యాదాద్రి భువనగిరి, మార్చి 14 (నమస్తే తెలంగాణ) : ఆరుగాలం కష్టించి పనిచేసే అన్నదాతకు గడ్డు కాలం దాపురించింది. సాగు నీటి కష్టాలు తప్పడం లేదు. రోజురోజుకు భూగర్భ జలాలు పడిపోతున్నాయి. విద్యుత్ కోతలు మామూలే. పొట్ట దశలో ఉన్న పొలాలకు నీళ్లు సరిపోవడంలేదు. ఫలితంగా అనేక చోట్ల పంట పొలాలు ఎండిపోతున్నాయి. గతంలో ఎండాకాలంలోనూ జలకళను సంతరించుకునేవి. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. నీళ్లు లేక చెరువులు ఎండిపోతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 800 వరకు చెరువులు ఉన్నాయి. మూసీ పరీవాహక ప్రాంతాలైన భూదాన్ పోచంపల్లి, వలిగొండ, బీబీనగర్, రామన్నపేట చెరువుల్లో పరిస్థితి బాగానే ఉందని అధికారులు చెబుతున్నారు.
రోజురోజుకు నీటి నిల్వలు పడిపోతున్నాయి. ఫిబ్రవరిలో జిల్లా సగటు 6.49 మీటర్లుగా నమోదైంది. జనవరితో పోలిస్తే ఒక మీటరు కిందకు పడిపోయింది. నారాయణపురంలో అత్యధికంగా 10మీటర్ల లోతులో నీళ్లున్నాయి. ఆత్మకూరు (ఎం)లో 9.87, రామన్నపేటలో 8.58, బొమ్మలరామారంలో 8.58, తుర్కపల్లిలో 8.14, రాజాపేటలో 7.42, యాదగిరిగుట్టలో 7.19 మీటర్ల కింద నీళ్లు ఇంకిపోవడంతో నీటి మట్టం పడిపోయింది.
వ్యవసాయానికి 24గంటల విద్యుత్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్న సర్కార్.. సరఫరాలో భారీ కోతలు విధిస్తున్నది. కనీసం 12 నుంచి 14 గంటలూ సరఫరా చేయడం లేదు. తెల్లవారు జామున 4 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే కరెంట్ అందుతున్నది. ఇందులో మధ్యలో కోతలు విధిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు, స్టార్టర్లు కాలిపోతుండటంతో అదనపు భారం తప్పడంలేదు. జిల్లాలో అధిక శాతం మంది వరే సాగు చేశారు. అన్ని చోట్లా వరి పొట్ట దశకు వచ్చింది. ఈ సమయంలో సరిపడా నీరు అవసరం. చెరువులు ఎండిపోవడం, భూగర్భజలాలు ఇంకిపోవడం, బోర్లు వట్టిపోవడం, కరెంట్ కోతలతో నీరు దొరకడం కష్టమవుతున్నది. రాజాపేట, ఆత్మకూరు, రామన్నపేట, మోత్కూ రు తదితర మండలాల్లోని పొలాలు ఎండిపోయాయి. చేసేదేమీ లేక రైతులు పొలాల్లో బర్రెలు, గొర్రెలు మేపుతున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో పలు మండలాలకు కాళేశ్వరం జలాలే జీవం పోయనున్నాయి. ఆ దిశగా కాంగ్రెస్ సర్కార్ చర్యలు తీసుకోవడంలేదు. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి జిల్లాలోకి కాళేశ్వరం జలాలు వస్తాయి. ఈ సీజన్లో ఇప్పటికే తుర్కపల్లి మండలంలోని చెరువులు కాళేశ్వరం జలాలతో కళకళలాడుతున్నాయి. గతంలో తుర్కపల్లి మండల నుంచి భువనగిరి మండలంతోపాటు, బీబీనగర్‌లోని పలు గ్రామాల్లోకి కాళేశ్వరం జలాలు వచ్చేవి. ఈ ఏడాది తుర్కపల్లి మండలంలోని పలు గ్రామాలకు మాత్రమే నెలపాటు గోదావరి జలాలు వదిలారు. ఇక్కడి నుంచి బొమ్మలరామారం మీదుగా బీబీనగర్, భువనగిరి మండలాల్లో ని పలు గ్రామాలకు నీటిని తరలించే అవకాశం ఉంది. బిక్కేరు వాగు పరీవాహకంలో నీటి కష్టాలు తప్పడంలేదు. గంధమల్ల రిజర్వాయర్ నుంచి కాళేశ్వరం జలాల విడుదలతో బిక్కేరు వాగు ప్రవహిస్తోంది. ఇది కొలనుపాక నుంచి మోత్కూరు మీదుగా అడ్డగూడూరు మండలానికి చేరుకుంటుంది. బిక్కేరు నుంచి జలాలను వదిలితే చెరువులు, చెక్ డ్యామ్‌లు జలకళను సంతరించుకుంటాయి. దీంతో భూగర్భ జలాలు పెరిగి, బోర్లు పోసే అవకాశం ఉంటుందని రైతులు చెబుతున్నారు.
