హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): ద్రోణి ప్రభావంతో రాష్ర్టానికి వారంపాటు వడగండ్ల వాన ముప్పు పొంచి ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఈనెల 16 నుంచి 23 వరకు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. ఆది, సోమవారాల్లో కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో అకాల వర్షాలు పడతాయని తెలిపింది. రానున్న నాలుగైదు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు తగ్గే అవకాశాలున్నాయని పేర్కొన్నది.
వరుస వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా పశువులు, పంట ఉత్పత్తులు, వ్యవసాయ పరికరాలు సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని పేర్కొన్నది. ఇదిలా ఉండగా, వారంపాటు వడగండ్ల వానలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలతో మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈదురుగాలులతో కూడిన వానలకు మామిడి కాయలు రాలిపోయే ప్రమాదమున్నదని వాపోతున్నారు. ఇంతకాలం కాపాడుకున్న పంట నేలపాలై తీవ్ర నష్టం సంభవిస్తుందేమోనని మదనపడుతున్నారు. అకాల వర్షాలతో పొట్టదశలో ఉన్న వరిలో తెగుళ్ల ఉధృతి పెరిగే అవకాశం ఉంటుందని అన్నదాతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.