నిజామాబాద్, జూన్ 25, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా కింద ఇచ్చే పెట్టుబడి సాయాన్ని రూ.15 వేలకు పెంచాలని రైతులు స్పష్టం చేశారు. అది కూడా పంటలు సాగు చేసే సమయాని కన్నా ముందే డబ్బులు ఖాతాల్లో వేయాలని కోరారు. ఇప్పుడు రైతుబంధు ఇస్తున్న తరహాలోనే ఐటీ చెల్లించే రైతులకు, ఉద్యోగులకు సైతం సాయం చేయాలన్నారు. ‘రైతుభరోసా’ విధివిధానాల రూపకల్పనలో నిమగ్నమైన కాంగ్రెస్ ప్రభుత్వం.. పెట్టుబడి సాయంపై రైతుల అభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం రైతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎడపల్లి, మెంట్రాజ్‌పల్లి, ముప్కాల్, ఆర్మూర్, నస్రుల్లాబాద్ రైతు వేదికలలో నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమం ద్వారా ఉమ్మడి జిల్లా రైతులు వీసీలో పాల్గొని తమ అభిప్రాయాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పంట సాగు సమయానికే సాయం చేయాలని చెప్పారు. వానాకాలానికి సంబంధించిన రైతుభరోసాను జూన్ మొదటి వారంలోనే అందివ్వాలని కోరారు. రైతుభరోసా సాయాన్ని 5 ఎకరాల నుంచి 10 ఎకరాల్లోపు సీలింగ్ పెట్టాలని, ఒక కుటుంబంలో అందరికీ కాకుండా ఒకరికే ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పింఛన్‌దారులకు సాయం ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, వాణిజ్య సముదాయాలకు అందుతున్న సాయాన్ని నిలిపి వేయాలని కోరారు. వీటిపై సమగ్రంగా దర్యాప్తు చేసి తగు చర్యలు తీసుకుంటామని, సాగు చేసే రైతులకే పెట్టుబడి సాయం అందించేలా కార్యాచరణను తీసుకుంటామని వ్యవసాయ మంత్రి వెల్లడించారు.
రైతన్న కష్టం వెలకట్టలేనిది. వ్యవసాయ రంగంలో భవిష్యత్తును ముందే ఊహించి రైతన్నలకు మేలు చేయాలనే దృఢ సంకల్పంతో నాటి సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన భారీ మార్పులు ఎంతో ఉపకరించాయి. ఇందులో ప్రధానంగా ఆర్థిక చేయూత, కల్పించిన ప్రయోజనాలు రైతు కుటుంబాల్లో జీవన భరోసాను నింపాయి. ఈ చర్యలు దేశంలోనే తెలంగాణకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. రాష్ట్రంలో సన్నకారు, చిన్నకారు రైతులు ఉన్నారు. అందులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులే ఎక్కువ. ఉమ్మడి రాష్ట్రంలోని ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యం, వైఫల్యాల నేపథ్యంలో కుదేలైన వ్యవసాయ రంగానికి కేసీఆర్ పూర్వవైభవం తీసుకొచ్చారు. అయితే, కాంగ్రెస్ మాత్రం రైతు భరోసా పేరిట రూ.15 వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు తాత్సారం చేయడమే కాకుండా ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నది. రైతులను నట్టేట ముంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. విధివిధానాల పేరిట కాలయాపన చేయడంపై రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.
రైతులకు సాయం చేసే విషయంలో కేసీఆర్ సర్కారు ఎలాంటి కొర్రీలు పెట్టలేదు. గుంట నుంచి మొదలు ఎంత భూమి ఉన్నా వారికి పెట్టుబడి సాయాన్ని అందించింది. ఎకరానికి ఏటా రూ.10 వేలు చొప్పున పెట్టుబడి సాయం అందించారు. దుక్కి దున్నే కాలానికి రైతుల ఖాతాల్లో డ బ్బు జమ చేశారు. అయితే, ఎకరానికి ఏటా రూ.15 వేలు చొప్పున సాయం చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాట మార్చింది. రైతుభరోసా పథకంలో కోతలు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అందుకోసమే విధివిధానాల రూపకల్పన చేస్తున్నదని, అందులో భాగంగానే రైతుల అభిప్రాయాలను సేకరిస్తున్నదన్న భావన వ్యక్తమవుతున్నది.
గతంలో పంటల సాగుకు ముందే అందిన ‘రైతుబంధు’ ఈసారి చాలా ఆలస్యమైంది. వానాకాలం సీజన్ ఆరంభమై నెల దగ్గరికొచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదు. డిసెంబర్ 7న రాష్ట్రంలో కొత్త సర్కారు కొలువుదీరిన తర్వాత పెట్టుబడి సాయానికి గ్రహణం పట్టుకున్నట్లయింది. కాంగ్రెస్ పరిపాలన మొదలు పెట్టిన తర్వాత రెండో సీజన్ ముంచుకొస్తున్నప్పటికీ ఇంత వరకూ పెట్టుబడి సాయం ఊసే ఎత్తడం లేదు. రైతుబంధు స్థానంలో రైతుభరోసా తీసుకొస్తామని, పెట్టుబడి సాయం కింద రూ.15 వేలు ఇస్తామని ఎన్నికల ముందర కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే, అధికారం చేపట్టిన తర్వాత ‘రైతుబంధు’పై ఆంక్షలు విధించేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఆర్నెళ్ల పాలనలో ఇంకా విధివిధానాల ఖరారుపైనే ప్రభుత్వం తచ్చాడుతున్నది.