గుండాల, మార్చి 14: మండలంలోని పలు గ్రామాల్లో పొట్టకొచ్చిన వరి చేలు నీరు లేక నెర్రెలుబారి ఎండిపోతున్నాయి. చెరువులు, కుంటల్లో నీరు లేక భూగర్భ జలాలు పడిపోవడంతో నీరందక వరి పంట ఎండిపోతున్నది. వరి పంట పాలు పోసుకునే దశలో నీరు అధికంగా అవసరం. బోర్లు, బావుల్లో నీరు లేకపోవడంతో రైతులు వరుస తడులపై పంటలకు నీరందిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో వరుస తడులకు నీరందక పంటలను పూర్తిగా గొర్రెల మేతకు వదిలేస్తున్నారు. గుండాల మండలంలోని బిక్కేరు వాగు ప్రాంత రైతులు తమ పొలాలు కాపాడుకునేందుకు రాత్రి, పగలు తేడా లేకుండా శ్రమిస్తున్నారు. వోల్టేజీతో పాటు మధ్యలో కరెంట్ ట్రిప్ అవడం తదితర సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు చెబుతున్నారు.
జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలంలోని నవాబ్‌పేట రిజర్వాయర్ నుంచి దేవాదుల కాల్వల ద్వారా గుండాల మండలానికి సాగునీరు అందిస్తే తప్ప పంటలను రక్షించుకునేందుకు వేరే మార్గం లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 4 దఫాలుగా సాగునీరు అందించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూశారని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. నేటి ప్రభుత్వం సాగునీరు అందిస్తామని చెప్పడమే తప్ప విడుదల చేయడం లేదని వాపోతున్నారు. నవాబ్‌పేట రిజర్వాయర్ ద్వారా సాగునీటిని పూర్తి స్థాయిలో విడుదల చేస్తే మండలంలోని చెరువులు, కుంటలు నిండి సాగుకు ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుందంటున్నారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి పెట్టకపోవడంతో జనగామ జిల్లా దేవరుప్పుల, పాలకుర్తి ప్రాంతాలకు అక్కడి ప్రజాప్రతినిధులు నీటిని వాటాకు మించి తరలించుకు పోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నవాబ్‌పేట రిజర్వాయర్ ద్వారా పూర్తి స్ధాయిలో నీటిని విడుదల చేసి గుండాల మండలానికి సాగునీరు అందించాలని వేడుకుంటున్నారు. తుర్కలశాపూరం గ్రామంలో కమ్మంపాటి సోమ సాయిలుకు చెందిన వరి చేలో శుక్రవారం గొర్రెలను మేతకు వదిలారు. సోమసాయిలు తన 2.5 ఎకరాల పొలంలో వరి సాగు చేశాడు. ఇటీవల భూగర్భ జలాలు పడిపోవడం, ఎండల తీవ్రత పెరగడంతో 2.5 ఎకరాలచేనుకు నీరందక పోవడంతో వరి చేనును గొర్రెలకు మేతగా వదిలేశాడు. నవాబ్‌పేట రిజర్వాయర్ ద్వారా గుండాల మండలానికి సాగునీటిని విడుదల చేయాలని రైతులు వేడుకుంటున్నారు.
నల్లగొండ రూరల్,మార్చి 14 : నల్లగొండ మండలంలోని బుద్ధారం గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో పలువురి రైతుల పంటలు పొట్ట దశలో ఎండిపోయే పరిస్థితి నెలకొంది. భూగర్భ జాలలు అడుగంటి, గత పది రోజులుగా బోర్లు ఎండిపోవడంతో రైతులు పొలాలను కాపాకునేందుకు ట్యాంకర్ల సాయంతో నీరందిస్తున్నారు. బుద్ధారం గ్రామానికి చెందిన రైతు తుమ్మల లింగస్వామి తన ఎకరంన్నర పొలంలో వరి నాటు పెట్టాడు. ప్రస్తుతం పొట్ట దశకు చేరుకునే సమయంలో బోర్లు ఎండిపోవడంతో ట్యాంకర్‌తో నీరందిస్తున్నాడు.
