హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం గత నెల 10వ తేదీన ఆర్బీఐ నుంచి రూ.9 వేల కోట్ల రుణం సేకరించింది. యాసంగి రైతుభరోసా వేయడానికేనంటూ అనుకూల మీడియా ద్వారా ఊదరగొట్టింది. ఇప్పటికీ నెల గడిచిపోయింది. కానీ రైతుల ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా వేయలేదు? మరి ఆ రూ.9వేల కోట్లు ఏమైనట్టు? తెచ్చిన డబ్బులను రైతులకు ఇవ్వకుండా ఎవరికి ఇచ్చింది? అన్నదాతలకు మొండిచేయి చూపించి వ్యాపారవేత్తలకు మేలు చేసిందా? తద్వారా ప్రభుత్వ పెద్దలు కమీషన్ల రూపంలో రూ.వందల కోట్లు వాటాలు పంచుకున్నారా? కేరళ ఎన్నికలకు సమర్పించాల్సిన రూ.వెయ్యి కోట్ల మూటలకు ఈ సొమ్మును సర్దుబాటు చేశారా? ప్రస్తుతం వినిపిస్తున్న ప్రశ్నలు ఇవే. చివరికి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పేరుతోనూ దోపిడీకి తెగబడుతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గత నెల 10న ఆర్బీఐ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.9 వేల కోట్ల రుణం తీసుకున్నది. ఇందులో 13 ఏండ్ల కాలపరిమితితో రూ.2 వేల కోట్లు, 16 ఏండ్ల కాలపరిమితితో రూ.2 వేల కోట్లు, 21 ఏండ్ల కాలపరిమితితో రూ. 2,500 కోట్లు, 27 ఏండ్ల కాల పరిమితితో మరో రూ.2,500 కొట్లు ఇలా మొత్తంగా రూ.9వేల కోట్ల రుణం సేకరించింది. రైతులకు యాసంగి రైతుభరోసా పంపిణీ కోసం ఈ రుణం తీసుకుంటున్నట్టు ప్రభుత్వం లీకులు ఇచ్చింది. పచ్చ పత్రికలు, వంత పత్రికల్లో ప్రచారం కూడా చేయించింది. కానీ నెలరోజులు గడుస్తున్నా ఇప్పటికీ కనీసం ఒక్క రూపాయి కూడా జమ చేయలేదు. రైతుల కోసం రుణ సేకరణ అనేది ఎన్నికల డ్రామా అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం గత నెల 10న ప్రభుత్వం ఈ రుణం సేకరించింది. ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు జరుగగా, 13న ఫలితాలు వచ్చాయి. మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే సర్కార్ ఈ రకమైన లీకులిచ్చిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తద్వారా రైతుల ఓట్లు కొల్లగొట్టారని, ఆ తర్వాత పక్కన పడేసిందని చర్చ జరుగుతున్నది.
రైతుభరోసా పేరుతో ప్రభుత్వం గత నెల 10న సేకరించిన నిధులు ఎక్కడికి వెళ్లాయనేది పెద ప్రశ్నగా మారింది. ప్రభుత్వం ఇప్పటివరకు రైతుభరోసా వేయలేదని, సాయం పంపిణీ చేయలేదని గుర్తు చేస్తున్నారు. రైతుల పేరు చెప్పి అప్పులు తేవడంపై మండిపడుతున్నారు. ఆ నిధులు ఏమైనట్టు? ఏం చేసినట్టు? అని ప్రశ్నిస్తున్నారు. రైతులకు పంపిణీ చేస్తే ఏం లాభం? కాంట్రాక్టర్లకు పంపిణీ చేస్తే కనీసం కమీషన్లు అయినా వస్తాయనే ఆలోచనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టుగా తెలిసింది. అందుకే బడాబాబులకు బిల్లులు క్లియర్ చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యనేత, మరో మంత్రికి సంబంధించిన బంధువులకు, అనుచరులకు చెందిన కంపెనీలకు కాంట్రాక్టుల బిల్లులు చెల్లించినట్టుగా సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. తద్వారా వందల కోట్ల కమీషన్లు కొల్లగొట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఓ వైపు రైతుభరోసా కోసం తీసుకొచ్చిన 9వేల కోట్ల రుణం రైతులకు పంపిణీ చేయకపోవడం, మరోవైపు యాసంగి ముగింపు దశకు చేరుకున్నా ప్రభుత్వం రైతుభరోసా ఊసెత్తకపోవడంతో కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతుభరోసా పథకాన్ని రద్దు చేసే దిశగా కాంగ్రెస్ సర్కార్ అడుగులు వేస్తున్నదని మొదటి నుంచీ అనుమానాలు ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు రైతుభరోసా పథకంపై ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అనే విధంగానే కొనసాగుతున్నది. ఐదు సీజన్లలో ఒకే ఒక్క సీజన్లో మాత్రమే పూర్తిగా భరోసా ఇచ్చింది.
మిగిలిన నాలుగు సీజన్లలో ఒక సీజన్ పూర్తి ఎగవేయగా, రెండు సీజన్లు సగం మందికి కూడా ఇవ్వకుండా ముగించేసింది. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో కూడా ‘రైతుభరోసా ఎందుకు’ అనే విధంగా సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. ఈ పథకం అమలు వల్ల ప్రభుత్వంపై ఏటా మోయలేనంత ఆర్థిక భారం పడుతున్నదని, అందువల్ల పథకాన్ని రద్దు చేసి పంటలకు బోనస్ ఇచ్చే పథకం గురించి ఆలోచించాలని కలెక్టర్లకు సూచించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కాంగ్రెస్ సర్కార్ రైతుభరోసా పథకాన్ని చరిత్రలో కలిపేయబోతున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.