మోత్కూరు, జూలై 30 : కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతూ.. కేసీఆర్ పాలనను గుర్తు చేస్తూ ఇంటింటికీ వెళ్లి ప్రజలను చైతన్యవంతులను చేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పాటిమట్ల క్రాస్ రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్లో మోత్కూరు, అడ్డగూడూరు మండలాల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మోత్కూరు మున్సిపాలిటీకి చెందిన పలువురు బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి పార్టీ కండువాలను కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీలో నిబద్ధత గల కార్యకర్తలు ఉన్నారని, వారు క్షేత్రస్థాయిలో వెళ్లలేక పోతున్నారని అన్నారు. సమైక్యాంధ్ర కీలు బొమ్మ రేవంత్‌రెడ్డి ఆడిస్తున్న నాటకాలను అర్థం చేసుకోలేని స్థితిలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నారన్నారు. కన్నెపల్లి పంపుహౌస్ వద్దకు పోయి కాళేశ్వరం మోటార్లు ఆన్ చేస్తే 50 లక్షల ఎకరాలకు నీళ్లు అందించొచ్చన్న సోయి కూడా ఉత్తమ్‌కు లేదన్నారు. రేవంత్‌రెడ్డి కావాలని కాళేశ్వరాన్ని ఉనికిలో లేకుండా చేసి, బనకచర్లకు అనుమతులు వచ్చేలా చేసి ఏపీ సీఎం చంద్రబాబు రుణం తీర్చుకోవడానికి చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలన్నారు. తెలంగాణ రైతులు బాగుంటే ఓర్వలేని ద్రోహులు సీఎం రేవంత్‌రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అని అన్నారు. దమ్ముంటే కాళేశ్వరాన్ని కేసీఆర్‌కు అప్పజెప్పండి నాలుగు రోజుల్లో నీళ్లు ఇచ్చి చెరువులు, రిజర్వాయర్లు నింపి రైతుల కండ్లలో ఆనందాన్ని చూపిస్తామన్నారు.
కార్యకర్తలు ఐక్యంగా పని చేసి మేజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ విజయానికి కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై ప్రజల్లో పెరిగిన అసహనాన్ని బీఆర్ఎస్ అవకాశంగా ఉపయోగించుకోవాలని సూచించారు. అన్ని వర్గాల ప్రజలు, రైతులు కేసీఆర్ పాలనను మళ్లీ కోరుకుంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా కార్యకర్తలు ఆత్మైస్థెర్యం కోల్పోకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో పని చేస్తే జెడ్పీ స్థానంతో పాటు జిల్లాలో మోజార్టీగా సర్పంచులు, ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఒంటెద్దు నర్సింహారెడ్డి, నేవూరి ధర్మేందర్‌రెడ్డి, నార్మాక్స్ డైరెక్టర్ రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పొన్నెబోయిన రమేశ్, కొమ్మిడి ప్రభాక్‌రెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు జంగ శ్రీను, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు చిప్పలపల్లి మహేందర్నాథ్, కొణతం యాకుబ్‌రెడ్డి, అడ్డగూడూరు మాజీ జెడ్పీటీసీ శ్రీరాముల జ్యోతి అయోధ్య, సోషల్ మీడియా మండల కన్వీనర మత్స్యగిరి, నాయకులు కొండ సోంమల్లు, మర్రి అనిల్‌కుమర్, పోన్నాల వెంకటేశ్వర్లు, సత్యంగౌడ్, చేతరాశి వెంకన్న, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
రేవంత్‌రెడ్డి అంటేనే మోసమని, నోరు తెరిస్తే అబద్దాలని ప్రజలకు అర్థమైందని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. ఆచరణకు నోచుకోని హామీలను ఇచ్చి ప్రజలను నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు చేతులెత్తేస్తున్నారని అన్నారు. గెలిచిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమ లు చేస్తామన్న రేవంత్ ప్రభుత్వం 18 నెలల గడుస్తున్నా హామీల అమలు అడ్రస్ లేదన్నారు. కల్యాణలక్ష్మితో పా టు తులంబంగారం, మహిళలకు రూ.2,500 పంపిణీ ఏమైందని ప్రశ్నించారు. ప్రజలు ఇప్పటికైనా కాంగ్రెస్ మోసాలను గమనించి స్థానిక సంస్థల ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని, గులాబీ కార్యకర్తలు సైనికుల్లా పని చేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు.