Nizamabad | పోతంగల్ నవంబర్ 13: ఇసుక టిప్పర్ల అడ్డగింతపై అధికారులు మాపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని, ఇసుక అక్రమ రవాణా జరిగినట్లు ఆధారాలు ఉన్నాయని బాధితులు ఆరోపించారు. పోతంగల్ మండల కేంద్రంలో ఇసుక టిప్పర్ల అడ్డగింతపై కేసు నమోదు అయిన బాధితులు గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
కోడిచర్ల మంజీర శివారులో ఇసుక మేటలు తొలగించడానికి అనుమతి పొందిన వ్యవసాయ భూమిలో కొద్దీ రోజుల్లోనే ఇసుక పూర్తిగా తొలగింపు జరిగిందని, అక్కడ ఇసుక లేకపోవడంతో అదే శివారులో గల ప్రభుత్వ భూమి నుండి ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలించి అనుమతి పొందిన వ్యవసాయ భూమిలో డంపు వేసి అక్రమంగా ఇసుకను తరలించారని ఆరోపించారు. ఇసుక రవాణా వల్ల అక్కడ ఉన్న వ్యవసాయ భూములు సాగుకు పనికి రాకుండా పోతాయన్న నేపథ్యంలో టిప్పర్లను అడ్డుకున్నట్లు తెలిపారు.
ఇసుక టిప్పర్లు అడ్డగించిన సమయంలో వీధుల్లో లేని జూనియర్ అసిస్టెంట్ తో తమపై కేసులు ఎలా పెట్టిస్తారని ప్రశ్నించారు. తమ పై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని, లేకుంటే అవినీతికి పాల్పడుతున్న అధికారుల మీద ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని, ఈ విషయం పై రాష్ట్ర స్థాయిలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.