ఎడపల్లి, జూన్ 25: పది ఎకరాల్లోపు భూములు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా అందించాలి. పడీత్ భూములు, రాళ్లు, రప్పలు, గుట్టలు కలిగిన భూములకు పెట్టుబడి సాయం అందించొద్దు.
రైతుబంధు పథకం 2018 మే 10న మొదలైంది. నాటి నుంచి కేసీఆర్ ప్రభుత్వం చివరగా 2023 వానాకాలం వరకు 11 విడుతల్లో రైతుబంధు సాయాన్ని అందించింది. ఒక్కో సీజన్‌కు ఉమ్మడి జిల్లాలోని సుమారుగా ఐదున్నర లక్షల మంది రైతులకు రూ.500 కోట్ల వ్యయాన్ని ప్రభుత్వం భరించింది. ఉదాహరణకు 2023 వానాకాలం సీజన్లోనే నిజామాబాద్ జిల్లాలో 2,60,617 మంది రైతులకు రూ.265 కోట్లు అందించారు. కామారెడ్డి జిల్లాలో 2,79,352 మందికి రూ.252.76 కోట్ల సాయాన్ని పంపిణీ చేశారు. కేవలం ఒక వానాకాలం సీజన్‌కు ఉభయ జిల్లాల్లోని 5.39 లక్షల మంది రైతులకు దాదాపుగా రూ.517 కోట్లను కేసీఆర్ ప్రభుత్వం అందించింది. కానీ ఇప్పుడు రెండు పంట కాలాలు పోయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం లేకుండా పోయింది. రైతుభరోసా పేరిట ఎకరానికి రూ.15వేలు అందాల్సి ఉండగా అరకొరగానే పంపిణీ జరిగినట్లుగా రైతులు వాపోతున్నారు. భవిష్యత్తులోనూ విధివిధానాల ఖరారు తర్వాత ఎవరెవరికి వస్తుందో తేలుతుంది.
రెంజల్, జూన్ 25:వరినాట్లు పూర్తి కావొస్తున్నా.. కాంగ్రెస్ ప్రభు త్వం రైతుభరోసాపై తాత్సారం చేస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఈపాటికే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయినట్లు ఫోన్లకు టింగ్.. టింగ్ మంటూ మెస్సేజ్‌లు వచ్చేవి. వచ్చిన డబ్బులు ఎరువులు, విత్తనాలు, కూలీలకు ఇచ్చేందుకు ఉపయోగపడేవి. రైతుభరోసా కింద పెట్టుబడి సాయం వస్తదో లేదోనని రైతులు ఆందోళనచెందుతున్నరు. పంట పెట్టుబడికి రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి తెస్తున్నది.
బోధన్ రూరల్, జూన్ 25: బీఆర్ఎస్ హయాంలో ‘రైతుబంధు’ సకాలంలో అందించింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పథకాల పేర్లు మార్చి, వివిధ రకాల కొర్రీలు పెడుతున్నది. రైతుభరోసా సకాలంలో అందించపోగా, అందిస్తారో లేదో అర్థం కాని పరిస్థితి దాపురించింది. గతంలో సకాలంలో ‘రైతుబంధు’ డబ్బులు అందడంతో పంట పెట్టుబడికి చాలా ఉపయోగపడేది. ప్రస్తుతం నాట్లు వేసినా ఇప్పటి వరకూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు డబ్బులు వేయలేదు. వివిధ రకాల ఆంక్షలు పెడుతూ.. దీన్ని రద్దు చేసే యోచనలో కనిపిస్తున్నది. రైతులు మరోమారు పంట పెట్టుబడికి వడ్డీవ్యాపారులను ఆశ్రయించే పరిస్థితి ఏర్పడుతున్నది.
నవీపేట, జూన్ 25: సాధ్యం కాని గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కారు రైతులను నట్టేట ముంచింది. రైతుభరోసా కింద ఎకరానికి రూ.15వేలు ఇస్తమని చెప్పి రెండు పంటకాలాలు అవుతున్నా ఇవ్వలేదు. బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు పథకం కింద ఎకరానికి వచ్చిన రూ.10వేలతో సంతోషంగా పంటలు పండించుకున్నాం. ప్రస్తుతం వరినాట్లు ప్రారంభమైన ఇప్పటి వరకు రైతుభరోసా వేయకపోవడం.. రైతులపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమ ఏంటో తెలుస్తున్నది. రైతుల అభిప్రాయాలను తెలుసుకొని పంట పెట్టుబడి విడుదల చేస్తామని ప్రకటించడం అసమర్ధ పాలనకు అద్దం పడుతున్నది.