హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): ‘దేశాభివృద్ధిలో మహిళలు భాగస్వాములుగా మాత్రమే ఉండవద్దు.. మార్పుకు నాయకత్వం వహించాలి.. ఉద్యోగార్థులుగా కాదు.. ఉద్యోగ సృష్టికర్తలుగా మారాలి’ అని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. శనివారం ఢిల్లీలో యువర్ స్టోరీ వ్యవస్థాపకురాలు శ్రద్ధాశర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘షీ స్పార్క్స్-2026’ కార్యక్రమానికి శనివారం ఆమె హాజరయ్యారు.
ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో ముందంజలో ఉన్న మహిళా నేతలను ఒకే వేదికపై తీసుకొచ్చిన యువర్ స్టోరీ జాతీయ మీడియా సంస్థ బాధ్యులను ఆమె అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణలో సెర్ప్ ద్వారా 46 లక్షలకుపైగా మహిళలు స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడి సామాజిక, ఆర్థిక మార్పుల్లో కీలకభూమిక పోషిస్తున్నారని తెలిపారు. మహిళలు ఆర్థిక బలోపేతంతోనే కుటుంబాలు బాగుపడుతాయని అభిప్రాయపడ్డారు.