కేసీఆర్ రూ.3.17 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణను పునర్నిర్మించారన్నది జగమెరిగిన సత్యమని పేర్కొన్నారు. కేసీఆర్ ముందుచూపు పాలనతో సంపద పెంచి ప్రజలకు పంచిపెట్టారని, ఇవన్నీ రిజర్వు బ్యాంకు నివేదికలో పొందుపర్చిన అక్షర సత్యాలని తెలిపారు. రూ.30లక్షల కోట్లకు పైగా సంపద సృష్టించిన ఘనత కేసీఆర్ సర్కార్‌కు దక్కుతుందని స్పష్టం చేశారు.
కేసీఆర్ పదేండ్ల పాలనలో గణనీయంగా పెరిగిన తెలంగాణ ఆదాయంతో అన్ని రంగాలు బలోపేతమై, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని తెలిపారు. అదే అధికారులు, అదే యంత్రాంగమని, ప్రభుత్వం మారగానే ఆదాయం ఎందుకు పాతాళంలోకి పడిపోయిందని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో పెరిగిన ఆదాయం, కాంగ్రెస్ సర్కార్ రాగానే ఎందుకు తగ్గిందని నిలదీశారు. అప్పుడు పరుగులు పెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇప్పుడెందుకు పడకేశాయని ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్ చేతకాని పాలనకు పరాకాష్టకాదా ? అని మండిపడ్డారు.
అధికారంలోకి వచ్చిన 16 నెలల కాలంలోనే రూ. లక్ష కోట్లకు పైగా అప్పు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా నిర్మించలేదని తెలిపారు. ఒక్క కొత్త సంక్షేమ పథకం అమలు చేసిన పాపాన పోలేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారని మండిపడ్డారు. ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయడం, విదేశీ వ్యవహారాల్లో సీఎం రేవంత్‌రెడ్డి మునిగి తేలుతున్నారని విమర్శించారు. హెలిక్యాప్టర్ లేకుండా మంత్రులు అడుగుతీసి అడుగువేయడంలేదని పేర్కొన్నారు. అందాల పోటీల పేరుతో కోట్లు తగిలేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల హామీలకు శాశ్వత సమాధి చేశారని పేర్కొన్నారు. అధికారం కోసం ఎన్నికల సమయంలో ఉద్యోగులను ఉసిగొల్పి, ఇప్పుడు కసి తీర్చుకుంటారా అని ప్రశ్నించారు. కేసీఆర్‌తోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, దుష్టకాంగ్రెస్ను తరిమికొట్టడమే ప్రజల కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి మసిపూసి, అప్పును భూతద్దంలో చూపిస్తున్న కాంగ్రెస్ కుట్రలు, కుతంత్రాల పాలన సాగనివ్వబోమని జీవన్‌రెడ్డి హెచ్చరించారు.