లింగంపేట/ మాచారెడ్డి, మార్చి 13: పచ్చని పంట పొలాలతో కళకళలాడాల్సిన పల్లెలు.. నేడు వెలవెలబోతున్నాయి. భూగర్భ జలాలు అడగుంటిపోతుండడంతో పంట యాసంగి పంటలకు సాగునీరు అందడం లేదు. భూమిని నమ్ముకొని కోటి ఆశలతో అప్పులు చేసి సాగు చేసిన పంటలు కళ్లముందే ఎండిపోతున్నయి. సాగునీరందక పంటలు ఎండుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.‘వానకాలం’తో సమానంగా యాసంగిలోనూ పంటలు సాగుచేస్తున్నారు.
కొన్నిరోజులుగా ఎండలు మండిపోతుండడంతో భూగర్భ జలాలు అడుగంటి పోతూ రైతు నుంచి కంటనీరు తెప్పిస్తున్నాయి. కొందరు రైతులు ఎండిన పంటలను పశువులకు మేతగా వదిలేస్తున్నారు. లింగంపేట మండలంలోని ఒంటర్పల్లి గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో వరి పంట ఎండిపోతున్నది. ఒంటర్పల్లి గ్రామంలోని రమావత్ చాందీరాం అనే రైతుకు చెందిన ఐదెకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఐదెకరాల్లో వరి పంట సాగుచేయగా.. వేసిన రెండు బోర్లు వట్టిపోయాయి.
పొట్టదశలో ఉన్న పంట కండ్ల ముందే ఎండిపోవడంతో రైతు తీవ్ర మనోవేదనకు గురువుతున్నాడు. చేతికి అంది వచ్చిన పంటను కాపాడుకోవడానికి రెండు బోర్లు వేసినా నీటి జాడ కనిపించకపోవడంతో రైతు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పరిసరాల్లోని బోరు బావుల్లో సైతం నీరు తగ్గిపోవడంతో వారు సాగునీరు ఇవ్వడానికి నిరాకరిస్తున్నట్లు చాందీరాం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పంట పెట్టుబడి చేతికి వస్తుందన్న ఆశలు అడియాశలు అవుతున్నాయి. ప్రభుత్వం స్పందించి పంట నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నాడు.
పక్క చిత్రంలోని రైతు పేరు పెనుగొండ వినోద్. స్వగ్రామం మాచారెడ్డి మండలం ఎల్లంపేట. గ్రామంలో ఆయనకు ఉన్న ఆరు ఎకరాల్లో వరి వేశాడు. అప్పటికే ఉన్న బోరు వట్టిపోవడంతో ఎలాగైనా పంటను కాపాడుకోవడానికి రూ. లక్ష ఖర్చు చేసి రెండు బోర్లు వేయించాడు. కానీ చుక్క నీరూ రాలేదు. దీంతో సాగునీరందక పంట పూర్తిగా ఎండిపోయింది. ఇక చేసేదేమీలేక ఎండిన పొలంలోకి మేత కోసం పశువులను వదిలాడు. ఇలాంటి పరిస్థితి వినోద్ అనే ఒక్క రైతుదే కాదు. మండలంలోని చాలా మంది రైతులు ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు. సర్కారు స్పందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
గ్రామానికి చెందిన రైతు వద్ద ఐదెకరాల పొలం కౌలుకు తీసుకున్న. యాసంగిలో వరి పంట సాగు చేస్తున్న. ఐదు ఎకరాల్లో ఉన్న రెండు బోర్లలో నీళ్లు ఎండిపోయినయ్. గింజ పాలు తాగుతున్నది. ఇప్పుడు నీరు మంచిగా ఉంటే గింజ గట్టి పడుతుంది. గింజ గట్టి పడే టైంలా నీళ్లు లేకుండా పోయినయ్. పక్కన పొలం వాళ్లను నీళ్లడిగితే ఇయ్యమన్నరు. రెండు వందల ఫీట్లు ఒకటి, మూడు వందల ఫీట్లు ఒకటి రెండు బోర్లు వేసినా చుక్కనీరూ రాలేదు. పంట పెట్టుబడికి రూ. 80వేల దాకా పెట్టిన. పెట్టుబడి వచ్చేటట్లు లేదు. కౌలు డబ్బులు ఎట్లా కట్టాల్నో తెలుస్తలేదు.
– రమావత్ చాందీరాం, రైతు, ఒంటర్పల్లి, లింగంపేట మండలం