Pothamgal | పోతంగల్, జనవరి 31 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడం మూర్ఖత్వమని బీఆర్ఎస్ మండల నాయకుడు ఎంఏ హకీం మండిపడ్డారు. పోతంగల్ మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రచురించిన క్యాలెండర్, డైరీని ఆయన ఆధ్వర్యంలో నాయకులు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయలేక కక్ష సాధింపులతో కాలాన్ని గడుపుతోందని ఆరోపించారు. కేసీఆర్కు నోటీసులు ఇవ్వడమంటే కోట్లాది తెలంగాణ ప్రజల గుండెలను గాయపరిచినట్లేనని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నవీన్ అన్నారు.
ఇలాంటి నోటీసులతో కేసీఆర్ను ఏమీ చేయలేరని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ ప్రజల దృష్టి మళ్లిస్తున్నారన్నారు. యాసంగి పంటకు వెంటనే రైతు భరోసా డబ్బులు ఇవ్వాలని, వర్షాకాలంలో వర్షాలు పడి నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అరిఫ్, ఎజాజ్,సాయిలు, సాయినాథ్, సద్దాం, ప్రవీణ్, ఇబ్రాహీం, తదితరులు పాల్గొన్నారు.