హైదరాబాద్ సిటీబ్యూరో/పోచారం, మార్చి 14(నమస్తే తెలంగాణ): ‘తనకు గిట్టని యువకుడిని తన కూతురు ప్రేమించిందని ఆమె తండ్రి కసి పెంచుకుంటాడు. ఆ యువకుడిపై కోపంతో ఆ ప్రేమ జంటకు ఆనందం లేకుండా చేయాలని భావిస్తాడు. ఆ ఇద్దరికీ పెళ్లి చేస్తానని కూతురితో నమ్మబలికి ఏకంగా తన చేతులతోనే కూతురికి హెచ్ఐవీ ఉన్న ఇంజెక్షన్ ఇచ్చి రోగిగా మారుస్తాడు’ ఇదీ ఇటీవల వచ్చిన ఓ సినిమాలోని సంక్షిప్త సారాంశం. సరిగ్గా దీనిని పోలిన అమానుష ఘటనే మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పోచారంలో తాజాగా చోటుచేసుకున్నది. పోచారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆర్జీకేలో నివాసం ఉంటున్న మనోహర్ (25), అతనికి సమీప బంధువైన యువతి (24) ఒకే చోట నివాసం ఉంటున్నారు. మనోహర్‌కు తన కూతురును ఇచ్చి వివాహం జరిపించాలని ఆ యువతి తండ్రి ఇటీవల నిర్ణయించుకున్నాడు. కొన్నిరోజుల్లోనే పెళ్లి ముహూర్తం ఉండగా, ఇరు కుటుంబాలు ఏర్పాట్లలో మునిగిపోయారు. ఈ సమయంలో పిడుగులాంటి వార్త వారికి చేరింది. మనోహర్ తల్లిదండ్రులు హెచ్ఐవీతో బాధపడుతున్నారన్న అనుమానం ఆ యువతి తం డ్రికి కలిగింది. వెంటనే మనోహర్‌కు కూడా ఉప్పల్‌లోని ఓ దవాఖానలో హెచ్ఐవీ పరీక్ష చేయించాడు. దీంతో ఫలితం పాజిటివ్‌గా రావడంతో ఆ పెళ్లిని రద్దుచేసుకున్నారు.
ఉన్మాదిలా మారిన యువకుడు
తనకు దక్కని ఆ యువతి మరెవరికీ దక్కకూడదని భావించిన మనోహర్ ఉన్మాదిలా మారిపోయాడు. పక్కా ప్రణాళిక ప్రకారం ఈ నెల 11న ఆ యువతి తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో వారింటికే వెళ్లి ఎరుపు రంగుతో ఉన్న ఇంజెక్షన్‌ను బలవంతంగా ఎక్కించాడు. అనంతరం యువతికి జ్వరం, ఒళ్లు నొప్పులు రావడంతో ఆ యువతిని ఆమె తండ్రి ఉప్పల్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లాడు. ఇదే సమయంలో మనోహర్‌ను యువతి తండ్రి, స్థానికులు, పోలీసులు సహా నిలదీయగా హెచ్ఐవీ ఇంజెక్షన్ ఇచ్చానని ఒప్పుకొన్నాడు. ఈ ఘటనపై బాధిత యువతి తండ్రి పోచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొన్ని పోలీసులు మనోహర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రక్తాన్ని ఎక్కడి నుంచి సేకరించాడు.. ఇది అతని రక్తమా? లేదా? వేరేవరిదైనా తీసుకొచ్చాడా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.