Lions Club | కంటేశ్వర్, సెప్టెంబర్ 17 : నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) రామారావును లయన్స్ క్లబ్ ఆఫ్ ఫోర్ట్ సిటీ నిజామాబాద్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. ఇంజనీర్స్ డేను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్టలోగల ఎస్ఈ కార్యాలయంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఫోర్ట్ సిటీ నిజామాబాద్ ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా ఇరిగేషన్ ఎస్ఈ రామారావు మాట్లాడుతూ నిర్మాణ కట్టడాలు కాస్తా వారసత్వ సంపదలుగా, కళాఖండాలుగా మారయంటే అందులో ఇంజనీర్ల వృత్తి నైపుణ్యం, ప్రతిభ పాటవాలు ఉన్నాయని కితాబు ఇచ్చారు.
ఇంజనీర్లుగా పని చేయడం, జీవితంలో తమకు దక్కిన అదృష్టంగా భావిస్తామన్నారు. టీఎన్జీఓ రాష్ట్ర ఉపాధ్యక్షులు గైని గంగారం మాట్లాడుతూ…ఇంజనీర్ల కృషితోనే నీటిపారుదల రంగం అభివృద్ధి చెంది, రైతాంగానికి మేలు చేకూరుతుందని చెప్పారు. ఎన్నో గొప్ప కట్టడాలు కట్టిన చరిత్రకారులు ఇంజనీర్లని కొనియాడారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఫోర్ట్ సిటీ నిజామాబాద్ ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ఇంజనీర్ల దూర దృష్టి నిర్మాణాల వల్లనే, సమాజానికి మేలు చేకూరుతుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో శాఖ డిప్యూటీ ఎస్ఈ శ్రీనివాస్, క్వాలిటీ కంట్రోల్ ఈఈ ఖీమ్యా నాయక్, డీఈఈ పావని, ఏఈఈలు పూజిత నంద, జయప్రద, శ్రావణి, రాజ్యలక్ష్మి, సాయినాథ్, టీఎన్జీఓ రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కెంపుల నాగరాజు, లయన్స్ క్లబ్ ఆఫ్ ఫోర్ట్ సిటీ నిజామాబాద్ అధ్యక్షులు అట్లూరి ఠాగూర్, ఇరిగేషన్ సిబ్బంది పాల్గొన్నారు.