అదే విధంగా రైతులు చిలుకల పరమేష్, ఉదయ్ సైతం 10 ట్యాంకర్ల నీటిని తమ పొలాలకు పోశారు. ప్రభుత్వం బ్రాహ్మణ వెల్లెంల ద్వారా చెరువులు నింపుతున్నామని చెబుతున్నప్పటీకీ పూర్తి స్థాయిలో కాల్వ నిర్మాణాలు చేపట్టకపోడంతో భూగర్భ జాలలు అడుగంటి, బోర్లు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్త చేస్తున్నారు. మరో 10 రోజుల్లో బుద్ధారంలో 100 ఎకరాల్లో పూర్తిగా పంటలు ఎండిపోయే ప్రమాద ఉందని వారు పేర్కొన్నారు.
నల్లగొండ రూరల్,మార్చి 14 : నల్లగొండ మండలంలోని బుద్ధారం గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో పలువురి రైతుల పంటలు పొట్ట దశలో ఎండిపోయే పరిస్థితి నెలకొంది. భూగర్భ జాలలు అడుగంటి, గత పది రోజులుగా బోర్లు ఎండిపోవడంతో రైతులు పొలాలను కాపాకునేందుకు ట్యాంకర్ల సాయంతో నీరందిస్తున్నారు. బుద్ధారం గ్రామానికి చెందిన రైతు తుమ్మల లింగస్వామి తన ఎకరంన్నర పొలంలో వరి నాటు పెట్టాడు.
ప్రస్తుతం పొట్ట దశకు చేరుకునే సమయంలో బోర్లు ఎండిపోవడంతో ట్యాంకర్‌తో నీరందిస్తున్నాడు. అదే విధంగా రైతులు చిలుకల పరమేష్, ఉదయ్ సైతం 10 ట్యాంకర్ల నీటిని తమ పొలాలకు పోశారు. ప్రభుత్వం బ్రాహ్మణ వెల్లెంల ద్వారా చెరువులు నింపుతున్నామని చెబుతున్నప్పటీకీ పూర్తి స్థాయిలో కాల్వ నిర్మాణాలు చేపట్టకపోడంతో భూగర్భ జాలలు అడుగంటి, బోర్లు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్త చేస్తున్నారు. మరో 10 రోజుల్లో బుద్ధారంలో 100 ఎకరాల్లో పూర్తిగా పంటలు ఎండిపోయే ప్రమాద ఉందని వారు పేర్కొన్నారు.

ఈఫొటో ఆత్మకూరు (ఎం) మండలంలో బిక్కేరు వాగువద్ద నిర్మించిన చెక్ డ్యామ్. ముందు చూపుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించారు. ప్రస్తుతం చుక్క నీరు లేదు. ఇలా మండలంలో ఉన్న మొత్తం నాలుగు చెక్ డ్యామ్‌లు ఎండిపోయాయి. బిక్కేరు వాగు నుంచి కాళేశ్వరం జలాలు వదిలితే తప్ప పంటలు బతికే పరిస్థితి లేదు. గతంలో బిక్కేరు ద్వారా జలాలు వదిలినా ఈ సారి మాత్రం కనీసం పట్టించుకున్న నాథుడే కరువయ్యారు

పంట ఎండిపోయి.. జీవాలు మేత మేస్తున్న ఈ ఫొటో రాజాపేట మండలంలోని పాముకుంట గ్రామానికి చెందినది. రంగ వెంకటేశ్ అనే రైతు మూడున్నర ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేశారు. 60 వేల వరకు పెట్టుబడి పెట్టారు. కానీ ఊరి శివారులో ఉన్న చెరువుల్లో నీళ్లు లేక ఎండిపోయాయి. భూగర్భ జలాలు ఇంకిపోయాయి. ఫలితంగా ఉన్న ఒక్క బోరు ఒట్టిపోయింది. సాగు నీరు అందక పొట్ట దశలో ఉన్న వరి చేను ఇప్పటికే సగం ఎండిపోయింది.
ఆరు ఎకరాల వరి సాగు చేశాం. ఇప్పటికే రెండు ఎకరాలు ఎండిపోయింది. కరెంట్‌తోనే పంటలు ఎండిపోయాయి. పేదోళ్లం ఎట్ల బతకాలి. మా ఆయనకు చేతకాదు. నేను ముసల్దాన్ని. రైతులను ఎవరూ ఆదుకోవడంలేదు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి. ఇస్తేనే మేం బాగుపడతం. లేకుంటే మందేసుకొని సచ్చే కాలం వచ్చింది.
– కంకల సుభద్ర, రైతు, సిరిపురం, రామన్నపేట